iDreamPost
android-app
ios-app

తొందరపడి ఓ కోయిల ముందే కూసింది

తొందరపడి ఓ కోయిల ముందే కూసింది

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రోజుకో కొత్త వివాదంతో నిత్యం పతాక శీర్షికల్లో కనిపిస్తోంది. తాజాగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను దేశద్రోహులుగా అభివర్ణించిన కంగనా, అన్నదాతలను విచ్ఛిన్నకర శక్తులుగా పేర్కొంది. ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొంటున్న మహేందర్ కౌర్ అనే మహిళా రైతును వంద రూపాయలు తీసుకొని ఆందోళనలో పాల్గొంది అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. ఈ సారి కంగనా కాన్సంట్రేషన్ గ్రేటర్ ఎన్నికల వైపు మళ్లింది.

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా వెలువడిన పోస్టల్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించడం పట్ల కంగనా స్పందించింది. బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోందన్న కంగనా పనిలో పనిగా కాంగ్రెస్ పైనా విమర్శలు గుప్పించింది. ‘ప్రియమైన కాంగ్రెస్ పార్టీ… మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి అంటూ ట్వీట్ చేసింది. రోజంతా కంగనా అంటూ నా జపం చేయడంవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించింది. క్లిష్టమైన నగరాల్లో బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోందని, కొత్తగా చాలా ప్రాంతాల్లో విజయం సాధిస్తోందని పేర్కొంది.

బీజేపీ అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న కంగనా గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో తొలిరౌండ్ పూర్తికాకముందే కాషాయ పార్టీ గెలుపు కాయమనే భావనకొచ్చింది. బీజేపీ ఆశిస్తున్నట్లే గ్రేటర్ లో కాషాయ జెండా ఎగురుతుందన్న విశ్వాసాన్ని కంగనా రనౌత్ వ్యక్తం చేసింది. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు కంగన ట్వీట్ ఉందంటున్నారు పలువురు. చూడబోతే బీజేపీ శ్రేణుల పరిస్థితి కూడా ఇలా తలకింద్రులయ్యేలా కనిపిస్తోంది.