iDreamPost
android-app
ios-app

అచ్చెన్న తీరుతో చంద్రబాబు ముచ్చెమటలు…!

అచ్చెన్న తీరుతో చంద్రబాబు ముచ్చెమటలు…!

రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు పైకి బాగానే కనిపించినా అప్పుడప్పుడు భూమరాంగ్‌ అవుతుంటాయి. ఆశించింది ఒకటైతే ఫలితం మరొకలా వస్తుంటుంది. ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి పరిస్థితీ అలాగే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ధికాలం కిందట చంద్రబాబు తనదైన లెక్కలతో కింజారపు అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడి పీఠంపై కూర్చోపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అచ్చెన్న తనకంటే ముందు ఆ పదవిలో ఉన్న కళా వెంకట్రావులా కాకుండా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేస్తుండటంతో చంద్రబాబు తెగ ఇదైపోతున్నారని టీడీపీ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి.

చంద్రబాబు నిజాయితీగా ప్రజా మెప్పు పొందే ప్రయత్నం ఏనాడు చేయలేదు. ఆయ రాజకీయ ప్రస్తానాన్ని గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమౌతుంది. మీడియాతో మభ్యపెట్టడం, కులాలు మధ్య చిచ్చుపెట్టడం, డబ్బు వెదజల్లడం, ప్రలోభ పెట్టి లోభరచుకోవడం వంటి చర్యలతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటూ వచ్చారనేది నిర్వివాదాంశం. కానీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంటి యువనేత బాబుకు ఎదురొడ్డి నిలబడటం, రాష్ట్ర ప్రజల్లో వచ్చిన చైతన్యం పాళ్లు పెరగడంతో చంద్రబాబు టక్కుటమార విద్యలేవీ పనిచేయడం లేదు. దాంతో వైఎస్సార్‌సీపీని ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక చంద్రబాబు వేస్తున్న ఎత్తులు ఆయన తలకే బొప్పి కట్టిస్తుండటం గమనార్హం.

తాజా విషయానికే వస్తే శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుది తొలి నుంచి దూకుడు స్వభావమే. పెద్దగా మాట్లాడుతూ అందర్నీ డామినేట్‌ చేయాలనుకొనే స్వభావం ఆయనది. ఇటీవల ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్న జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వైఎస్సార్‌సీపీ బీసీలను వేధిస్తోందంటూ చంద్రబాబు తనదైన కుల రాజకీయం చేయాలని చూశారు. అయితే అది పెద్దగా ఫలించలేదు. కానీ, ఆశ వదులుకోని చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రతోపాటు కోస్తాలోని బీసీ ఓట్లను తిరిగి పొందాలనే లక్ష్యంతో అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించేశారు. అచ్చెన్నను అధ్యక్ష కుర్చీలో కూర్చోబెట్టి వైఎస్‌ జగన్‌ను తిట్టించాలనేది ఆయన వ్యూహం. వైఎస్సార్‌సీపీ కనుక అచ్చెన్నపై ప్రతిదాడికి దిగితే బీసీలపై దాడిగా చిత్రీకరించాలనేది చంద్రబాబు అసలు వ్యూహంగా ఉంది.

చంద్రబాబు వ్యూహం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఏమో కానీ, ప్రస్తుతానికి బాధనే మిగుల్చుతున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష సీటులో కూర్చున్న అచ్చెన్న..కళా వెంకట్రావులా అన్నింటికీ పెదబాబు, చినబాబులవైపు చూడకుండా తనదైన శైలిలో పార్టీపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా చంద్రబాబు నియమించిన పార్టీ పార్లమెంటరీ ఇంచార్జ్‌లతో నేరుగా టెలీకాన్ఫెరెన్స్‌ సమీక్ష నిర్వహించారు. దాంతో చంద్రబాబుకు గొంతులో వెలక్కాయపడినట్లయింది. పైకి చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యం అని అచ్చెన్న చెప్తున్నప్పటికీ పార్టీపై పట్టుసాధించడమే ఆయన తొలి ప్రాధాన్యం అని గుసుగుసలు వినిపిస్తుండటం…చంద్రబాబుకు బీపీ తెప్పిస్తున్నాయి.

అచ్చెన్న నియామకం చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేశ్‌ను సైతం ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. టీడీపీలో యువ నాయకుడు, భావి అధ్యక్షుడిగా చలామణి అవుతున్న లోకేశ్‌కు అచ్చెన్నాయుడు అన్న కుమారుడైన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడి రూపంలో పోటీ ఎదురుకానుందని సమాచారం. బాబాయి అధ్యక్షుడు కావడంతో ఆయన అండతో రామ్మోహన్‌నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలం కావాలని చూస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఎప్పుడూ జిల్లా రాజకీయాలపై మాట్లాడే రామ్మోహన్‌నాయుడు ఇటీవల రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. మంచి వక్త, ఓటమెరుగని ట్రాక్‌ రికార్డు కలిగిన రామ్మోహన్‌నాయుడితో పోల్చితే లోకేశ్‌ తేలిపోవడం సహజం. నిజంగా రామ్మోహన్‌నాయుడి అడుగులు ఆ దిశగానే సాగితే రాబోయే రోజుల్లో లోకేశ్‌కు ఇబ్బందులు తప్పవు. చూస్తుంటే బాబాయ్‌ అబ్బాయ్‌లు(అచ్చెన్న, రామ్మోహన్‌) భవిష్యత్తులో తండ్రీకొడుకులకు(చంద్రబాబు, లోకేశ్‌) ముచ్చెమటలు పట్టించేలా ఉన్నారు..!