Idream media
Idream media
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేంతుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని, అధినాయకుడు చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని భీంకరంగా ప్రకటించారు. శక్తి వంచన లేకుండా ప్రయత్నం ఏమోకానీ, పార్టీ గురించి, నాయకుడు కొడుకు గురించి అచ్చెన్న చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో టీడీపీ వంచనకు గురైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే వరుస ఓటములతో టీడీపీ అధోగతి పాలైంది. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ అనివార్యం కావడంతో చంద్రబాబు తన అనుభవాన్ని అంతా రంగరించి అక్కడ కనీసం డిపాజిట్ అయినా గల్లంతు కాకుండా చూసుకునేందుకు నానా అవస్థలూ పడుతున్నారు. ఈ క్రమంలోనే అచ్చెన్న వీడియో వైరల్ కావడంతో అధిష్ఠానం ఖంగుతింది. సిక్కోలు బిడ్డపై అబద్ధపు ప్రచారం అంటూ దాన్ని పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అప్పటికే అది ప్రపంచాన్ని చుట్టేసింది.
ఆ వీడియో వైరల్ కావడానికి ఒక్కరోజు ముందే తిరుపతి రోడ్ షోలో ఓ రాయి ని చూపిస్తూ చంద్రబాబు నాయుడు సానుభూతి పొందే ప్రయత్నాలను చేశారు. వైసీపీ పార్టీ కుట్రగా అభివర్ణిస్తూ కనీసం నాలుగు ఓట్లయినా సంపాదించుకుందామని పెద్ద డ్రామాకు తెరతీశారు. దానిపై చర్చ ప్రారంభమై 24 గంటలు కూడా కాకముందే ఆ ఘటన మరుగున పడి టీడీపీ కొంప ముంచే మరో అంశం తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ను రాష్ట్రాన్ని కాబోయే నేతగా తీర్చిదిద్దాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. స్వయానా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఆయనను చీపురు పుల్లగా తీసి పాడేసినట్లు మాట్లాడడం తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. లోకేశ్ సరిగ్గా ఉంటే టీడీపీకి ఇంత దుస్థితి ఎందుకని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఇలా అనడం, అది వెలుగులోకి రావడం తెలుగుదేశానికి కోలుకోలేదని దెబ్బ.
సోమవారం రోడ్ షో అనంతరం ప్రచారం ముగిసే దాకా రాయి ఎపిసోడ్ ను సాగదీద్దామనుకున్న టీడీపీ అండ్ కో ప్రయత్నాలు కనీసం 24 గంటలు కూడా గడవక ముందే మరుగున పడ్డాయి. టీడీపీకి భవిష్యత్ లేదు, బొక్కా లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే అంటే ఇక ప్రజలు ఓట్లు వేస్తారా..? అనే ప్రశ్న ఇప్పుడు తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మిని బహుశా తొలిచేస్తూ ఉండొచ్చు. ఆమె గత ఎన్నికల్లో సుమారు 5 లక్షలకు పైగా ఓట్లు పొందారు. మరోసారి పోటీకి ఆమె అయిష్టంగానే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై భరోసాతో ముందుకు వెళ్తున్న ఆమెకు అచ్చెన్నాయుడు పెద్ద షాక్ ఇచ్చారు.
నిన్న రాత్రి రాళ్ల దాడి ఘటనతో పొలిటికల్‌గా మైలేజ్ వచ్చిందన్న సంబరం పట్టుమని ఒక్కరోజు కూడా ఆమెకు నిలబడ లేదు. పైగా అంత క్లియర్ కట్ గా వీడియో, అందులో అచ్చెన్న వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కానీ అచ్చెన్న మాత్రం తన వ్యాఖ్యలను వక్రీకరించారు అంటున్నారు. అంటే వీడియో నిజమే అని ఆయన ఒప్పుకున్నట్లే. అయితే, ఆ వ్యాఖ్యలు తాను చేయలేదంటున్నారు. పైగా ఇదీ కూడా జగన్ పనే అని చెప్పేశారు. ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవని జగన్ పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎన్ని విష పన్నాగాలు పన్నినా టీడీపీ విజయాన్ని ఆపలేవట. ఇంకెక్కడి విజయం.. నువ్వు చేసిన పనికి కనీసం డిపాజిట్ దక్కితే అదే గొప్ప అంటూ నిట్టూరుస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.