iDreamPost
android-app
ios-app

అచ్చెం నాయుడుకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

అచ్చెం నాయుడుకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్‌ ఇచ్చింది. అనారోగ్యంతో ఉన్న తనకు బెయిల్‌ ఇవ్వాలని అచ్చెం నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అచ్చెం నాయుడును ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని, ఈ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఈ సమయంలో ఆయనకు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఏసీబీ వాదనతో కోర్టు ఏకీభవించింది.

గత నెల 13వ తేదీన 150 కోట్ల రూపాయల ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో అచ్చెం నాయుడును ఆయన స్వగ్రామంలో అరెస్ట్‌ చేశారు. కోర్టులో హజరుపర్చగా ఫైల్స్‌ ఆపరేషన్‌ కావడంతో న్యాయమూర్తి జుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. అప్పటి నుంచి ఈ నెల 1వ తేదీ వరకూ అచ్చెం నాయుడు గుంటూరు సర్వజన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అచ్చెం నాయుడు ఫైల్స్‌ ఆపరేషన్‌ గాయం పూర్తిగా మానిందని జీజీహెచ్‌ వైద్యులు ఆయన్ను ఒకటో తేదీ సాయంత్రం డిశ్ఛార్జి చేశారు. అయితే తన ఆరోగ్యం బాగోలేదంటూ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో నిన్న పిటిషన్‌ దాఖలు చేశారు.

కాగా, అనారోగ్యంతో ఉన్న తాను మెరుగైన వైద్యం పొందేందుకు ప్రైవేటు ఆస్పతికి తరలించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అచ్చెం నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ అంశంపై రేపు తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏసీబీ కోర్టులో చుక్కెదురైన అచ్చెం నాయుడుకు హైకోర్టులోనైనా ఊరట లబిస్తుందా..? లేదా..? చూడాలి.