iDreamPost
iDreamPost
టాలీవుడ్ స్పిల్బర్గ్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంకా జక్కన్న టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సగానికి పైగానే లాక్ డౌన్ కు ముందు షూట్ అయినప్పటికీ అసలైన భాగం మిగిలిన బ్యాలన్స్ లోనే ఉండటంతో కరోనా నేపథ్యంలో ఎలా స్టార్ట్ చేయాలో అంతుచిక్కడం లేదు. యూనిట్ మొత్తాన్ని ఒకేచోట లాక్ చేసేలా ప్లాన్ చేసుందామా అంటే ఇదేమి ఇన్ హౌస్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాదు. చాలా లొకేషన్లు అవసరమవుతాయి. అందులోనూ దేశవిదేశీ ఆర్టిస్టులు పాల్గొనాల్సి ఉంటుంది. ఇది తేలడానికి మరో నెల రెండు నెలలు పట్టేలా ఉంది.
ఇందులో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు జోడిగా శ్రియ శరన్ కనిపిస్తుంది. అయితే వీళ్ళ ట్రాక్ సినిమాలో ఎక్కువ సేపు ఉండదట. కేవలం క్యామియో తరహాలో పావు గంట కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. అజయ్ దేవగన్ కు కొన్ని ఎక్కువ సీన్లు ఉండొచ్చని, శ్రియ పాత్ర బ్రిటిషర్ల చేతిలో బలయ్యే తరహాలో ఏదో ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టుగా వినికిడి. ఆమెతో పాటు అజయ్ దేవగన్ క్యారెక్టర్ కూడా అసువులు బాస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీళ్ళకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు కనెక్షన్ ఏమిటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. లాక్ డౌన్ వల్ల ఆరు నెలలుకు పైగా ఇళ్లకే పరిమితమైన ఈ ఇద్దరూ ఎప్పుడెప్పుడు సెట్లోకి అడుగు పెట్టాలా అని ఎదురు చూస్తున్నారు. అయితే స్వయానా రాజమౌళినే కరోనా బారిన పడి కోలుకోవడంతో ఎవరూ తొందరపడటం లేదు.
ఇంకా అలియా భట్, ఒలివియా డేట్లు ఖరారు కావాల్సి ఉంది. ఏ లెక్కన చూసినా వచ్చే ఏడాది ఆర్ఆర్ఆర్ రావడం అనుమానమే. అదే 2022 సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటే అప్పటికి వైరస్ మహమ్మారి పూర్తిగా తగ్గిపోవడమే కాక వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చి ఉంటుంది కాబట్టి ఎప్పటిలాగే థియేటర్లకు జనం పూర్తి స్థాయిలో రావడం అలవాటు అయ్యుంటుంది. అసలే నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తీస్తున్న సినిమా కాబట్టి ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదు మరి. అజయ్ దేవగన్ తాలుకు సీన్లు ఇంకేమి పెండింగ్ లో ఉన్నట్టు లేవు. గతంలోనే పూర్తి చేశారు. ఒకవేళ ఉన్నా మరీ ఎక్కువ టైం పట్టకపోవచ్చు కాబట్టి త్వరగానే పూర్తి చేస్తారు. టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మీద అన్ని హక్కులు కలిపి వెయ్యి కోట్ల దాకా బిజినెస్ అంచనాలు ఉన్నాయి. కాంబినేషన్ కున్న క్రేజ్ అలాంటిది మరి