iDreamPost
android-app
ios-app

కొత్తపలుకు – అదే ఏడ్పు.. ట్యూన్ లో మార్పు

  • Published Feb 13, 2022 | 3:31 AM Updated Updated Feb 13, 2022 | 3:31 AM
కొత్తపలుకు – అదే ఏడ్పు.. ట్యూన్ లో మార్పు

ఆరాటం పెళ్లి కొడుకు పేరంటాలు మెడలో తాళి కట్టాడట! అచ్చం అలాగే ఉంది ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆత్రం. సార్వత్రిక ఎన్నికలు జరిగి మూడేళ్లు కూడా పూర్తి కాలేదు. మళ్లీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా? తన బాస్ చంద్రబాబు అఖండ విజయం సాధించి, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా?అర్థాంతరంగా ఆగిపోయిన పచ్చ సామ్రాజ్య విస్తరణ ఎప్పుడు కొనసాగిద్దామా అన్న ఆత్రుత ఆయనలో రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఆ కంగారులో ఆయన తన విచక్షణ కోల్పోతున్నారు. అందుకే ఆయన అక్షరాలు గుడ్డలు విడిచి మరీ నృత్యం చేస్తున్నాయి. ఆయన ఆశ తీరే పరిస్థితులు రాష్ట్రంలో లేకపోయినా తన మీడియా హౌస్ సాయంతో ఆ వాతావరణం సృష్టించగలనని ఆయన నమ్ముతారు. తన కొత్తపలుకు సాయంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఉన్న విశేష జనాదరణకు తూట్లు పొడవాలని ప్రయత్నం చేస్తుంటారు. 

చర్చలు ఏవైనా అదే పచ్చ రచ్చ..

పీఆర్సీ కోసం ఆందోళన బాట పట్టిన ఉద్యోగులతో, సినిమా సమస్యలపై ఆ రంగ ప్రముఖులతో ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపి పరిష్కారం దిశగా అడుగులు వేయడం రాధాకృష్ణకు బొత్తిగా నచ్చలేదు. ఆ విధంగా సమస్యలు సమసిపోతే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. ఇది ఆయన ఆశకు గండికొడుతుంది.

అందుకే ఆ చర్చలు జరిపిన తీరును తప్పుపట్టేశారు. చర్చల్లో పాల్గొన్న వారి చిత్తశుద్ధిని తనదైన శైలిలో శంకించారు. పీఆర్సీ తేల్చకపోయినా ఆ నలుగురు ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి జగన్ కు అదేపనిగా థ్యాంక్స్ చెప్పినట్టుగానే సినీహీరోలు కూడా జీరోలుగా మారిపోయి థ్యాంక్స్ చెప్పేశారని తెగ బాధపడిపోయారు. చర్చలకు వెళ్ళిన సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని రాసేశారు. ఇది మొత్తం సినీ పరిశ్రమకే కాకుండా తెలుగుజాతికి జరిగిన అవమానంగా అభివర్ణించి రాధాకృష్ణ తన కల్పనా చాతుర్యానికి తానే ముగ్థులైపోయారు.

సినీ ప్రముఖులపై సీఎంకు కక్ష అట!

తనను ముఖ్యమంత్రిగా గుర్తించని సినీ ప్రముఖులపై ఎప్పటినుంచో జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నారని రాధాకృష్ణ ఒక దారుణమైన అవాస్తవాన్ని రాసేశారు. అందుకే కావాలనే సినిమా టికెట్ల ధరలను తగ్గించి సినీ ప్రముఖులను తన కాళ్ల దగ్గరకు రప్పించుకొని మరీ అవమానించారని సీఎంకు, వారికి లింకు పెట్టడానికి ట్రై చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డికి ఐదుకోట్ల మంది జనాభాలో ఉన్న ఆదరణ గురించి వేరే చెప్పనవసరం లేదు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఓటుహక్కు కూడా లేని సినీ ప్రముఖులు తనను గుర్తించలేదని కక్ష కట్టడం ఏమిటో!

ఆడుగడుగునా అవమానాలేనట..

మెగాస్టార్ చిరంజీవి వెంట వెళ్ళిన హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివకు సీఎం నివాసం వద్ద అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని భాధాకృష్ణ వాపోయారు. వారి కార్లను గేటు బయటే ఆపేయడంతో కాలినడకన లోపలకు వెళ్లగా అక్కడ ఎటువంటి స్వాగతాలు లభించలేదని పేర్కొన్నారు. లోపలకు వెళ్లాక వైఎస్సార్ సీపీ తరపున ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న కమెడియన్ ఆలీ, రచయిత పోసాని కృష్ణమురళి వంటి వారిని ప్రముఖుల మధ్య చర్చలలో కూర్చోబెట్టారని అవేదన వ్యక్తం చేశారు. అంటే రాధాకృష్ణ దృష్టిలో ఆలీ, పోసానికి చర్చలో పాల్గొనే అర్హత లేదన్నమాట. చిరంజీవి దీనంగా సీఎం తన చల్లని చూపు పరిశ్రమ వైపు చూడాలని వేడుకున్న తీరును మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని రాసేశారు. మహేష్ బాబు కూడా ఇంచుమించు ఇలాగే రెండేళ్లుగా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారని తప్పుబట్టారు. చర్చల అనంతరం వారంతా మీడియాతో మాట్లాడడానికి ఒక స్టాండ్ ఏర్పాటు చేశారని, కుర్చీలు కూడా లేకుండా ఎండలో నిలబడే సినీ ప్రముఖులు జగన్ కు థ్యాంక్స్ చెప్పడానికి పోటీ పడ్డారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

చిరంజీవి మాట్లాడుతుండగా జగన్ ఆయన వైపు చూడలేదని ఇది కూడా అవమానమేనని రాధాకృష్ణ తీర్మానించేశారు. గతంలో చిరంజీవి సతీసమేతంగా జగన్ ఇంటికి వెళ్లినప్పుడు కారు వరకు జగన్ దంపతులు వెళ్లి సాగనంపారు. ఇప్పుడు ఇందరు ప్రముఖులు వచ్చినా కనీస మర్యాదకు నోచుకోలేదు అని తీవ్రంగా రాధాకృష్ణ నొచ్చుకున్నారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే పోర్టికోలోని తన కారును తీయించి వేసి, వారి కార్లను లోపలి వరకు పోనిచ్చేవారని, శాలువాలు కప్పి ఆహ్వానించి, అన్ని డిమాండ్లను పరిష్కరించేవారు అని రాశారు. ఆ విధంగా బాబు స్వర్ణయుగంలో ఉండే సౌకర్యాలను వేమూరివారు వివరించారు. అయితే చంద్రబాబుకు సినీ ప్రముఖులను తన పార్టీ ప్రచారానికి పిలిపించుకొనే అలవాటు ఉంది కనుక అలా సాగిల పడతారు. జనంలోంచి వచ్చిన నాయకుడు జగన్ సీఎంగా హుందాగా వ్యవహరిస్తూనే వారికి తగినంత గౌరవం ఇచ్చి చర్చలకు ఆహ్వానించారు.

చర్చల వీడియోను ప్రభుత్వం బయటకు విడుదల చేసి కూడా సినీ ప్రముఖులను అవమానపరిచిందని రాధాకృష్ణ బరికేశారు. ఇన్ని అవమానాలు సహిస్తూ సీఎం ముందు సాగిలపడే కన్నా సినీ ప్రముఖులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయం జరిగేది అని తన మనసులో ఉన్న అసలు ఉద్దేశం కూడా రాధాకృష్ణ బయటపెట్టేసుకున్నారు. రాజమౌళి, ప్రభాస్ వంటి వారికి ఆత్మాభిమానం కన్నా డబ్బు ముఖ్యం కాదు కదా! వారు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ఈ అవమానాలు తప్పేవి అని రాసి వారిని ముఖ్యమంత్రిపైకి రెచ్చగొట్టానని వేమూరి మురిసిపోయారు. అదే పవన్ కల్యాణ్ తన సినిమాలకోసం ఎక్కడా రాజీపడలేదు. నిజజీవితంలో కూడా ఆయనే హీరోనే అని జనసేన అధినేతకు రాధాకృష్ణ వీరతాడు వేశారు. అంటే చంద్రబాబు ఆడుగు జాడల్లో నడుస్తున్నారు కనుక పవన్ హీరో. సీఎంతో చర్చలకు వెళ్లారు కనుక వీరంతా జీరోలు అని రాధాకృష్ణ నిర్థారించేశారు. ఇలా తన రాజకీయ పైత్యాన్ని సినీ ప్రముఖులకు ముడిపెట్టడం వారిని అవమానించడం కాదా?

అవే అవాకులు చవాకులు..

ఆర్థిక నేరాల్లో ముద్దాయిని ఎన్నుకున్న సమాజంలో స్మగ్లర్లు హీరోలు అవుతారు అంటూ పుష్ప సినిమాపై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు రాధాకృష్ణ స్పందించారు. ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ కేసులు పెట్టించి కాంగ్రెసు సహాయంతో ఆయనను నిబంధనలకు విరుద్ధంగా 16 నెలలు జైలులో పెట్టారు. అప్పటి నుంచి ఆర్థిక నేరగాడు అంటూ ముద్ర వేసి పచ్చ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. జనం ఈ కుట్రలు అర్థం చేసుకున్నారు కనుకే బాబుకు బుద్దిచెప్పి జగన్ ను తిరుగులేని మెజార్టీతో గెలిపించారు. మరోపక్క జగన్ పై ఉన్న కేసులు న్యాయస్థానాల్లో ఒక్కొక్కటి వీగిపోతున్నాయి. అయినా అవే ఆరోపణలు పదేపదే చేస్తూ జగన్ ను అవమానించేస్తున్నాను అని రాధాకృష్ణ జబ్బలు చరుచుకుని సంబరపడి పోతుంటారు.

గురువిందను గుర్తుకు తెస్తూ..

తను పనిచేసిన ఆంధ్రజ్యోతికి సైకిల్ పై వెళ్లి వార్తలు సేకరించిన స్థితి నుంచి ఆ పేపరుకు యజమాని అయిపోయిన రాధాకృష్ణకు మించిన నేరగాడు ఎవరు ఉంటారు? ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఘటనలో కత్తి అందించడం, నాడు ప్రజాస్వామ్యంపై జరిగిన సామూహిక అత్యాచారంలో చురుకైన పాత్ర పోషించడం వంటి క్వాలిఫికేషన్ల వల్ల కదా రాధాకృష్ణ నేడు ఈ భోగం అనుభవిస్తున్నది. గురువిందలా ఇంత నలుపు తన దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రిపై నిందలు వేస్తే ఎవరు నమ్ముతారు?

జియర్ స్వామిపైనా గుర్రు..

హైదరాబాద్ లో సమతామూర్తి రామానుజాచార్యులు విగ్రహ సందర్శనకు వెళ్ళిన సీఎం జగ న్ ను ప్రశంసించడం ఏమిటంటూ చినజీయర్ స్వామిపై రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకేముంది ఆయనపై, మై హోం రామేశ్వరరావుపై సీఎం కేసీఆర్ కోపంగా ఉన్నారు. 14వ తేదీన ముచ్చింతల్ లో కార్యక్రమం ముగిశాక వీరి పని అయిపోయినట్టే అన్నట్టు ఏవేవో లింకులు పెట్టి రాసేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని స్వయంగా ఆహ్వానించిన జీయర్ ప్రతి పక్షాలని పిలువలేదని బాధపడిపోయారు. దాని అర్థం ప్రపంచ మేధావి చంద్రబాబును ఎందుకు ఆహ్వానించలేదు అని జీయర్ స్వామిపై మనం కోప్పడాలన్నమాట!

మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కి థ్యాంక్స్ చెప్పిన ఉద్యోగ సంఘాల నాయకులు, సినీ ప్రముఖులు, మెచ్చుకున్న చినజీయర్ స్వామి రాధాకృష్ణ దృష్టిలో చాలా పెద్ద పాపం చేశారు. దానికి నిష్కృతి లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తరపున వీరు ప్రచారం చేస్తే కొంతైనా ఉపశమనం కలుగుతుంది. లేదంటే రౌరవాది నరకాలు అనుభవిస్తారు!

Also Read : ఒక కలం..రెండు కలలు – వన్నె తగ్గని ‘కుట్ర’పలుకు