ఏపీ సీఎం జగన్ పై నిరంతరం విమర్శలు చేస్తూ చెలరేగిపోయే రాధాకృష్ణ అలియాస్ ఆర్కే తాజాగా ఓ కథనాన్ని వండి వార్చారు. జగన్ పై కోపంతో ఆ కథనం దారి తప్పింది.
రాధాకృష్ణ గారి ఆంధ్రజ్యోతిలో ‘ఆ ముగ్గురిపై గురి’ అంటూ ఓ కథనం ప్రచురితమైంది. జగన్ అక్రమాస్తుల కేసులో మొదట ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ నేత శంకర్రావు అయినా తరువాత అశోక్ గజపతిరాజు, ఎర్రంనాయుడు గట్టిగా పట్టుపట్టారని ఆర్కే ఉవాచించారు. ఈ కేసులో దమ్మాలపాటి శ్రీనివాస్ తనకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడంతో జగన్ వీరిపేర్లను గుర్తు పెట్టుకున్నారట. వీరిపై ప్రతీకార చర్యల కోసం జగన్ 2014 నుంచి ఎదురుచూస్తున్నారట. అందుకే 2019లో అధికారంలోకి రాగానే జగన్ తన కార్యాచరణను అమలు చేయడం మొదలు పెట్టాడని ఆ కథనంలో ఉంది. దీని ప్రకారం వారిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఇబ్బందులలో నెట్టారని వెల్లడించారు.
ఆర్కే: ఉవాచ
ఎర్రంనాయుడుపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని భావిస్తే ఆయన మరణంతో జగన్ కు అవకాశం చిక్కలేదట. దీంతో ఏదో ఒకటి చేయాలనే కోపంతో ఎర్రంనాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడుపై టార్గెట్ చేసారట. అందుకే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడిని ఇరికించి జైలుకి పంపారట. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఎర్రంనాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు జోలికి పోయే సాహసం జగన్ చేయలేదని అభిప్రాయపడుతూ ఈ కథనాన్ని వండివార్చారు. ఇక విజయనగరం రాజు గారు అశోక్ గజపతి విషయంలో 100 అడుగులు ముందుకేసి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గిరికి ముడిపెడుతూ మధ్యలో బీజేపీ మీద కూడా తన కసి తీర్చుకున్నారు.
జగన్ కే తెలియని కొత్త కోణం
అన్న చనిపోతే తనయుడిపై కాకుండా తమ్ముడిపై కోపం పెంచుకోవడం సీమ మార్క్ అంటూ వచ్చిన ఈ కథనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీమకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ ఆయా జిల్లాలో తీవ్రంగా నష్టపోయింది. టీడీపీ కరపత్రికగా ఉన్న ఆంధ్రజ్యోతి మరోమారు సీమపై విషం చిమ్మింది. బీజేపీ యువ మోర్చా నాయకురాలుగా ఉన్న సంచయుత గజపతి రాజును జగన్ ఏరికోరి ఎంచుకొని బీజేపీ మద్దతుతో ఆమెకు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు లాంటి వారు ఆమెను వద్దని వారించినా బీజేపీ అధిష్ఠానం నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్పుకొచ్చారు. ఆర్కే చెప్పిన ఈ కోణాలు జగన్ కు కూడా తెలిసి ఉండవని ప్రచారం జరుగుతోంది.
ఆర్కే మరిచిపోయిన మరో కోణం
మొదట కేసు వేసిన శంకర్రావు, కేసును దర్యాప్తు చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జగన్ ఆస్తుల వాల్యుయేషన్ చేసిన ఐఆర్ అధికారి జాస్తి కిషోర్ లపై జగన్ ఎందుకు ప్రతీకార చర్యలు తీసుకోలేదో చెప్పడం ఆర్కే చెప్పడం మర్చిపోయారా? ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ, అన్నే సుధీర్ బాబు, కోడెల శివప్రసాద్, కొల్లు రవీంద్ర, జేసీ సోదరులు, అయ్యన్నపాత్రుడు లాంటి వారిపై ప్రతీకార చర్యలకు జగన్ అక్రమాస్తుల కేసులకు ముడిపెట్టడం మరచిపోయారు. రాష్ట్రంలో ఏ చిన్న విషయం జరిగినా దానికి జగన్ చుట్టూ కథనం వండి వార్చడం ఆర్కేకి అలవాటే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇన్ని విషయాలు చెప్పిన ఆర్కే ఆ ఒక్క విషయం చెప్పిఉంటే బాగుండేది. డాక్టర్ రమేష్ కుమార్ పై జగన్ కోపం పెంచుకోవడానికి గల కారణమేంటని ఆర్కే చెప్పడం మర్చిపోయారు. కానీ ఆర్కే థీసిస్ ఏంటో జనాలు తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు!!