iDreamPost
android-app
ios-app

తీరు మారదు మనిషి మారడూ అతని రాత మారదూ ….

  • Published Dec 13, 2020 | 6:56 AM Updated Updated Dec 13, 2020 | 6:56 AM
తీరు మారదు మనిషి మారడూ అతని రాత మారదూ ….

తాను చేస్తే వ్యాపారం మరొకరు చేస్తే లాలూచీ వ్యవహారం అనే ధోరణి రాధాకృష్ణలో రోజురోజుకీ ప్రబలిపోతున్నట్టు ఉంది . భజన పరుల దేవుడు అంటూ ఈ రోజు వండి వార్చిన కొత్త పలుకులో ఆ ధోరణి సరికొత్త పోకడలు పోయింది . అమరావతి ఉద్యమ కారుల పై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టటమా , ఇదెక్కడి చోద్యం , దీన్ని కోర్టులో ఎలా సమర్ధించుకొంటారు అంటూ నేర నిర్ధారణ , కోర్టు విచారణ , తీర్పు , కోర్టు అక్షింతల ఘట్టాలు తానే ఊహించేసుకొని రాయటం చూస్తే పైత్యం పరాకాష్టకు చేరిందని చెప్పొచ్చు .

అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్న అమరావతి ప్రాంతవాసుల్లో కొందరు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించడాన్ని కోర్టులో అడ్డుకొన్నందుకు నిరసన వ్యక్తం చేయడానికి ఆటోల్లో వెళ్తుండగా అమరావతి అనుకూల ఉద్యమ కారులు ట్రాక్టర్లు అడ్డు పెట్టి వారిని అడ్డగించి దూషించడం , దాడికి యత్నించడం ప్రజలు పలు ఛానళ్లలో చూసారు . పత్రికల్లో చదివారు . అయితే రాధాకృష్ణకి మాత్రం ఈ నేర ఘటనలేవీ కనపడవు , కనపడినా అక్షరాల్లో ప్రతిబింబించవు . చంద్రబాబుకి పనికి వచ్చే అంశాలు మాత్రమే కనబడతాయి . బాబు కోసం మాత్రమే కలం కొత్త పలుకుల సిరా వొలికిస్తుంది . బాబుకి వ్యతిరేకమైతే నగ్న సత్యాలైనా వాటికి మందపాటి ముసుగు కప్పబడుతుంది . ముసుగుకి గుడ్డ చాలని పక్షంలో ఉన్న చిన్నపాటి వస్త్రంతో కళ్ళకు గంతలైనా కట్టుకొంటారు కానీ నిజాన్ని గుర్తించి రాయడానికి చేతులు రావు .

వ్యక్తిగతంగా చంద్రబాబుని దూషిస్తున్నారు . అందుకే కొడాలి నానీకి , అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవులిచ్చారు అంటూ ఇరువురు మంత్రుల పై తీవ్ర అక్కసు వెళ్లగక్కారు . అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చర్చ కొంత పరిధి దాటి పరస్పర దూషణ స్థాయికి వెళ్లిన మాట వాస్తవమే . మంత్రి నాని దూకుడుగా కొంత అభ్యంతరకర భాష వాడారు కానీ మంత్రి అనిల్ కుమార్ ఏ ఫుటేజీకి దొరక్కుండా , ఏ రికార్డ్ లేకుండా చంద్రబాబుని వ్యక్తిగతంగా ఎప్పుడు ఎక్కడ దూషించాడో రాధాకృష్ణకే తెలియాలి . ఏ ఆధారమూ లేకుండా ఎలా రాయొచ్చో తన దగ్గరే నేర్చుకోవాలి . గతంలో అసెంబ్లీ సాక్షిగా టీడీపీ నాయకుడు పాతేస్తా నా కొ…. అన్నప్పుడు కానీ , నీకు సీమ పౌరుషం ఉంటే , మగతనం ఉంటే లాంటి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అసెంబ్లీలో నాటి ప్రతిపక్ష నేత జగన్ పై వాడినా కానీ , జేసి దివాకర్ రెడ్డి నడిరోడ్డు మీద కూర్చొని సభ్య సమాజం వినలేని భాషలో తిట్టినప్పుడు కూడా గాంధీ గారి మూడు కోతుల సిద్ధాంతం పాటించడం కూడా రాధాకృష్ణ వద్దే నేర్చుకోవాలి ..

జగన్మోహన్ రెడ్డిని కొందరు దేవుడితో పోలుస్తూ కీర్తిస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు కీర్తించని ఉపమానాలైన బుద్ధుడు , అల్లా , ఏసు , వెంకటేశ్వర స్వామి లాంటి దేవుళ్ళ పేర్లు ఉటంకిస్తూ ఆరోపించిన రాధాకృష్ణ అవి ఎవరు కీర్తించారో రాయలేదు. అధికార ప్రతినిధిని , అధినేతని కీర్తించేవారు ఎప్పుడూ ఉంటారు . అలాగే ప్రభుత్వం ద్వారానో , నాయకుడి ద్వారానో లబ్ది పొంది కృతజ్ఞతతో పొగిడే వారూ ఉంటారు . పొగడ్తల విషయంలో ఇటీవల కొందరు వైసీపీ నాయకుల తీరు శృతి మించిందనే చెప్పాలి .

గోదావరి జిల్లాలో ఓ చిన్నపాటి నాయకుడు జగన్ కి గుడి కట్టే ప్రయత్నం చేయడం , కొన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారులు జగన్ చిత్రపటాన్ని పల్లకిలో పెట్టి ఊరేగించడం పట్ల తటస్థ వర్గాల వారితో పాటు , వైసీపీ శ్రేణులు కూడా అభ్యంతరం తెలిపారు . ఇవేవీ రాధాకృష్ణకి కనపడవు కేవలం పల్లకిలో ఊరేగించినది . ఒకరిద్దరు దేవుడు అంటూ భజన చేసినవి మాత్రమే దృష్టిలో పెట్టుకొని స్వయంగా జగన్ ఇలా పొగిడించుకొంటున్నాడు అని రాసుకోవడం జ్యోతికే చెల్లు .

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుని బ్రహ్మ , శ్రీరాముడు , గణపతిల రూపంలో ఫ్లెక్సీలు వేసి మరీ ఆకాశానికెత్తినప్పుడు కానీ, పోలవరం తాత్కాలిక గేటు వద్ద ప్రభుత్వ ధనంతో జయము జయము చంద్రన్న లాంటి భజన కీర్తనలు పాడించుకొన్నప్పుడు కానీ, ప్రభుత్వ పథకాల లబ్ది దారుల వాహనాల పై , వస్తువుల పై థాంక్యూ సీఎం సర్ అని ఫొటోలతో అచ్చు వేయించుకొన్నప్పుడు కానీ ఏ సందర్భంలోనూ రాధాకృష్ణకి కనపడకపోవటం ఉద్దేశ్యపూర్వకం కాక మరొకటి కాదు . ఇలాంటివి చూసినప్పుడు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు లాంటి సామెతలు జనాలకి గుర్తురాకా మానవు