iDreamPost
android-app
ios-app

రాజుల సొమ్ము రాళ్లపాలు , దాతల సొమ్ము రాధాకృష్ణపాలు

  • Published Aug 25, 2021 | 3:09 AM Updated Updated Aug 25, 2021 | 3:09 AM
రాజుల సొమ్ము రాళ్లపాలు , దాతల సొమ్ము రాధాకృష్ణపాలు

వ్యాధి బాధిత పసికందుల సొమ్ము దోచుకోవడానికి అత్యంత కఠిన పాషాణ హృదయం కావాలి . రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాత్రం రాతి గుండె జాలీ దయా లేని వ్యక్తిత్వం రాధాకృష్ణ సొంతం.

అవిభక్త కవలలు వీణావాణిల వైద్యసేవల కోసం వారి తల్లిదండ్రులకు ఆర్ధిక సాయం చేయమంటూ 2012 జనవరిలో తన ఛానెల్ లో ప్రోగ్రామ్ నిర్వహించిన రాధాకృష్ణ , నాటి నుండి 2012 ఆగస్ట్ 31 వరకూ విరాళాలు సేకరించాడు . వసూలైన సొమ్ము ఎంతో వీణావాణిల తల్లిదండ్రులకు కానీ , పత్రికా ముఖంగా కానీ లెక్క చెప్పకుండా, వాటిని వీణావాణిల వైద్య సేవలకు కానీ , వారి తల్లిదండ్రులకు కానీ ఇవ్వకుండా తొమ్మిదేళ్ల పాటు వారిని వేధించి ఈ రోజు విరాళాల సొమ్ము మొత్తం రూ ‘ 246366.00 మాత్రమే అని చెబుతూ నేటివరకూ తొమ్మిదేళ్ళకి అయ్యే వడ్డీతో కలిపి నేడు రూ 536268.00 వారి ఖాతాల్లో జమ చేస్తున్నానని చెప్పడం విడ్డూరం .

04 నవంబర్ 2015 నాడు విరాళాల సొమ్ము రూ’400000.00 అని అవి యూనియన్ బ్యాంక్ నుండి డిడి(no 481606) రూపంలో నీలోఫర్ ఆస్పత్రికి పంపామని అది వెనక్కి వచ్చిందని ఆ సొమ్ము నా వద్ద ఉందని డిసెంబర్ 2015 లో వీణావాణీల తల్లిదండ్రులకు లేఖ రాసిన రాధాకృష్ణ . 2015 లో నాలుగు లక్షల రూపాయలు విరాళాలు అని చెప్పి ఇప్పుడు రెండు లక్షల నలభై ఆరువేలు అని ఎలా చెబుతారు .

పోనీ 2015 లో ఇచ్చిన నాలుగు లక్షలు, 2012లో వసూలయ్యాయని చెబుతున్న రూ’246366 అసలుకి 2015 నాటికి వడ్డీతో కలిపి రూ’ 400000 చెల్లించాడు అనుకొన్నా 2012 నుండి 2015 వరకూ మూడేళ్ళకి అసలు పై రూ’153644 వడ్డీ చెల్లించినట్టు . మరి 2015 నుండి 2021 వరకూ తర్వాతి అరేళ్ళకి రూ’136268 మాత్రమే వడ్డీ ఎందుకు అయ్యినట్టు . రాధాకృష్ణ లెక్క ప్రకారమే మూడేళ్ళకి రూ’153644 వడ్డీ ఐతే తర్వాతి ఆరేళ్లకు వడ్డీ రూ’307288 కావాలి . అప్పుడు ఈ రోజు చెల్లించాల్సిన మొత్తం రూ’707288 చెల్లించాలి . రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగి తగ్గినట్లు తానే వడ్డీ రేట్లు పెంచి తగ్గించుకొనడం విచిత్రం . 

Also Read : నాడు పీవీ కోసం రాజీనామా చేసిన గంగుల ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అసలు ప్రజలు విరాళాలు ఇచ్చింది నీ వద్ద డిపాజిట్ చేసుకొని నీ ఇష్టం వచ్చిన వడ్డీ రేటు నిర్ణయించుకొని నీ స్వంతానికి వాడుకోవటానికి కాదు . అవిభక్త కవలల సర్జరీకి డబ్బు అవసరమని పత్రిక ద్వారా వారికి సహాయం చేయమని కోరిన రాధాకృష్ణ వారి తల్లిదండ్రుల ఖాతాలో వేయమనకుండా తన కంపెనీ ఖాతాలకు విరాళాలు జమ చేసుకోవడం చట్టవ్యతిరేకమైన చర్య . సేకరించిన విరాళాల వివరాలు పేషంట్స్ తల్లిదండ్రులకు చెప్పకుండా , పత్రికా ముఖంగా బహిరంగ పరచకుండా వారికి డబ్బు జమ చేయకుండా నిస్సిగ్గుగా వాడుకోవడం రాధాకృష్ణకే చెల్లింది .

చివరికి హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికి ఖర్చులకు కూడా డబ్బు లేదని సేకరించిన విరాళాలలో నుండి కనీసం పదివేలు ఇవ్వమని తండ్రి మురళి ఫోన్ చేసి ప్రాధేయపడితే నా నెంబర్ ఎవరిచ్చారు . మీ సంగతి తెలుస్తా అని బెదిరించడం రాధాకృష్ణ బరితెగింపుకి పరాకాష్ట .

ఈ విషయంగా వీణావాణిల తండ్రి వరంగల్ వద్ద ధర్నా చేసి రాధాకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేసినా , పలువురు జర్నలిస్టులు , తెలంగాణా అడ్వకేట్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పిర్యాదు చేసినా , ఎన్ జనార్దన్ అనే వ్యక్తి చట్టవిరుద్దంగా వీణావాణిల పేరిట రూ’25లక్షలు సేకరించి ఆ సొమ్ము వారికి ఇవ్వకుండా అక్రమంగా దోచుకున్నాడు అని కోర్టులో పిటిషన్ వేసినా , సదరు పిటిషన్ ఆధారంగా సెక్షన్ 406 , 420 , 403 , 120B ల కింద కేసులు నమోదు చేసి విచారించమని కోర్టు ఆదేశించినా , పలు పత్రికలు , ఛానెల్స్ ఇది అనైతికం అంటూ దుమ్మెత్తిపోసినా దేనికీ వెరవకుండా సొమ్ముకి కక్కుర్తి పడి భీష్మించుకుని కూర్చోవడం రాధాకే చెల్లింది .

Also Read : టిడిపి మళ్లీ అధికారంలోకి రాదా ? రాజుగారి సర్వేలో ఆసక్తికర ఫలితాలు !

ఇప్పుడు కూడా ఆ నామమాత్రపు డబ్బులు చెల్లించడం వెనక గతంలో కొందరు వేసిన కేసుల తాలూకూ ప్రభావం ఉండి ఉండొచ్చు . అందుకే తూతూమంత్రంగా ఐదు లక్షలిచ్చి కేసుల్లో నుండి బయటపడదామన్న ఆలోచన అయ్యి ఉండవచ్చు . లేకపోతే తొమ్మిదేళ్ల నుండి లెక్కజమా లేకుండా తాను మింగేసిన డబ్బుల్లో ఐదు లక్షలు కాదు కదా ఐదు రూపాయలు కూడా తిరిగిచ్చి ఉండేవాడు కాదని పలువురు ఆక్షేపిస్తున్నారు .

తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంశం పై దృష్టి సారించాలి . ఈ విషయం పై సమగ్ర విచారణకు ఆదేశించి 2012 జనవరి నుండి 2015 వరకూ రాధాకృష్ణ మీడియా తాలూకూ బ్యాంక్ ఖాతాలు వెరిఫై చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలి . వీణావాణీల సంరక్షణ బాధ్యత తీసుకొన్న తెలంగాణా ప్రభుత్వం వారి పేరిట రాధాకృష్ణ చేసిన దోపిడీని బట్టబయలు చేయాలి . అక్రమంగా రాధాకృష్ణ వసూలు చేసి ఇన్నాళ్లు దర్జాగా తన అవసరాల కోసం వాడుకొన్న మొత్తాన్ని వడ్డీతో సహా కక్కించాలి . మొత్తం వ్యవహారంలో రాధాకృష్ణ చట్టాన్ని అతిక్రమించిన ప్రతి అంశాన్ని గుర్తించి వాటికి తగ్గ సెక్షన్లను వర్తింపజేసి చట్టపరంగా శిక్షించే కార్యక్రమం ఎలాంటి వత్తిళ్లకు లొంగకుండా చేపట్టాలి . లేనిపక్షంలో భవిష్యత్తులో మరింతమంది రాధాకృష్ణ లాంటి నేరస్తులు వీణావాణీల లాంటి బాధితులను ముందు పెట్టి ప్రజల దాతృత్వాన్ని దోచుకొని వారి ఔదార్య గుణాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది .

Also Read : వీణా వాణిల సొమ్ము చెల్లింపు అంటూ సచ్చీలత నిరూపించుకోబోయి మరోసారి అడ్డంగా దొరికిపోయిన రాధాకృష్ణ