iDreamPost
iDreamPost
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే సినిమా మాట బాగా పాపులర్ అయ్యింది. అదే రీతిలో ఆంధ్రజ్యోతి రాతలకు అర్థాలే వేరులే అనేది కూడా సామాన్యులు సైతం గ్రహించేశారు. అయినా ఆంధ్రజ్యోతి తన పంథా మార్చుకోవడం లేదు. హితుల మాటలు తమకు మేలు చేసేలా ఉండాలే గానీ వారి తీరు మనకు కీడు చేయకుండా ఉంటేనే సరైన మిత్రులనేది అందరికీ తెలిసిన సత్యం. కానీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా తనకు కీడు చేసే రాతలతో నిత్యం హాని చేస్తున్న రాధాకృష్ణను విశ్వసించడం వల్లనే ఈ స్థితికి చేరారన్నది చాలా మంది అభిప్రాయం. నేటికీ బాబు నమ్మకం వీడలేదు. అందుకే ఆయన్ని భ్రమల్లో పెట్టడానికి ఆంద్రజ్యోతి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇది మారలేదు. ఇంకేముంది అంతా పసుపుమయం అని రాసిన రాతలు, తీసిన సర్వేలన్నీ గాలికిపోయినా ఇంకా ఆ గాలి వార్తలనే టీడీపీ శ్రేణులను ఊపిరిగా భావిస్తుండడం విశేషం.
జగన్ బెయిల్ రద్దయిపోతుందని, జైలుకి పోతారని రాధాకృష్ణ ఎన్ని జ్యోశ్యాలు చెప్పారో.. అంతూ పొంతూ లేదు. అదే నిజమని నమ్మిన టీడీపీ కార్యకర్తలు ఇంకేముంది మళ్లీ తమదే అధికారం అన్నంత భ్రమల్లో కూరుకుపోయారు. ఇప్పుడు కూడా చంద్రబాబు హస్తిన యాత్రతో జగన్ వణికిపోతున్నారని వార్తలు అల్లేస్తున్నారు. సరిగ్గా మూడేళ్లకు ముందు బాబుని చూసి మోదీ, అమిత్ షా వణికిపోతున్నారని రాసిన రాతలను ఇవి తలపిస్తున్నాయి. అప్పట్లో కూడా ధర్మపోరాట దీక్షలతో ఢిల్లీ దద్దరిల్లిపోతోందని, బీజేపీ బేజారెత్తిపోతోందని నిత్యం ఆంధ్రజ్యోతి అచ్చేసేది. అవి నిజమని నమ్మేసిన బాబు మరింత రెచ్చిపోయేవారు. చివరకు మోదీ మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసి ఇప్పుడు ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు.
ఏపీలో తాము మాట్లాడిన బూతుల పంచాయతీని ఇప్పుడు టీడీపీ ఓవర్ టూ ఢిల్లీ అంటోంది. కానీ అక్కడికి వెళ్లి ఏం జరిగిందంటే ఏం చెబుతారో అర్థం కావడం లేదు. పోనీ టీడీపీ ఆఫీసు మీద దాడి వరకే చెప్పి ఊరుకుంటే ఫర్వాలేదు గానీ దానికి ముందు పట్టాభి వాగిన మాట అక్కడ వల్లిస్తే టీడీపీ నేతలకు చుక్కలు కనిపిస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఉత్తరాదిన ఆ మాటకున్న విలువ అలాంటిది. ఇక ఆంధ్రజ్యోతి అద్దాల్లోంచి చూసి జగన్ వణికిపోతున్నారనే అనుకుందామంటే అంతకుమించిన అపోహ మరోటి ఉండదు. ఇప్పుడు జగన్ ఎందుకు కలవరపడతారో అర్థంకాని పరిస్థితి. బహుశా రాధాకృష్ణకు తెలుసో లేదో గానీ పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ధాటికి బీజేపీ నేతలు రాష్ట్రం విడిచివెళ్లిపోయారు. అసోంలో తలదాచుకున్నారు. అక్కడి క్యాంపులను బెంగాల్ గవర్నర్ కూడా వెళ్లి చూసి వచ్చారు. కానీ అక్కడ తమ శ్రేణులకే దిక్కులేని స్థితిలో కూడా బీజేపీ ఏమీ చేయలేకపోయింది.
ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతానికి బీజేపీకి అంత సీన్ లేదు. టీడీపీని బలపరచాలనే ఉద్దేశం బీజేపీకి అసలు లేదు. గుజరాత్ మారణహోమం నాడు మోదీ పట్ల, తిరుపతి పర్యటనలో అమిత్ షా పట్ల చంద్రబాబు చూపించిన ప్రేమను వారిద్దరూ మరచిపోవడం లేదనే చెప్పాలి. అంతేగాకుండా ప్రస్తుతానికి జగన్ తో బీజేపీ కేంద్రంలోని పెద్దలకు ఎటువంటి సమస్యా లేదు. అందుకే విశ్వసనీయత లేని బాబు కన్నా జగన్ కే బీజేపీ అధిష్టానం మొగ్గు ఉంటుంది. ఇది కూడా ప్రస్తుతం చంద్రబాబుకి గడ్డుస్థితికి కారణంగా ఉంది. చివరకు అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా దొరక్క దిక్కులు చూడాల్సి వస్తోంది. ఇంత పేలవంగా టీడీపీ ఉంటే అధికార పార్టీ అవస్థలు పడుతోందని అడ్డదిడ్డంగా వార్తలు రాసి టీడీపీ అధినేతతో పాటు కార్యకర్తలను కూడా భ్రమల్లో ముంచాలనే ఆంధ్రజ్యోతి రాతల నైపుణ్యం వర్ణనాతీతం. అందుకే ఆంధ్రజ్యోతి రాతలకు అర్థాలే వేరులే అంటే జగన్ వణికిపోతున్నారనే విషయాన్ని బాబు కలవరపడుతున్నారని అర్థం చేసుకోవాలన్న మాట.