iDreamPost
android-app
ios-app

బలం లేక ఓడిపోయిన ఆత్మ – Nostalgia

  • Published Sep 04, 2020 | 12:00 PM Updated Updated Sep 04, 2020 | 12:00 PM
బలం లేక ఓడిపోయిన ఆత్మ – Nostalgia

ఏదైనా బాష నుంచి రీమేక్ ఎంచుకున్నప్పుడు ఆ కథలోని ఆత్మ మన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఎంత స్టార్ సపోర్ట్ ఉన్నా ఆశించిన ఫలితం దక్కదు. అదెలాగో ఓ ఉదాహరణ చూద్దాం. 1980లో రిషికపూర్ హీరోగా సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో ‘కర్జ్’ అనే సినిమా వచ్చింది. పునర్జన్మ కాన్సెప్ట్ తో రివెంజ్ డ్రామాను జోడించిన సుభాష్ ఘాయ్ తన టేకింగ్ తో ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ఆస్తి కోసం ఓ డబ్బున్న అబ్బాయి(రాజ్ కిరణ్)ని మోసం చేసి అతని చావుకు కారణం అవుతుంది కామిని వర్మ(సిమి గేర్వాల్), ఆ చనిపోయిన ప్రియుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి గాయకుడు మోంటీ(రిషి కపూర్)గా పుడతాడు.

కొన్ని అనూహ్య సంఘటనల వల్ల తన గత జన్మ తాలుకు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి కామిని వర్మ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడతాడు. కథనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మాములుగా పునర్జన్మ నేపధ్యమంటే కేవలం ప్రేమకథలే చూపించే ట్రెండ్ కు భిన్నంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సుభాష్ ఘాయ్ చేసిన మేజిక్ కి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. దానికి తోడు లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. మేరి ఉమర్ కి నావ్ జవానో, ఎక్ హసీనా థీ. దర్ద్ ఏ దిల్, తు కితిని బరస్ కి పాటలు బాష రాని ఆడియన్స్ ని కూడా ఉర్రూతలూగించాయి. రిషి కపూర్ స్టార్ డం అమాంతం పదిమెట్లు ఎక్కేసింది. తనకు జోడిగా నటించిన హీరొయిన్ టినానే ఇప్పటి వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీ సతీమణి.

దీన్నే ఐదు సంవత్సరాల తర్వాత బాలకృష్ణ హీరోగా తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో 1985లో రీమేక్ చేశారు. ఎలాంటి మార్పులు చేయకుండా యధాతధంగా దించేశారు. ఆత్మబలం టైటిల్ తో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. అప్పటికే మంగమ్మ గారి మనవడు రూపంలో ఇండస్ట్రీ హిట్ అందుకుని మాస్ లో ఫాలోయింగ్ పెంచుకున్న నందమూరి వారసుడిని ఈ కథలో చూడలేకపోయారు అభిమానులు . అందులోనూ చక్రవర్తి లాంటి సీనియర్ సంగీతం, గణేష్ పాత్రో సంభాషణలు ఇవేవి ప్లస్ కాలేకపోయాయి. హీరొయిన్ గా భానుప్రియ చేయగా అసలైన లేడీ నెగటివ్ రోల్ ని సిల్క్ స్మిత చేయడం విశేషం. సిమితో పోల్చుకుంటే సిల్క్ ఆ పాత్రకు సరితూగలేకపోయింది. కథ కొత్తగా ఉన్నప్పటికీ హీరో ఇమేజ్, మేకింగ్ లో జరిగిన పొరపాట్లు, చాలా అవుట్ డేటెడ్ అనిపించే టైటిల్ వెరసి ఆత్మబలం డిజాస్టర్ అయ్యింది. అందుకే ఒక బాషలో కల్ట్ అయినంత మాత్రాన అదే ఫలితం ఇక్కడా వస్తుందనుకుంటే తప్పులో కాలేసినట్టే