iDreamPost
android-app
ios-app

మహిళా రాజకీయ చైతన్యం – Nostalgia

  • Published Oct 03, 2020 | 2:21 PM Updated Updated Oct 03, 2020 | 2:21 PM
మహిళా రాజకీయ చైతన్యం – Nostalgia

సాధారణంగా రాజకీయాల్లో పురుషాధిక్యమే అధికంగా ఉంటుంది. చాలా అరుదుగా ఇందిరాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అతి క్లిష్టమైన ఈ వ్యవస్థలో ఎదురీది మరీ తన గొప్పదనాన్ని చాటుకున్నారు. కానీ స్త్రీలలో ఈ దిశగా చైతన్య రగిలించిన సినిమాలు తక్కువే అని చెప్పాలి. ప్రెసిడెంట్ పేరమ్మ లాంటి ఒకటిరెండు తప్ప మరీ నిలిచిపోయినవి తక్కువే.1993లో వచ్చిన ఆశయం దీనికో ఉదాహరణ. 1990 కర్తవ్యంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టి స్టార్ హీరోలకు ధీటుగా బ్లాక్ బస్టర్ అందుకున్న విజయశాంతితో అదే కాంబినేషన్ లో మరో సినిమా తీయాలని నిర్ణయించుకుని నిర్మాత ఏఎం రత్నం ఆశయంని ప్రకటించారు. పరుచూరి బ్రదర్స్ మరోసారి కలం బలానికి పని చెప్పారు.

తన చుట్టూ జరిగే అన్యాయాలను సహించలేని కాలేజ్ స్టూడెంట్ సరోజినీ(విజయశాంతి). కలెక్టర్ గా పని చేస్తున్న తండ్రి చక్రపాణి(విజయ్ కుమార్) నీతి నిజాయితీ పుణికి పుచ్చుకుంటుంది. అయితే అన్నయ్య(చరణ్ రాజ్) మాత్రం అవినీతికి దాసోహమనే రకం. అరాచక శక్తుల కుట్రలకు చక్రపాణి బలవుతాడు. ఆ కేసులో హోమ్ మినిస్టర్ ప్రమేయం ఉందని గుర్తించిన సరోజినీ అతనికి తిరగబడుతుంది. కానీ రివర్స్ తనే జైలు పాలవాల్సి వస్తుంది. విద్యార్థులు మద్దతుతో బయటికి వచ్చాక ముఖ్యమంత్రి ప్రోత్సహించడంతో ఎన్నికలలో గెలిచి మినిస్టర్ లెవెల్ కు చేరుకుంటుంది. కానీ జరుగుతున్న దారుణాలు వెనుక సిఎం హస్తం ఉందని గుర్తించి అన్ని ప్రమాదాలకు సిద్ధపడే సవాల్ ని స్వీకరిస్తుంది దీంతో ఎలాగైనా సరోజినీని అంతం చేయాలని దుష్టశక్తులన్నీ ఒక్కటవుతాయి.

బహిరంగ సభలో తీవ్ర జన సందోహం మధ్య తోపులాటలు కాల్పులు జరిగి శత్రువులతో పాటు సరోజినీని వెన్నంటే ఉంటూ అండగా నిలిచిన జీవిత భాగస్వామి సూరి బాబు(జగపతిబాబు)కూడా చనిపోతాడు. భవిష్యత్ ఆశాకిరణంగా సరోజినీని చూపించి శుభం కార్డు వేస్తారు. ఆశయం సినిమా కర్తవ్యం స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేదు. అంచనాలు బాగా ఎక్కువైపోవడంతో వాటిని అందుకోలేక జస్ట్ హిట్ అనిపించుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కర్తవ్యం తరహాలో ఇందులో ఫైట్లు లేవని అభిమానులు గొడవ చేయడంతో కొద్దిరోజుల తర్వాత రెండు పోరాట దృశ్యాలను ప్రత్యేకంగా చిత్రీకరించి జోడించారు. ఫ్యాన్స్ డిమాండ్ ఆ స్థాయిలో ఉండేది. ఇలాంటి సబ్జెక్టులను డీల్ చేయడంలో తనదంటూ ముద్రవేసిన దర్శకుడు మోహనగాంధీ మరోసారి తన టేకింగ్ తో మెప్పించారు. రాజ్ కోటి సంగీతంలో పాటలు పర్వాలేదు అనిపించాయి. శ్రీకాంత్ ఇందులో సపోర్టింగ్ రోల్ లో కనిపిస్తారు. ఆశయం తర్వాత ఆ స్థాయిలో ఫిమేల్ ఓరియెంటెడ్ పొలిటికల్ మూవీ రాలేదనే చెప్పాలి