iDreamPost
android-app
ios-app

మాధవుడిని ఓడించిన అంచనాలు – Nostalgia

  • Published Nov 22, 2020 | 12:45 PM Updated Updated Nov 22, 2020 | 12:45 PM
మాధవుడిని ఓడించిన అంచనాలు – Nostalgia

నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి బాక్సాఫీస్ ని శాశించే స్థాయికి చేరుకున్న స్టార్ హీరోలను ప్రయోగాత్మక దిశవైపు నడిపించడం అంత సులభం కాదు. ఏ మాత్రం అటుఇటు అయినా నిర్మాత మునిగిపోతాడు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి అయితే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. హృద్యమైన కథనం, అద్భుతమైన సంగీతం, మేలి నటీనటుల కలయిక, దిగ్గజ రచన ఇవేవి ఫెయిల్యూర్ ని ఆపలేవు. దానికి మంచి ఉదాహరణ ఆపద్బాంధవుడు. అది 1992వ సంవత్సరం. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వరస ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లతో చిరు మార్కెట్ ఆకాశాన్ని దాటి అంతరిక్షం వైపు వెళ్లిపోయింది. ఈ సినిమాలు ఆడిన థియేటర్ల సైకిల్ స్టాండ్ కాంట్రాక్టర్లు కూడా లక్షలు సంపాదించుకున్న గోల్డెన్ పీరియడ్ నడుస్తోందప్పుడు.

తను పూర్తిగా కమర్షియల్ పంథాకు అంకితమవుతున్నానని గుర్తించిన చిరంజీవి నటతృష్ణను తీర్చుకోవడం కోసం కళాతపస్వి కె విశ్వనాధ్ గారు చెప్పిన కథకు ఓకే చెప్పారు. అదే ఆపద్బాంధవుడు. స్వయంకృషి లాంటి క్లాసిక్ ఇచ్చిన నిర్మాత ఏడిద నాగేశ్వర్ రావు గారు నిర్మాణానికి ముందుకు రావడంతో ఇంకే ఆలోచన చేయలేదు. మాటల రచయిత జంధ్యాల కోరిమరీ స్కూల్ మాస్టారి పాత్ర చేసేందుకు ముందుకు వచ్చారు. ఊరందరికీ పాలు పొసే మాధవుడికి నాటకాల పిచ్చి. చదువు లేకపోయినా సంస్కారానికి లోటు ఉండదు. దేవుడిలా భావించే మాస్టారు కవితలను అచ్చు వేయించే బాధ్యత తీసుకుంటాడు. కానీ అనూహ్యమైన పరిస్థితుల వల్ల పుస్తకాలు చూడకుండానే మాస్టారు కన్నుమూస్తే ఆయన కూతురు పిచ్చాసుపత్రిలో ఉంటుంది.

మాధవుడు ఆమెను కాపాడే బాధ్యతను తీసుకుని తనకూ పిచ్చి పట్టినట్టు నటించి అక్కడ చేరతాడు. ఆ తర్వాత జరిగేది చూస్తేనే హృదయాన్ని తడి చేసుకోగలం. చిరు అసమానమైన నటన, ఎంఎం కీరవాణి మధురమైన పాటలు, తేనెలూరే జంధ్యాల మాటలు ఇవేవి ఆపద్బాంధవుడుని వసూళ్ల పరంగా నిలబెట్టలేకపోయాయి. మాస్ జనం చిరంజీవిని పాలు అమ్ముకునేవాడిగా, పిచ్చివాడిగా చూడలేకపోయారు. అంత సెంటిమెంట్ ని భరించలేకపోవడంతో వసూళ్ల పరంగా పరాజయం తప్పలేదు. అయినప్పటికీ మెగాస్టార్ కెరీర్ బెస్ట్ లో ఈ సినిమాది ప్రత్యేక స్థానం. మీనాక్షి శేషాద్రిలో ఎంత గొప్ప నటి ఉందో మరోసారి రుజువయ్యింది. అయిదు నంది అవార్డులు సొంతం చేసుకోవడం ఆపద్బాంధవుడు స్థాయి ఏంటో చెప్పకనే చెబుతుంది.