Idream media
Idream media
గుజరాత్ రాష్ట్రాన్ని, బీజేపీని వేరు చేసి చూడలేం. నరేంద్రమోదీ అలా మార్చేశారు. 2014లో మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టక ముందు వరకూ అక్కడ పరిస్థితి అలానే ఉంది. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగినప్పటికీ కొద్ది నెలల క్రితం వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆ ప్రభావం కాస్త తగ్గింది.
2015 జూలై-ఆగస్టులో జరిగిన పాటీదార్ ఆందోళన కారణంగా బలమైన సామాజిక వర్గాలు కాషాయ పార్టీకి దూరం అయ్యారని పరిశీలకులు భావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం సాధించి బీజేపీ నాయకత్వానికి సవాల్ విసిరింది. పట్టణ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ గణనీయమైన ప్రభావం చూపింది. అప్పట్లో తాలూకా పంచాయతీల్లో కాంగ్రెస్ 134 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 67 స్థానాలకే పరిమితమైంది. జిల్లా పంచాయతీల్లో కాంగ్రెస్ 24 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ ఆరు జిల్లా హెడ్ క్వార్టర్లకే పరిమితమైంది. దీంతో గుజరాత్‌లో ఎక్కడ ప్రభ కోల్పోతామోనని భాజపా అధినాయకత్వం ఆందోళన చెందింది.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 120 మంది సభ్యులున్న సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 27 సీట్లను గెలుచుకోవడం ద్వారా ఆప్ ఈ రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది. అప్పటి నుంచీ ఆప్ ఆ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. 2022 లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకూ తాము పోటీ చేస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. సోమవారం అహమ్మదాబాద్ కు వచ్చిన ఆయన..ఇక్కడ బీజేపీ-కాంగ్రెస్ రెండు పార్టీలూ చేతులు కలిపాయని, అందువల్లే ఈ రాష్ట్ర ప్రజలు మరో మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.
ఢిల్లీలో విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. అలాగే 70 ఏళ్లయినా ఈ రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదన్నారు. ఈ స్టేట్ ఇక మారిపోతుందని, గుజరాతీ సోదరులు, సోదరీ మణులను కలుసుకునేందుకు తాను మళ్ళీ వస్తానని ఆయన చెప్పారు. అహమ్మదాబాద్ లో తమ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ జరాతీ న్యూస్ ఛానెల్ యాంకర్ ఇసుదాస్ గద్విని తమ పార్టీలో చేర్చుకున్నారు. అతడిని ‘కేజ్రీవాల్ ఆఫ్ గుజరాత్’ గా అభివర్ణించారు.
ఢిల్లీ మోడల్ ను మేము ఈ రాష్ట్రానికి తీసుకురాబోమని. మోడల్ అన్నది ఏ రాష్ట్రానికి అది వేరుగా ఉంటుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ మోడల్ ని ఇక్కడి ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. 2022 లో జరిగే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక ఇక్కడ కూడా తమ పార్టీ కేడర్ ను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. అందుకు ఇప్పటి నుంచే కార్యాచరణకు సిద్ధమయ్యాయమని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతూ వస్తోంది. దీనికి తోడు ఆప్ కూడా పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్య అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారనున్నాయి.