ఉగ్రవాదుల దాడులు, మతకలహాల్లో గాయపడిన వ్యక్తులు, లేదా వారి తరఫున వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అందించే పథకం నుంచి ఆర్థిక సహాయం పొందాలంటే ఇకపై ఆధార్ తప్పని సరి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారు లేదా వారి కుటుంబ సభ్యులు, నక్సల్స్ దాడి బాధితులు, మతకలహాల బాధితులు, భారత సరిహద్దుల్లో కాల్పులు, పేళుళ్ల బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆయా సందర్భాల్లో బాధితులైన వారు ఇకపై కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం పొందాలంటే ఆధార్ తప్పకుండా ఉండాలి.
ఇప్పటికే ఈ పథకానికి అర్హులైన వ్యక్తులు ఉంటే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కాగా దేశంలో అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధన వర్తించనుంది. ఆ రెండు రాష్ట్రాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో వాటిని మినహాయించింది.
కేంద్ర ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి. అర్హులైన వారిని గుర్తించి వారికి నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందిస్తాయి. అనంతరం ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపితే తిరిగి ఆ మోత్తాలను కేంద్రం రాష్ట్రాలకు అందిస్తుంది.