iDreamPost
iDreamPost
సినిమా మొత్తం కామెడీతో నడిపించడం ఒక ఆర్టు. ఇందులో కొందరే నిష్ణాతులు. మొదటగా గుర్తొచ్చే పేరు మాత్రం జంధ్యాల గారే. తెలుగుతెరపై ఆయన చేసిన హాస్య సంతకం ఎప్పటికీ చెరిగిపోలేనిది. శిష్యుడిగా తర్వాతి తరంలో ఈవివి సత్యనారాయణ గారే గురువు వారసత్వాన్ని నిలబెట్టిన మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో ఈయన పూయించిన నవ్వుల బాణాలు వీరి సినిమాలను ఎప్పుడు చూసినా అమాంతం ఒత్తిడిని దూరం చేసేస్తాయి. అందులో ఓ మెచ్చుతునక ఆ ఒక్కటీ అడక్కు. రంభ హీరొయిన్ గా పరిచయమైన డెబ్యు మూవీ ఇదే. దీని తర్వాతే తను అగ్రహీరోల సరసన నటించే స్థాయికి చేరుకుంది.
అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా జాతకాల పిచ్చిలో పడి ఏ పని చేయకుండా రాజు అవుతానని కలలు కంటూ ఉంటాడు అటుకుల చిట్టిబాబు(రాజేంద్రప్రసాద్). ఈ ఖాళీ సమయంలోనే కోటీశ్వరుడైన రొయ్యల నాయుడు(రావు గోపాల్ రావు)కూతురు రంభ(రంభ)ను ప్రేమిస్తాడు. ఇష్టం లేకపోయినా ఇద్దరికీ పెళ్లి చేసిన నాయుడు శోభనం జరగాలంటే లక్ష రూపాయలు సంపాదించాలని కండిషన్ పెడతాడు. ఆ తర్వాత మన హీరో ఏం చేసి తన భార్యను గెలుచుకున్నాడు అనేదే కథ. ఆద్యంతం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి శుభం కార్డు దాకా నవ్వుల్నీ పంచిన ఆ ఒక్కటి అడక్కు 1992 సెప్టెంబర్ 19న విడుదలయ్యింది.
వినడానికి వింతగా అనిపించే లైన్ ని ఎలాంటి అసభ్యత, అశ్లీలతకు తావు లేకుండా ఈవివి తెరకెక్కించిన ఈ నవ్వుల ఖజానాను సుప్రసిద్ధ ఏవిఎం సంస్థ నిర్మించింది. ప్రముఖ తమిళ రచియిత కలైమని కథను అందించగా ఏప్రిల్ 1 విడుదలతో పేరు తెచ్చుకున్న ఎల్బి శ్రీరామ్ డైలాగులు రాశారు.ఈవివి సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చిన చిత్రం ఇదొక్కటే. మ్యూజికల్ గానూ పాటలు మంచి హిట్ అయ్యాయి. అప్పటిదాకా విలనీకే ఎక్కువ పరిమితమైన రావుగోపాల్ రావు గారిని కొత్త కోణంలో కామెడీ యాంగిల్ లో చూపించడం అద్భుతంగా పేలింది. బ్రహ్మానందం, బాబు మోహన్, అల్లు, లతాశ్రీ పోటీపడి హాస్యాన్ని పూయించారు. దీన్ని హిందిలో అక్షయ్ కుమార్ హీరోగా మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడిగా రీమేక్ చేస్తే అక్కడా హిట్టు కొట్టింది.