iDreamPost
android-app
ios-app

పేరుకి 8 సినిమాలు – ఛాన్స్ ఒక్కరికే

  • Published Jan 27, 2021 | 9:09 AM Updated Updated Jan 27, 2021 | 9:09 AM
పేరుకి 8 సినిమాలు – ఛాన్స్ ఒక్కరికే

ఈ వారం 29న టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇన్నేసి వస్తే మూవీ లవర్స్ దేనికి వెళ్తారనే అయోమయం ఉందా. కానీ పరిస్థితి చూస్తుంటే టెన్షన్ పడనక్కర్లేదనిపిస్తుంది. ఎందుకంటే వీటిలో అధిక శాతం అసలు ఎవరికీ తెలియనివి, ప్రమోషన్ విషయంలో వీక్ గా ఉన్నవే కాబట్టి. యాంకర్ ప్రదీప్ హీరోగా డెబ్యూ చేసిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా: ఒక్కటే అంతో ఇంతో ఓపెనింగ్స్ తెచ్చుకునేలా ఉంది. అది కూడా బ్లాక్ బస్టర్ సాంగ్ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా పాట పుణ్యమే ఎక్కువ. గత రెండు మూడు రోజులుగా ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు.

మిగిలిన వాటి వైపు లుక్ వేస్తే శ్రీకాంత్ సునీల్ లు నటించిన ‘జైసేన’ కూడా బరిలో దిగుతోంది. ఏదో సామజిక సమస్య మీద తీర్చిదిద్దినట్టు ట్రైలర్ లో కనిపిస్తోంది కానీ దీని మీద ఉన్న బజ్ జీరోనే. చాలా కాలం కిందటే నిర్మాణం పూర్తి చేసుకున్న జైసేనకు పవన్ ఫ్యాన్స్ అండ దొరుకుతుందని దర్శక నిర్మాతల ఆలోచన. ఈ రెండు పక్కన పెడితే అన్నపూర్ణమ్మ గారి మనవడు, అమ్మ దీవెన, చెప్పినా ఎవరు నమ్మరు, కళాపోషకులు, మిస్టర్ అండ్ మిస్, నాతో ఆట అనే మరో ఆరు సినిమాలు కూడా బరిలో దిగుతున్నాయి. ఇవన్నీ కలిసి ఎన్ని థియేటర్లలో వస్తున్నాయంటే కూడా చెప్పడం కష్టమే.

ప్రదీప్ మూవీకి గీతా, యువి వాళ్ళ బ్యాక్ అప్ ఉండటంతో చెప్పుకోదగ్గ స్క్రీన్లు దొరుకుతున్నాయి. అందులోనూ క్రాక్ తప్ప మిగిలినవన్నీ స్లో అయ్యాయి. రెడ్, అల్లుడు అదుర్స్ రెండూ సోసోగానే రాబడుతున్నాయి. మాస్టర్ ఓటిటి డేట్ కన్ఫర్మ్ అయ్యాక ఇక తెలుగు రాష్ట్రాల రన్ నామమాత్రమే. బంగారు బుల్లోడు పరిస్థితి చెప్పుకోకపోతే మంచిది. అందుకే 30 రోజుల్లో ప్రేమించడం ఎలాకు మంచి ఛాన్స్ దక్కింది. అయితే ఇలా అవకాశం దొరికితేనే పండగ కాదు. టాక్ చాలా ముఖ్యం. ఏ మాత్రం అటుఇటు ఉన్నా జనం నో చెప్పడానికి ఏ మాత్రం మొహమాటపడరు. పైగా కపటధారి రేస్ నుంచి తప్పుకోవడం కూడా దీనికి కలిసి వస్తోంది.