ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని వెర్షన్లు బయటికి చెప్పుకున్నా కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా పరిశ్రమ చరిత్రలో ఎన్నడూ ఊహించని పాఠాలు నేర్చుకుంటోంది. థియేటర్లు మూతబడి నాలుగో నెల నడుస్తోంది. ఎప్పటికి తెరుచుకుంటాయో అంతు చిక్కడం లేదు. ఫిలిం ఇండస్ట్రీ తప్ప మిగిలిన అన్ని రంగాల మీద ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ డిజిటల్ వైపు భారీ అడుగులు వేస్తోంది. పెట్టుబడుల మీద వడ్డీల భారం, డిస్ట్రిబ్యూటర్ల నుంచి అడ్వాన్సులు వెనక్కు ఇమ్మనే ఒత్తిడి లాంటి కారణాలతో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఓటిటి అనేస్తున్నారు.
హిందీ మూవీస్ కి సాధారణంగా మల్టీ ప్లెక్సుల్లోనే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అందుకే హైదరాబాద్ లాంటి నగరాల్లో వీటిలోనే ఎక్కువ ప్రదర్శిస్తారు. ఇప్పుడీ వైరస్ పుణ్యమాని ఇంటినే థియేటర్ గా మార్చుకునే పరిస్థితి వచ్చేసింది. కోట్ల రూపాయల పెట్టుబడులతో స్ట్రీమింగ్ రంగంలో గట్టి పట్టు కోసం అడుగులు వేస్తున్న డిస్నీ హాట్ స్టార్ ఇవాళ ఏకంగా సెలెబ్రిటీలతో లైవ్ షో పెట్టేసి రాబోయే చిత్రాల అనౌన్స్ మెంట్లు ఇచ్చేసింది. వీటిలో అధిక శాతం వంద కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశం ఉన్నవే. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ ని ఆన్ లైన్ కే ఫిక్స్ చేశారు. కాంచన రీమేక్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహించారు. దీన్ని ఎప్పుడు స్ట్రీమ్ చేస్తారనే వివరం ఇవ్వలేదు.
ఇటీవలే మరణించి అభిమానుల జ్ఞాపకాల్లో సజీవంగా నిలిచిపోయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆఖరి చిత్రం దిల్ బేచారా జులై 24న రాబోతున్న సంగతి తెలిసిందే. దీన్ని మొన్నే అధికారికంగా ప్రకటించారు. అజయ్ దేవగన్ నటించిన భుజ్:ది ప్రైడ్ అఫ్ ఇండియాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇదీ డిజిటల్ దారినే కోరుకుంది. మహేష్ భట్ కల్ట్ క్లాసిక్ సడక్ సీక్వెల్ కూడా ఇందులోనే రాబోతోంది. అలియా భట్ కీలక పాత్ర చేయడం ఆకర్షణ పెంచుతోంది. అభిషేక్ బచ్చన్ ది బిగ్ బుల్ రేస్ లో ఉంది. తుపాకీ విలన్ విద్యుత్ జమాల్ హీరోగా చేసిన ఖుదా హఫీజ్ ను ప్రకటించారు. ఖునాల్ ఖేమూ, రసిక నటించిన లూట్ కేస్ కూడా లైన్ లో ఉంది. ఇవన్నీ డిస్నీ హాట్ స్టార్ ద్వారా రాబోతుండటం చూస్తే ఏ స్థాయిలో వీటి మీద ఇన్వెస్ట్ మెంట్ జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే డేట్లను మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. కేవలం 399 రూపాయలకే సంవత్సర చందాతో ఇంట్లోనే ఇన్నేసి సినిమాలు చూడటం కంటే చౌక బేరం మరొకటి ఉంటుందా.