iDreamPost
iDreamPost
ఈ శుక్రవారం మరో రసవత్తర పోటీ కోసం బాక్సాఫీస్ రెడీ అవుతోంది. కొత్త సినిమాల సందడితో టికెట్ కౌంటర్లు ముస్తాబు కాబోతున్నాయి. అయితే ఇంకేం మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు చూస్తామన్న గ్యారెంటీ లేకపోవడమే ట్రేడ్ ని ఖంగారు పెడుతోంది. ఎందుకంటే దేనికీ పెద్దగా బజ్ లేదు. ప్రేక్షకుల్లోనూ అంతగా ఆసక్తి ఉన్న దాఖలాలు లేవు. మంచు విష్ణు హీరోగా అతని అక్క పాత్రలో కాజల్ అగర్వాల్ నటించిన ‘మోసగాళ్లు’ 50 కోట్లతో తీశామని చేస్తున్న ప్రచారం అంతగా హెల్ప్ అవ్వడం లేదు. ముందు నుంచి దీనికి సంబంధించిన అప్ డేట్స్ ని సరైన క్రమపద్ధతిలో వదలకపోవడం ఇప్పుడు ప్రభావం చూపిస్తోంది. ఇంకా కొన్ని ఏరియాలకు థియేటర్లు కూడా ఖరారు కాలేదు.
విదేశీ దర్శకుడు, మాస్ కు అంత సులభంగా కనెక్ట్ కాలేని ఐటి క్రైమ్ కాన్సెప్ట్, ఆల్రెడీ దారుణంగా పడిపోయిన మంచు విష్ణు మార్కెట్ ఇవన్నీ ప్రతికూలతగా మారుతున్నాయి. బలమైన పాజిటివ్ టాక్ వస్తే తప్ప కలెక్షన్స్ రావడం అంత సులభంగా కనిపించడం లేదు. ఇక కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ సౌండ్ కూడా అంత గట్టిగా ఏమి లేదు. ఆరెక్స్ 100 తర్వాత చెప్పుకునే ఒక్క హిట్టు లేకపోవడం దీని హైప్ తగ్గడానికి కారణం అయ్యింది. గీతా ప్రొడక్షన్, ట్రైలర్ కొంత ఆసక్తి రేపడం, మార్కెటింగ్ లో శ్రద్ధ లాంటి కారణాలు ప్లస్ గా కనిపిస్తున్నాయి. ఇదీ పబ్లిక్ టాక్ అండ్ రివ్యూస్ మీద ఆధారపడ్డదే.
ఇక ఎప్పుడో కెరీర్ మొదలుపెట్టినప్పుడు ప్రేమకావాలి, లవ్లీ లాంటి సినిమాలతో పర్వాలేదు అనిపించుకున్న ఆది సాయి కుమార్ కొత్త సినిమా ‘శశి’ కూడా కేవలం ఒక్క పాట వైరల్ కావడం వల్ల కొద్దిపాటి అంచనాలు తెచ్చుకుంది. ఒకవేళ కంటెంట్ కూడా బాగుంటే సేఫ్ అవుతుంది. అది కూడా యూత్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆది ఏదో డిఫరెంట్ గానే ట్రై చేసినట్టు ఉన్నాడు. ఇవి కాకుండా మెగా కాంపౌండ్ అని చెబుతున్న పవన్ తేజ్ కొణిదెల డెబ్యూ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ కూడా ఇదే రోజు రాబోతోంది. మెగా హీరోలను నుంచి ఎవరూ దీని గురించి మాట్లాడ్డం లేదు. చూద్దాం 19న ఫలితాలు ఎలా వస్తాయో