iDreamPost
iDreamPost
సరిగ్గా 34 సంవత్సరాల క్రితం 1989 ఇదే రోజు అక్టోబర్ 5వ తేదీన…..
ఊహించని సంచలనం
హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో దేవి 70 ఎంఎం థియేటర్. మొదటి షో వదిలి జనం బయటికి వస్తున్నారు. అందులో అక్కినేని అభిమానులే ఎక్కువగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సగం మొహాల్లో ఏదో తెలియని అయోమయం. మరికొందరిలో బయటపడలేని ఉద్విగ్నత. నెక్స్ట్ షో టికెట్ల కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులు ఆత్రం తట్టుకోలేక ఎలా ఉందని ఆ ఫ్యాన్స్ ని అడగటం మొదలుపెట్టారు. వీళ్లకు వెంటనే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. బాలేదనేందుకు దర్శకుడిగా మారిన కొత్త కుర్రాడు రామ్ గోపాల్ వర్మ అవకాశం ఇవ్వలేదు. పోనీ అద్భుతంగా ఉందా అంటే అడవిరాముడు టైపులో అల్లరి పాటలు లేవు, యముడికి మొగుడు స్టైల్ లో కిరాక్ డ్యాన్సులు లేవు. పోనీ ప్రేమాభిషేకం రేంజ్ లో విజిల్స్ వేయించే సాంగ్స్ ఉన్నాయా అంటే సమాధానం లేదు. అసలే దీనికి ముందు అగ్ని డిజాస్టర్. గీతాంజలి క్లాసిక్ అనిపించుకుంది కానీ బిసి సెంటర్లలో వసూళ్లు రాలేదు. విక్కీ దాదా, కిరాయిదాదాలు తెచ్చిన మాస్ ఇమేజ్ చిరంజీవి ఛరిష్మా ముందు చిన్నగానే కనిపిస్తున్నాయి. సో తమ హీరోకు ఏదో కావాలి. ఒక అద్భుతం జరగాలి. ఇంకెవరికి సాధ్యం కాని ఒక బ్లాక్ బస్టర్ సాధించాలి. దానికి సమాధానం శివ రూపంలో దొరుకుతుందని ఫస్ట్ షో చూసినవాళ్లు బహుశా ఊహించి ఉండరు.
చరిత్రకు శ్రీకారం
సునామి ఒక్కసారిగా విరుచుకుపడదు. దాని ప్రకంపలను ముందుగా పసిగట్టలేం. వచ్చాక చూస్తూ ఉండటం తప్ప దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. శివ విషయంలో అదే జరిగింది. అమీర్ పేట్ సత్యం, సికింద్రాబాద్ అంజలి, వరంగల్ జెమిని, నిజామాబాద్ నటరాజ్, కర్నూలు ఆనంద్, కడప రాయల్, గుంటూరు మంగ, రాజమండ్రి కుమారి, గుడివాడ శ్రీబాలాజీ ఇలా తెలుగు రాష్ట్రాల నలుమూలల ప్రతి సినిమా హాల్ నుంచి ఎక్స్ ట్రాడినరీ రిపోర్ట్స్ వస్తున్నాయి. మొదటి రోజు కన్నా రెట్టింపు సంఖ్యలో వారాలు గడిచే కొద్ది టికెట్ల ఊచకోత కొనసాగుతూనే ఉంది. రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. ఫస్ట్ డే చూసిన వాళ్ళు ఇంకోసారి చూసేందుకు మళ్ళీ మళ్ళీ బ్లాక్ టికెట్లు కొనాల్సి వచ్చింది. 22 కేంద్రాల్లో వంద రోజులు, 5 సెంటర్లలో 155 రోజులకు పైగా ఈ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. వెండితెరకు మాస్ పేరుతో ఒకరకమైన మూస ఫార్ములాను నేర్పించిన సీనియర్ దర్శకులు శివ సినిమా, దానికి వస్తున్న స్పందన చూసి కొన్ని రోజులు నిద్రపోలేదు. ఇదేంటి మేము ఏళ్ళ తరబడి కష్టపడి పేర్చిన పడికట్టు సూత్రాల అడ్డుగోడలని ఒక యువకుడు స్టడీ కామ్ కెమెరాతో బద్దలు కొడతాడని వాళ్ళేమైనా కలగన్నారా. ఇక అక్కడి నుంచి శివ పేరుతో తెలుగు సినీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని ఎందరో కుర్రాళ్ళలో పరిశ్రమ వైపు రావాలన్న కోరిక మొగ్గ తొడగడం మొదలయ్యింది.
అతిశయం కాని అద్భుతం
నిజానికి శివలో అద్భుతమైన కనివిని ఎరుగని కథేమీ ఉండదు. కాలేజీలో రౌడీయిజానికి ఎదురు తిరిగిన ఓ విద్యార్ధి బయటికి వచ్చాక ఆ వ్యవస్థను నాశనం చేయడం కోసం తాను కూడా అదే మార్గంలోకి వెళ్లడమే ఇందులో మెయిన్ పాయింట్. వ్యక్తిని చంపడం కన్నా అతను అలా తయారు కావడానికి కారణమైన మూలాలను నాశనం చేయాలన్న అతని లక్ష్యం చివరికి పరిస్థితుల వల్ల దారి మళ్ళి శత్రువును హత్య చేయక తప్పని స్థితికి తెస్తుంది. వర్మ తన మేజిక్ అంతా స్క్రీన్ ప్లేలో చూపించాడు. సాధారణంగా నాగార్జున రేంజ్ స్టార్ హీరోకు ఇంట్రో సీన్ అంటే అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. కానీ ఇందులో అదేమీ ఉండదు. సింపుల్ గా ఓ పుస్తకం చేతిలో పట్టుకుని మే ఐ కమిన్ సార్ అంటూ క్లాస్ లోకి వస్తాడు అంతే. తన సైకిల్ మీద కూర్చుని కో స్టూడెంట్ రెచ్చగొట్టే దాకా చెయ్యి ఎత్తడు. అప్పటిదాకా కూల్ గా అండర్ ప్లే చేసుకుంటూ వచ్చిన శివ క్యారెక్టర్ తో ఒక్కసారి సైకిల్ చైన్ తీయించి జెడి బ్యాచ్ వెనకాల కొట్టుకుంటూ పోయేలా చేయడం హీరోయిజంకి కొత్త డెఫినిషన్ రాసుకునేలా చేసింది. ఆ సీన్లో శివ ఒక్క మాట అనడు. ప్రిన్సిపాల్ దగ్గర మాత్రమే నోరు విప్పుతాడు. వర్మ మేధస్సు ఇలాంటి ఎన్నో సన్నివేశాలలో అడుగడుగు బయటపడుతూనే ఉంటుంది
భవాని – విలన్ అంటే వీడే
సాధారణంగా తెలుగు సినిమాల్లో విలన్లకు ఒక గ్రామర్ ఉంటుంది. ఖరీదైన డెన్లు, మాసిపోని దుస్తులు, చుట్టూ మందీ మార్బలం, మైసూర్ ప్యాలెస్ లాంటి పెద్ద కోట వగైరా వగైరా. రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, సత్యనారాయణ ఇలా వీళ్ళందరినీ ఒకే తరహాలో చూసి చూసి మొహం మొత్తిన ఆడియన్స్ కి భవాని రూపంలో రఘువరన్ ఎక్కువ శబ్దం చేయకుండా చూపించిన క్రూరత్వం చాలా రోజులు వాళ్ళను వెంటాడిన మాట వాస్తవం. కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ అంటే ఏంటో వర్మ శివతోనే పరిచయం చేయించాడు. ఇంటర్వెల్ లో శుభలేఖ సుధాకర్ ని చంపుతున్న ఎపిసోడ్ లో రఘువరన్ అక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా మనకు ప్రతి క్షణం అతనే గుర్తుకువచ్చి ఒళ్ళు జలదరించేలా చేశాడంటే అది వర్మ డిజైన్ చేసిన పాత్రల తాలూకు ప్రభావం. భవాని అనే పేరు వింటే చాలు అదేదో నిలువెల్లా వణికిపోయే రేంజ్ లో ప్రొజెక్ట్ చేసిన తీరు అప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్న రఘువరన్ కు ఉక్కిరిబిక్కిరి అయ్యే స్థాయిలో ఆఫర్లను తీసుకొచ్చింది. శివ కన్నా ఎక్కువ ప్రభావం భవానినే చూపించాడంటే ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు కానీ అదే వాస్తవం.
తారాగణమే బలం
శివకు కుదిరిన మరో ప్రధానమైన బలం తారాగణం. భవాని పక్కన ఉండే నానాజీ పాత్రకు ముందు అనుకున్నది తనికెళ్ళ భరణిని కాదు. ఓ ఇద్దరినీ అడిగి డేట్లు లేవనిపించుకుని విసుగు వచ్చిన వర్మ డైలాగులు అద్భుతంగా రాసిన భరణినే చేసేయమన్నారు. ఊహించని విధంగా వచ్చిన అవకాశాన్ని ముందు వద్దనుకున్నా తర్వాత అది తనకు ఎంత గొప్ప మేలి మలుపు అవుతుందో అంచనా వేయలేదు భరణి. మిగిలిన అన్ని పాత్రలకు తలలు పండిన ఆర్టిస్టులను తీసుకోలేదు వర్మ. హీరోయిన్ గా అమల, ఆమె అన్నయ్యగా సాయి చంద్, శివ స్నేహితులుగా కొత్త కుర్రాళ్ళు రామ్ జగన్, చిన్నా లాంటి కొత్త కుర్రాళ్లను ఎంచుకున్నాడు. గడ్డంతో జెడిని చూశాక వేరే ఆప్షన్ పెట్టుకోలేదు. కోటను చిన్న పాత్రకు అడిగితే సంతోషంగా ఒప్పుకున్నారు. అన్నయ్యగా మురళీమోహన్ ఫిక్స్. గొల్లపూడి, నిర్మలమ్మలకు రెండు నిమిషాలే ఇచ్చినా వాళ్ళూ నో చెప్పలేదు. అన్నపూర్ణ బ్యానర్ మీద ఉన్న గౌరవం అది. రౌడీ బ్యాచు కోసం వర్మ ఏరికోరి కొత్త మొహాలను తీసుకున్నప్పుడు అందరూ చెవులు కొరుక్కున్నారు కానీ తెరమీద అవుట్ ఫుట్ చూశాక నోళ్ళన్నీ గప్ చుప్.
నాగ్ సాహసం
నాగార్జున కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఏది అంటే శివ పేరు చెబితే అది అబద్దమే అవుతుంది. అన్నమయ్యకు మొదటి స్థానం ఇవ్వాలి. శివ చేసే సమయానికి నాగ్ ఛాలెంజింగ్ అనిపించే గొప్ప పాత్రలేవీ చేయలేదు. తనకంటూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. డ్యాన్సులు, భారీ సంభాషణలు పలికే విషయంలో చాలా మెరుగు పడాల్సి ఉంది. ఆ సమయంలో వచ్చిందే శివ. వర్మ చాలా తెలివిగా తన కథలో హీరో పాత్రను నాగార్జున బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా మార్చుకుని గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. నటుడిగా కన్నా నిర్మాతగా ఈ కథను ఓకే చేసిన నాగార్జున ధైర్యానికి వేయి వీరతాళ్ళు వేయాలి. సగటు హీరోలు ఇదేం సబ్జెక్టని అనుమానంగా చూసే శివ లాంటి కథలను ఫ్యూచర్ విజన్ తో చూసే కథానాయకుడు కం నిర్మాత కావాలి. ఆ విషయంలో నాగ్, వెంకట్ లను ఇద్దరినీ మెచ్చుకోవాల్సిందే.
ఒకే ఒక్క వర్మ
స్క్రీన్ ప్లేతో మొదలుకుని షాట్ డివిజన్ దాకా వర్మ తీసుకున్న శ్రద్ధ ఏ విషయంలోనూ రాజీ పడనివ్వలేదు. నాగార్జున ఇచ్చిన స్వేచ్ఛ అలాంటిది. ఉదాహరణకు పాపను హాస్పిటల్ కు సైకిల్ మీద తీసుకెళ్తున్నప్పుడు భవాని మనుషులు కారులో వెంటపడతాడు. మాములుగా సాంప్రదాయ సినిమా పద్ధతిలో అయితే ఒక పక్క స్టాండు వేసి పాపను దాని పై కూర్చోబెట్టి ఎంతమంది వచ్చినా శివ వాళ్ళ భరతం పట్టాలి. కానీ వర్మ ప్రాక్టికల్ గా ఆలోచించాడు. శివకు ఆవేశం తెగువ ఎక్కువే కానీ ఆ సీన్ లో పరిస్థితి వేరు. ముందక్కడి నుంచి బయట పడాలి. తను ఏ మాత్రం రిస్క్ చేసి వాళ్ళతో కలబడినా పాప ప్రాణాలకే ప్రమాదం. అందుకే పరిగెత్తి పరిగెత్తి బస్సెక్కి పారిపోతాడు. ఇదేంట్రా శివ ఇలా బెదిరిపోయి తోకముడిచాడని ప్రేక్షకులు నవ్వుకోలేదు. వాస్తవికతకు దగ్గరగా ఆలోచించిన వర్మ మేధస్సుకు మనసులోనే చప్పట్లు కొట్టారు. భవాని రాత్రిపూట తన బ్యాచు మీదకు మనుషులను ఉసిగొలిపినప్పుడు శివ అతని ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇస్తాడు తప్ప చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అక్కడిక్కడ వాళ్ళ తుప్పు రేగొట్టడు. అన్నయ్యకు తనకు గొడవలు ఉన్నాయనేలా భ్రమను కలిగించి ఆ కుటుంబానికి బయటికి కనిపించని రక్షణగా నిలుస్తాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెనో. శివ యువత మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం. నిజంగానే వీధుల్లో కుర్రాళ్ళు సైకిల్ చైన్లు పట్టుకుని తిరగడం మొదలుపెట్టారు. ఒంటి చేత్తో చైన్ ని ఊడబెరకాలని చూస్తే చర్మం లేచొస్తుంది కానీ చైన్ రాదని వర్మ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు కూడా. ఈ విషయంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. శివని పిచ్చిగా ప్రేమించిన కుర్రాళ్ళు చైన్ చేతిలో ఉంటే అదో ఫ్యాషన్ గా ఫీలయ్యేవాళ్ళు. తమ గ్రూపులో ఎవడైనా తేడాగా ఉంటే వాడిని భవాని అని పిలుచుకునే వాళ్ళు. హింసని రక్తపాతం లేకుండా గ్లోరిఫై చేసిన తీరు చూస్తే వర్మ 34 ఏళ్ళ క్రితమే అంత అడ్వాన్స్ గా ఎలా ఆలోచించాడా అనిపిస్తుంది. బహుశా తన వీడియో పార్లర్లో విపరీతంగా చూసిన ఇంగ్లీష్ సినిమాల ఎఫెక్ట్ కావొచ్చు. లేదా అన్నపూర్ణ స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా పని చేస్తున్న నాన్న కృష్ణంరాజు చూపించిన సినిమా వాతావరణం అతని మెదడులో ఎక్కించిన సిల్వర్ స్క్రీన్ మేనియా కావొచ్చు. ఏదైతేనేం కొత్త తరహా ఫిలిం మేకింగ్ కి వర్మ చూపించిన దారిలో ఆ తర్వాత పూరి జగన్నాధ్, తేజ, కృష్ణవంశీ లాంటి ఎందరో మేకర్స్ టాలీవుడ్ గర్వంగా చెప్పుకునే మైల్ స్టోన్స్ ని రూపొందించి గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు.
మ్యాస్ట్రో మాయాజాలం
ఇంతా చెప్పి ఇళయరాజా ప్రస్తావన తీసుకురాకపోతే అంతకన్నా మహాదోషం మరొకటి ఉండదు. షూటింగ్ మొత్తం పూర్తయి రీ రికార్డింగ్ జరగకముందు కాపీ చూసుకున్న నిర్మాత కం నాగార్జున సోదరుడు వెంకట్ కి, మరో భాగస్వామి యార్లగడ్డ సురేంద్రకు ఏమి పాలు పోలేదు.ఏంటి మరీ ఇంత స్లోగా ఉంది. నాన్న గారి అభిమానులు ఒప్పుకుంటారా అని ఒకటే సందేహం. కానీ వర్మ ధీమాగా ఉన్నాడు. మాట ఇచ్చిన కీరవాణిని కాదని ఇళయరాజాను తీసుకున్నప్పుడే తన శివకో వజ్రపు ఆభరణం వచ్చేసింది. ఇక నిశ్చింతగా ఉండటమే మిగిలింది. నిజంగానే మ్యాస్ట్రో మహాద్భుతం చేశారు. ఏ సంగీత దర్శకుడైనా సవాల్ గా ఫీలయ్యే అవుట్ ఫుట్ ని చేతిలో పెట్టిన వర్మకేసి ఓ నవ్వు విసిరిన ఇళయరాజా తన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిర్మాతల పెదవులపై నవ్వులను శాశ్వతం చేశారు. ఇది అర్థం కావాలంటే శివను బిజిఎం లేకుండా కేవలం సౌండ్ అండ్ డైలాగ్స్ తో వింటే అర్థమవుతుంది. ఆయన ఎందుకు సంగీత జ్ఞానిగా నీరాజనాలు పొందుతున్నారో. ‘బోటనీ పాఠముంది మ్యాట్నీ ఆట ఉంది’ పాట క్లాసు మాస్ తేడా లేకుండా నెలల తరబడి మారుమ్రోగుతూనే ఉంది అప్పటికీ ఇప్పటికీ. వీర భక్తులు రోజు పాడుకునే హనుమాన్ చాలీసాలాగా ఈ పాట కాలేజీ స్టూడెంట్స్ కి ఓ బట్టీ పాఠంలా మారిపోవడం అతిశయోక్తి కాదు. గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఛేజింగులకు ఒక కొత్త వొకాబులరీ రాసి చూపించారు శివలో.
ముగింపు లేని కథ
శివ కేవలం ఒక రెండున్నర గంటల సినిమా మాత్రమే అయ్యుంటే ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కొన్ని దశాబ్దాలుగా దాని తాలూకు ప్రకంపనలు ఇప్పటికీ మాడరన్ ఫిలిం మేకర్స్ ఆస్వాదిస్తున్నారంటే దాన్ని మాస్టర్ పీస్ అనో కల్ట్ క్లాసిక్ అంటే సరిపోదు. అంతకు మించి పదాన్ని వెతుక్కోవాలి. ఇందులో ఒక డైలాగ్ ఉంది. భవాని అంటాడు. ‘శివా శివా శివా వాడేమైనా దేవుడా’. కాదు శివ దేవుడు కాదు. తెలుగు సినిమాను ఓ మలుపు తిప్పేందుకు కంకణం కట్టుకున్న ఓ నవతరం మార్గనిర్దేశకుడు. శివ ఇక్కడ చెప్పుకున్నంత గొప్ప స్థాయిలో ఇప్పటి యువకులకు కనిపించకపోవచ్చు. కానీ మనం ఇప్పుడు చదువుతున్న ఫిలిం మేకింగ్ అనే పుస్తకంలో బంగారు అక్షరాలతో మెరిసిపోతున్న పేజీలు కొన్ని తనవే. అందుకే శివ ఒక చరిత్ర. దానికి చెదలు పట్టదు. కాలదోషం ఉండదు.