iDreamPost
android-app
ios-app

చిన్న దేశాల్లో పెద్దల రహస్య ఆస్తులు- పండోరా పేపర్స్ ఏం చెబుతున్నాయి..?

  • Published Oct 04, 2021 | 10:49 AM Updated Updated Oct 04, 2021 | 10:49 AM
చిన్న దేశాల్లో పెద్దల రహస్య ఆస్తులు- పండోరా పేపర్స్ ఏం చెబుతున్నాయి..?

పండోరా పేపర్స్ లీక్ ఉదంతం ప్రపంచాన్ని.. అదే సమయంలో మన దేశాన్ని కుదిపివేస్తోంది. స్వదేశంలో అక్రమ, సక్రమ మార్గాల్లో సంపాదించిన ఆస్తులను ఇతర దేశాల్లో రహస్యంగా దాచుకున్న బడా బాబుల బండారాన్ని ఈ పేపర్లు బయటపెట్టాయి. ఇలాంటి బడాబాబుల్లో మన దేశానికి చెందిన 300 మంది ప్రముఖులు ఉన్నట్లు పండోరా పేపర్స్ ద్వారా వెల్లడైంది. తప్పుడు మార్గాల్లో కూడబెట్టిన ఆస్తులను బడా బాబులు ఇతర దేశాలకు ఎలా మళ్లించ గలుగుతున్నారు.. ఆ దేశాల్లో పన్నుల ఎగవేత, సంపాదన వివరాలు ఆరా తీసే చట్టాలు, అధికార వ్యవస్థ తీరు తెన్నులు బడా సంపన్నులను ఆకర్షిస్తున్నాయి. ఇలా తరలివచ్చే సొమ్ము వివరాలు గోప్యంగా ఉంచడం మరో వెసులుబాటు. రహస్య ఖాతాలు, షెల్ కంపెనీలు, బోగస్ ట్రస్టుల పేరుతో ఆయా దేశాలకు సొమ్మును తరలించి భద్రపరచుకుంటున్నారు.

Read Also:- వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ : ఏపీ స‌ర్కార్ వినూత్న నిర్ణ‌యం

చిన్న దేశాల్లో పన్ను చట్టాలు బలహీనం

పన్ను విధానాల్లో ఒక్కో దేశానిది ఒక్కో విధానం. చాలా దేశాల్లో పన్ను చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పన్ను ఎగవేతదారులకు శిక్షలు కూడా అలాగే ఉంటాయి. కానీ పలు చిన్న దేశాల్లో ఈ చట్టాలు చాలా నామమాత్రంగా, సరళంగా ఉంటాయి. ఇంకొన్ని చోట్ల అసలే ఉండవు. వీటి అమలులో కూడా పెద్ద పట్టింపులు ఉండవు. కానీ ఆర్థిక లావాదేవీల వివరాలు వెల్లడించడంపై మాత్రం కఠిన ఆంక్షలు ఉంటాయి. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, పనామా, సమోవా, బెలీజ్, కేమన్ ఐలాండ్స్, మొనాకో తదితర దేశాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ దేశాల్లో సొమ్ము ఎవరి నుంచి, ఎవరి ద్వారా, ఎలా వచ్చిందని ఎవరూ ప్రశ్నించరు. ఇక్కడ సొమ్ము దాచుకున్న వారి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. ఇవే అక్రమ సంపాదన పరులకు, పన్ను ఎగవేతదారులకు ద్వారాలు తెరిచి ఆహ్వానిస్తున్నాయి.

Read Also:- ఉత్త‌రాంధ్ర‌లోని మారుమూల గ్రామం ప్ర‌ధాని దృష్టికి ఎలా వెళ్ళింది?

బోగస్ సంస్థల ఏర్పాటుకు కన్సల్టెన్సీ సేవలు

వ్యాపారాలు ఇతర మార్గాల్లో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించేవారు తమ దేశ ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టేందుకు.. అక్రమ, తప్పుడు మార్గాల్లో విపరీతంగా ఆస్తులు సంపాదించిన వారు వాటిని మూడో కంటికి తెలియకుండా మనీ లాండరింగ్, హవాలా తదితర మార్గాల్లో పన్నుల బెడద లేని దేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారికి సహకరించేందుకు ప్రత్యేకంగా గ్లోబల్ కార్పొరేట్ సంస్థలు కూడా ఉన్నాయి. షెల్ కంపెనీలు, బోగస్ ట్రస్టులు ఏర్పాటు చేయించి వాటిలోకి బడా బాబుల అక్రమ సంపాదనను మళ్లించేందుకు ఇవి సహకరిస్తుంటాయి. ఈ షెల్ కంపెనీలు, ట్రస్టుల ద్వారా పన్నులు కట్టకుండానే విమానాలు, నౌకలు, పెద్ద భవంతులు, కళాఖండాలు, షేర్లు కొనుగోలు చేయవచ్చు. ఇటువంటి 14 గ్లోబల్ సంస్థల నుంచే 1.20 కోట్ల పత్రాలు లీక్ చేసి పరిశీలించినట్లు ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 600 మంది జర్నలిస్టులు ఈ పత్రాలను పరిశీలించి, పరిశోధించి తేల్చిన వివరాలను పండోరా పేపర్స్ పేరుతో విడుదల చేసినట్లు ఐసీఐజే వెల్లడించింది.

Read Also:- జనసేన అడుగు.. బీజేపీకి అర్థం అవుతోందా..?

ఇదే అతిపెద్ద లీక్

గతంలో అక్రమ సంపాదన పరుల రహస్య ఆస్తులపై పనామా, ప్యారడైజ్, ఫిన్ సేన్ తదితర పేర్లతో పేపర్లు లీక్ అయ్యాయి. వాటన్నింటి కంటే పండోరా పేపర్స్ లీక్ పెద్దదని అంటున్నారు. పనామా, ప్యారడైజ్ పేపర్లు ప్రపంచ రాజకీయాలను కుదిపివేశాయి. 2016లో వెలుగు చూసిన పనామా పేపర్స్ పన్ను ఎగవేతదారులతోపాటు షెల్ కంపెనీలు పెట్టిన వారి వివరాలు వెల్లడించాయి. వ్యక్తిగతంగా కాకుండా సమూహంగా విదేశాల్లో సంస్థలు నెలకొల్పిన వారి వివరాలను ప్యారడైజ్ పేపర్స్ బయటపెట్టాయి. పనామా లీక్ అనంతరం పలు దేశాలు పన్ను చట్టాలను కఠినతరం చేయడంతో పన్నుల నుంచి తప్పించుకునేందుకు ట్రస్టుల బాగోతం మొదలైంది. పన్ను ఎగవేతదారులు, షెల్ కంపెనీల నిర్వాహకులు, ట్రస్టుల బాగోతాలను కూడా పండోరా పేపర్స్ రట్టు చేశాయి.