ఆ ఒక్క అడుగు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చివేసింది.. ఆ ఒక్క అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల కోసం తపించిపోయే నాయకుడిని పరిచయం చేసింది. ఆ ఒక్క అడుగు రాజకీయ రాజకీయ ప్రత్యర్థుల్లో గుబులు పుట్టించింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సాటి మనిషి కష్టాన్ని తెలుసుకోవడానికి ఆ ఒక్క అడుగు శ్రీకారం చుట్టింది. ప్రతీ పేదవాడిని అక్కున చేర్చుకునే ఆపన్న హస్తం అడుగులు వేస్తే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చూపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సమూలంగా మార్చివేయడానికి బయల్దేరిన ఆ అడుగుపడి సరిగ్గా మూడేళ్లు కావస్తోంది..
పాదయాత్ర చేయడం అంటే అన్ని ఊళ్ళని చుట్టేయడం కాదు. ఎడాపెడా నడిచేసి రాష్ట్రం మొత్తం తిరిగేసాను అని మమ అనిపించుకోవడం కాదు. పాదయాత్ర అంటే ప్రతీ పేదవాడి గుండె చప్పుడు దగ్గరనుండి వినడం..కష్టాల్లో ఉన్న సాటి మనిషిని అక్కున చేర్చుకుని వారి కన్నీళ్లను తుడిచే చేయిగా మారడం.. తనను వివిధ కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసినా, ప్రజలకు దూరంగా ఉంచేందుకు ప్రత్యర్ధులు విశ్వ ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రజల కన్నీరు తుడిచేందుకు ఆ చెయ్యి వెనక్కి తగ్గలేదు,ఆ అడుగు వెనక్కి పడలేదు. మహా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడవడానికి రాష్ట్ర ప్రజల సమస్యలను దగ్గరనుండి తెలుసుకోవడానికి వైయస్‌ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన “ప్రజా సంకల్ప యాత్ర”కు తొలి అడుగు మూడేళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు 2017 నవంబర్ 6వ తేదీన పడింది.
ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ప్రారంభం అయిన “ప్రజా సంకల్ప యాత్ర” 14 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగి 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో యాత్ర ముగిసింది. మొదట13 జిల్లాల్లో 6 నెలల పాటు “ప్రజా సంకల్ప యాత్ర” సాగుతుందని పార్టీ వర్గాలు భావించినా, చివరకు అది 14 నెలల పాటు సాగింది. ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావించిన “ప్రజా సంకల్ప యాత్ర” మరో ఎనిమిది నెలల పాటు కొనసాగడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో పూర్తిగా మమేకం కావడమే. “నేను విన్నాను-నేను ఉన్నాను” అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పిన ధైర్యం ఆయన్ను ప్రతీ తెలుగింటి ముద్దు బిడ్డగా మార్చివేసింది. ప్రజా సంకల్ప యాత్ర మూలంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ ఇంటికి కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. తమ కుటుంబ సభ్యులు చెప్పిన సమస్యలు సావధానంగా విన్నారు.
చెరగని చిరునవ్వుతో ప్రతీ గడపను పలకరించారు. సుదీర్ఘంగా సాగిన యాత్రలో తన స్వచ్ఛమైన చిరునవ్వుతో, ప్రజల మేలు కోరే హామీలతో రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చే అత్యుత్తమ నాయకుడు కాగలడన్న ప్రజల విశ్వాసాన్ని జగన్ చూరగొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోలో 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 62 నగరాలు,పట్టణాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగింది. అంతేకాకుండా 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా పాల్గొని ప్రజలకు సుపరిపాలన అందించడమే తన ధ్యేయం అని స్పష్టం చేశారు. ప్రతీ పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పరిపాలన సాగిస్తానని ప్రజా సంకల్ప యాత్రలో జగన్ చెప్పడంతో తాము ఎదురుచూస్తున్న ఆత్మీయ నాయకుడు జగన్ అని రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వసించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారు.
విజయం అంటే ఏదో గాలి వాటంలా కాదు.. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్ కు రాష్ట్ర ప్రజలు జై కొట్టారు. ప్రజా సంకల్ప యాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో గెలుపొంది చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ప్రజా సంకల్ప యాత్ర కారణంగా రాష్ట్ర ప్రజల ఆత్మీయ కుటుంబ సభ్యుడిగా మారిన జగన్ ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా తానిచ్చిన హామీలను ఏడాదిలోపే 90% నెరవేర్చి అసలు సిసలు ప్రజా నాయకుడంటే ఎలా ఉంటారో చూపించారు. సంకల్పానికి ప్రజా బలం తోడైతే ఏం సాధించవచ్చో జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా నిరూపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిరస్మరణీయ పాలనకు బీజం వేసిన ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు అయిన సందర్భంగా..