iDreamPost
android-app
ios-app

Andhra PCC, Congress – పీసీసీ రేసులోకి కొత్తపేరు

  • Published Dec 25, 2021 | 11:01 AM Updated Updated Mar 11, 2022 | 10:30 PM
Andhra PCC, Congress – పీసీసీ రేసులోకి కొత్తపేరు

రాష్ట్ర విభజనతో ఉనికి కోల్పోయిన ఏపీ కాంగ్రెస్‌కు కొత్త జవసత్వాలు కల్పించేందుకు ఉమెన్ చాందీ నేతృత్వంలో ఏఐసీసీ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. ఇందులో భాగంగా పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఈ బృందం రెండు రోజులపాటు సుదీర్ఘ అభిప్రాయ సేకరణ జరిపింది. ఆ అభిప్రాయాలను క్రోడీకరించి ముగ్గురు నేతల పేర్లతో జాబితా సిద్ధం చేసింది. కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు ఈ జాబితాలో కేంద్ర మాజీమంత్రి డాక్టర్ చింతా మోహన్, మాజీ ఎంపీ హర్షకుమార్, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉమెన్ చాందీ బృందం ఒక నివేదికను పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇవ్వనుంది.

రెండురోజులు.. వరుస భేటీలు

చాలా ఏళ్ల తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిపై దృష్టి సారించిన అధిష్టానం పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై రాష్ట్రంలో పార్టీ నేతలతో చర్చించి సూచనలు తీసుకుని నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఇంఛార్జి అయిన ఉమెన్ చాందీని కొద్దిరోజుల కిందట అధిష్టానం ఆదేశించింది. పనిలో పనిగా పీసీసీ అధ్యక్ష పదవికి తగిన నేత ఎవరన్న దానిపై కసరత్తు చేయాలని సూచించింది. ఆ మేరకు రంగంలోకి దిగిన ఉమెన్ చాందీ 22, 23 తేదీల్లో విజయవాడలో అన్ని స్థాయిల పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శులు మయ్యప్పన్, క్రిష్టఫర్లు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రస్తుత పీసీసీ కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. వీరందరితో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు.

సోనియా పరిశీలనకు జాబితా

ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్ ఉన్నారు. ఆయన అంత చురుగ్గా లేకపోవడం, ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికలు, బద్వేలు ఉప ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో కొత్త నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించి.. ఆయన ఆధ్వర్యంలో పార్టీ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈ సమావేశాల్లో ఏఐసీసీ ప్రతినిధులు ప్రధానంగా దానిపైనే దృష్టి సారించారు. ఇందులో భాగంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీనియర్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, పల్లంరాజులతో ప్రత్యేకంగా మాట్లాడి సూచనలు స్వీకరించారు. మెజారిటీ అభిప్రాయం ప్రకారం చింతా మోహన్, హర్షకుమార్, రుద్రరాజుల పేర్లను తుది పరిశీలనకు సోనియాగాంధీకి అందించనున్నారు. వీరిలో ఒకరిని కొత్త అధ్యక్షుడిగా సోనియా ప్రకటిస్తారు. బహుశా జనవరి మొదటివారంలో ఈ ప్రక్రియ పూర్తికావచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read : ఉత్తరప్రదేశ్‌తో నెహ్రూ గాంధీ కుటుంబాల అనుంబధం ఎలాంటిది..?