iDreamPost
android-app
ios-app

అప్పుడు అబ్బాయి ఇప్పుడు పవర్ స్టార్ – Nostalgia

  • Published Oct 11, 2020 | 7:12 AM Updated Updated Oct 11, 2020 | 7:12 AM
అప్పుడు అబ్బాయి ఇప్పుడు పవర్ స్టార్ – Nostalgia

24 సంవత్సరాల క్రితం ఇదే రోజు అక్టోబర్ 11న 1996లో మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలైంది. అప్పటికి రామ్ చరణ్ ఇంకా టీనేజ్ లో కూడా అడుగు పెట్టని వయసు కాబట్టి పవన్ నే మెగా వారసుడిగా అభిమానులు అంచనాలు పెంచుకున్నారు. అయితే మొదటి సినిమా కనక సబ్జెక్టు విషయంలో మెగా కాంపౌండ్ ఎలాంటి రిస్క్ చేసే ఆలోచనలో లేదు. నాగబాబు అప్పటికే హీరోగా ఫెయిలయ్యాడు. సో మళ్ళీ అలా రిపీట్ కాకూడదు. అందుకే 1988లో వచ్చిన అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ఖయామత్ సే ఖయామత్ తక్ ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగు ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు కొన్ని కమర్షియల్ అంశాలు గట్టిగా జోడించారు.

బయటి నిర్మాత అయితే రిస్క్ కాబట్టి గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ముందుకొచ్చారు. స్టార్లను డీల్ చేయడంలో ప్రూవ్ చేసుకుని చిరుకి అల్లుడా మజాకా రూపంలో సూపర్ హిట్ ఇచ్చిన ఈవివిని దర్శకుడిగా ఎంచుకున్నారు. లవ్ స్టోరీ కాబట్టి హీరోయిన్ కూడా కొత్తమ్మాయి అయితే బాగుంటుందని ఏఎన్ఆర్ మనవరాలు సుప్రియను అడిగారు. ఆ కుటుంబం సంతోషంగా ఒప్పుకుంది. కోటి సంగీతం, ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం, సత్యానంద్ సంభాషణలు ఇలా మంచి టెక్నికల్ టీమ్ సెట్ అయ్యింది. క్యాస్టింగ్ విషయంలో రాజీ పడలేదు. శరత్ బాబు, చంద్రమోహన్, నాజర్, కోట, బాబు మోహన్, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అల్లు రామలింగయ్య, ఆహుతి ప్రసాద్, గోకిన రామారావు, రాజా రవీంద్ర ఇలా తారాగణం భారీగా కుదిరింది. ఒక స్పెషల్ సాంగ్ కోసం రంభను అడిగితే ఎస్ చెప్పేసింది. అలా అతిరథమహారధులంతా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో భాగమయ్యారు.

పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రెండు పెద్ద కుటుంబాలకు చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఏమవుతుందనే పాయింట్ మీద ఇది రూపొందింది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న ట్రాజెడీ క్లైమాక్స్ ని ఇక్కడ మార్చారు. అయితే పగలు ప్రతీకారాలతో రూపొందిన ఈ పాయింట్ లో ప్రేక్షకులకు ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. లవ్ స్టోరీ కాస్తా రొటీన్ మసాలా పిక్చర్ గా అనిపించింది. పవన్ లో హీరో మెటీరియల్ ఉందని రుజువు చేయడానికి తప్ప అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పెద్దగా చేసిన అద్భుతాలు లేవు. కోటి హుషారైన పాటలు, పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. మెగా తమ్ముడనే బ్రాండ్ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తెచ్చింది. కొన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడింది. తర్వాత సుప్రియ రెండు దశాబ్దాల పాటు సినిమాల్లో కనిపించనే లేదు. అప్పుడు కాలేజీ అబ్బాయిగా పరిచయమైన పవన్ ఇప్పుడు పవర్ స్టార్ రేంజ్ కి ఎదిగాడు.