Idream media
Idream media
విరాట్ కోహ్లీ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.అతని ఘనత గురించి రికార్డులే మాట్లాడతాయి. తాజాగా ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ అనే కార్యక్రమంలో పాల్గొన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు అంశాలను ప్రస్తావించాడు. ఈ సందర్భంగా 2014 ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాట్స్‌మన్‌గా వైఫల్యం కావడం,తన కెప్టెన్సీలో టీమిండియా విజయాలపై కోహ్లీ తన ఆలోచనలను పంచుకున్నాడు.
బీసీసీఐ వెబ్‌సైట్‌లో మయాంక్ అగర్వాల్‌తో జరిపిన వీడియో చాట్‌లో కోహ్లీ 2014 ఇంగ్లాండ్ పర్యటనపై స్పందిస్తూ “ఆ పర్యటన నా కెరీర్‌లో మైలురాయి. చాలా మంది క్రికెటర్లు విజయవంతమైన పర్యటనను మైలురాయిగా భావిస్తారు. కానీ నేను మాత్రం విఫలమైన ఆ ఇంగ్లాండ్ టూర్‌ను మైలురాయి అని భావిస్తాను. ఆ పర్యటన తర్వాత ముంబైలో సచిన్ టెండూల్కర్‌ని కలిశా.ఫాస్ట్ బౌలింగ్‌లో ఫార్వర్డ్ ప్రెస్ ద్వారా ఆడాలని సచిన్ సూచించాడు. అలాగే భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రిని కలవగా క్రీజు బయటి నుంచి స్టాన్స్ తీసుకోవాలని సలహా చెప్పాడు. వాటిని పాటించాక నా బ్యాటింగ్ ఎంతో మెరుగుపడింది.ఇక తనతో పాటు శిఖర్ ధావన్ సైతం శాస్త్రి వద్ద ప్రత్యేక సెషన్ తీసుకున్నాడు” అని వివరించాడు.
ఇక కెప్టెన్సీ విజయవంతమవ్వడానికి కారణం ఏమిటని టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అడగ్గా “ఒక కెప్టెన్‌గా తానెప్పుడూ జట్టు విజయాల గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఫలితం కోసం రాజీపడను. మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం నాకు చివరి అవకాశంగా ఉంటుంది.ఆట చివరిరోజు 300 పరుగులు చేయాల్సి ఉంటే ప్రతి సెషన్‌లో ఓ 100 పరుగులు చేయాలని ఆటగాళ్లకు చెప్తా.పరిస్థితి ప్రతికూలంగా ఉంటేనో లేక చివరి గంటలో ఏం చేయలేని పరిస్థితులలో ఉంటే అప్పుడు మ్యాచ్ డ్రా చేసుకోవాలని అనుకుంటాను” అని భారత సారథి కోహ్లీ వివరించాడు.
కాగా 2014 ఇంగ్లండ్ గడ్డపై జరిగిన 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లో కేవలం 134 పరుగులు మాత్రమే కోహ్లీ చేశాడు. తన కెరీర్‌లోనే అతి తక్కువ సగటు నమోదు కోహ్లీ చెయ్యగా 1-3 తేడాతో టీమిండియా సిరీస్‌ని కోల్పోయింది.ఇంగ్లండ్ టూర్ తర్వాత బ్యాటింగ్ మార్చుకున్న కోహ్లీ 2014-15 ఆసీస్ టూర్‌లో 692 పరుగులతో రాణించి సత్తా చాటాడు.
ఇక 2014లో మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక కోహ్లీ ఆ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటివరకు కోహ్లీ కెప్టెన్సీలో 55 టెస్టులాడిన టీమిండియా ఏకంగా 33 మ్యాచ్‌లలో విజయం సాధించింది. టెస్టులలో భారత్ తరఫున ఒక కెప్టెన్ సాధించిన అత్యుత్తమ విజయాల రికార్డ్ ఇదే.అలాగే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 61.21 సగటుతో 5142 పరుగులు సాధించాడు.అందులో 20 సెంచరీలు,12 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.
కానీ 2017 నుంచి పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడం గమనార్హం.