iDreamPost
android-app
ios-app

నరసింహనాయుడు ఉగ్రరూపానికి 20 ఏళ్ళు – Nostalgia

  • Published Jan 11, 2021 | 12:03 PM Updated Updated Jan 11, 2021 | 12:03 PM
నరసింహనాయుడు ఉగ్రరూపానికి 20 ఏళ్ళు – Nostalgia

2001 సంవత్సరం. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం బాక్సాఫీస్ వద్ద వాతావరణం చాలా వేడిగా ఉంది. టాలీవుడ్ దిగ్గజాలు ఒకే సీజన్ లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అందులోనూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధపడటంతో ఇండస్ట్రీలోనూ ఒకరకమైన ఉద్విగ్న వాతావరణం. ఇది చాలదన్నట్టు నాలుగు రోజుల తర్వాత వెంకటేష్ మూవీ కూడా లైన్ లో ఉంది. కోట్ల రూపాయల పెట్టుబడులు మంచి నీళ్ల ప్రవాహంలా పారుతున్నాయి. థియేటర్ల వద్ద అభిమానుల జాతర మాములుగా లేదు. టికెట్ల కోసం పైరవీలు మొదలయ్యాయి. ఎవరు గెలుస్తారనే దాని మీద పందేలు వేసుకోవడం కూడా అతిశయోక్తి కాదు. ఆ రోజు రానే వచ్చింది.

జనవరి 11

ప్రతి ఒక్క సెంటర్లో సినిమా హాళ్ల దగ్గర జాతర సందడి. ఒకపక్క మృగరాజు థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ కోలాహలం. మరోపక్క నరసింహనాయుడు కోసం నందమూరి అభిమానుల ఆనందహేళ. విపరీతమైన అంచనాలు. బ్లాక్ టికెట్లు లక్షల్లో తెగుతున్నాయి. హీరోల కంటే ఎక్కువగా ఫ్యాన్స్ సై అంటే సై అని సవాల్ విసురుకున్నారు. తెల్లవారుఝామునే షోలు మొదలయ్యాయి. మృగరాజు టాక్ వచ్చేసింది. మరీ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని బరువెక్కిన హృదయంతో ఫ్యాన్స్ ఒప్పేసుకున్నారు. తాము ఎంత నష్టపోబోతున్నామో ఊహించుకుని దాన్ని కొన్న ఎగ్జిబిటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యింది. కానీ నరసింహనాయుడు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా వ్యతిరేకంగా ఉంది.

టైటిల్ కార్డుకు ముందు చైల్డ్ ఎపిసోడ్ తో మొదలుకుని ప్రతి ఫ్రేమ్ ని దర్శకుడు బి గోపాల్ తీర్చిదిద్దిన తీరుకి అభిమానులకే కాదు సాధారణ మాస్ ప్రేక్షకులకు సైతం పూనకాలు రావడం ఒక్కటే తక్కువ. మణిశర్మ వెర్రెక్కించే పాటలకు తమ హీరో అదిరిపోయే స్టెప్పులతో అదరగొడుతుంటే ఎవరికీ కుర్చీలో కూర్చోవడానికి మనసు రావడం లేదు. ఎగిరెగిరి ఈలలు గోలలతో సౌండ్ బాక్సులు పగిలిపోయే రేంజ్ లో అల్లరి చేస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాపే అయినప్పటికీ ఖర్చుకు వెనుకాడకుండా బాలయ్యని పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ లో చూపించిన వైనానికి అప్పటికప్పుడు ఎందరో దీని మళ్ళీ మళ్ళీ చూడాలని డిసైడ్ అయ్యారు. అలా మొదలైన ఊచకోత చరిత్ర ఎన్నడూ చూడని స్థాయిలో ఏకంగా 19 కేంద్రాల్లో 175 రోజులు ఏకధాటిగా ప్రదర్శించే దాకా కొనసాగుతూనే ఉంది. కొందరు ఎన్ని వందల సార్లు ఈ సినిమాను చూశారో వాళ్లే లెక్క మర్చిపోయారు.

అంతగా మాస్ హిస్టీరియా రప్పించిన నరసింహనాయుడులో ఏముంది. మాస్ అంతగా ఎందుకు మైమరిచిపోయారంటే సమాధానం చెప్పడం కష్టం. షడ్రసోపేతమైన విందు భోజనం సంపూర్ణంగా అద్భుతంగా ఉన్నప్పుడు ఏ ఐటెం బాగుందో చెప్పమంటే దానికి బదులు రాబట్టడం సాధ్యమా. ఈ సినిమా కూడా అంతే. పగలు ప్రతీకారాలు ఎంత ఉన్నాయో అంతే సమాన స్థాయిలో ఎమోషన్, సెంటిమెంట్ ని జొప్పించారు స్టోరీ రైటర్ చిన్ని కృష్ణ, సంభాషణ రచయితలు పరుచూరి బ్రదర్స్.

అన్నయ్యలను ప్రాణం కంటే ఎక్కువగా గుడ్డిగా ప్రేమించే చదువురాని ఓ అమాయక తమ్ముడు ఫ్యాక్షన్ రక్కసి కోరలకు తన భార్య ప్రాణాన్ని బలిపెట్టాల్సి వచ్చినా భయపడడు. శత్రువుల ఆటకట్టించే నరసింహనాయుడుగా నరసింహావతారం ఎత్తి వాళ్ళ భరతం పడతాడు. తన ఊరిని నమ్ముకున్న ప్రజలకు రక్షకుడిగా నిలిచి తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటాడు. అమాయకత్వం, రౌద్రరసం సమపాళ్ళలో విశ్వరూపం చూపించిన బాలయ్య నటన గురించి మాటల్లో వర్ణించడం సులభం కాదు.

అప్పటిదాకా సమరసింహారెడ్డి, నువ్వే కావాలి, కలిసుందాం రా పేరు మీద ఉన్న రికార్డులను నరసింహనాయుడు మంచి నీళ్లు తాగినంత తేలికగా బద్దలు కొట్టేసింది. సుమారు 22 కోట్ల షేర్ తో అప్పటి 50 రూపాయల లోపే ఉన్న గరిష్ట టికెట్ ధరలకు బయ్యర్లకు కనక వర్షం కురిపించింది. పాటలు, మాటలు, పోరాటాలు ఒకటేమిటి ఏదీ తక్కువ కాకుండా అన్నీ సమపాళ్లలో బాలయ్య బి గోపాల్ కలిసి అందించిన ఈ మాస్ మీల్స్ కోసం జనం ఖర్చు పెట్టిన టికెట్ డబ్బులకు పూర్తి న్యాయం చేకూరింది.

సమరసింహారెడ్డి తర్వాత ఆ స్థాయిలో విజయం మళ్ళీ దక్కలేదే అన్న అసంతృప్తితో ఉన్న అభిమానులకు నరసింహనాయుడు సాగించిన జైత్రయాత్ర చూసేందుకు రెండు కళ్ళు చాలలేదు. ప్రతి సెంటర్ లోనూ అరాచకమే. ఎక్కడ చూసినా టికెట్ల కోసం తోపులాటలు, లాఠీ చార్జీలు సాధారణం అయ్యాయి. ఇప్పట్లా ఆన్ లైన్ బుకింగ్ లేని రోజులవి. కౌంటర్ దగ్గర చెమట చిందిస్తే కానీ థియేటర్ లోపలి వెళ్లేందుకు టికెట్ ముక్క దొరకని పరిస్థితి. అందుకే ఇలాంటి మాస్ ఎంటర్ టైనర్లని ఆ రోజుల్లో చూసినవాళ్ల మధుర జ్ఞాపకాలు ఇప్పటి తరం అనుభూతి చెందడం కష్టమే.