ఫైట్లు ఉన్నాయా – లేవు
విలన్ ని ఛాలెంజ్ చేసే భారీ డైలాగులు – లేవు
ఐటెం సాంగ్ – లేదు
వెకిలి కామెడీ ద్వందార్థాలు – లేవు
స్కిన్ షో చేసే హీరోయిన్ – లేదు
ప్రకాష్ రాజ్ రేంజ్ ప్రతినాయకుడు – లేడు
భారీ సెట్టింగులు – నో
కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ – వాడలేదు
మరి ఏమున్నాయిరా ఈ సినిమాలో. ఎందుకు 19 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ దాని తాలూకు తీయని జ్ఞాపకాలలో అందరూ మునిగితేలుతున్నారు. టీవీ లో వస్తే చాలు రిమోట్ పక్కనపెట్టేసి కళ్లప్పగించి మరీ చూస్తున్నారు. యుట్యూబ్ లో ఎన్ని ఛానల్స్ లో పెట్టినా మిలియన్ల వ్యూస్ ని వర్షంలా కురిపిస్తున్నారు, ఫ్యామిలి మొత్తం సరదాగా ఏదైనా చూద్దామంటే ఫస్ట్ లిస్ట్ లో ఉన్న ఈ మూవీ ఎందుకు ఆ స్థానాన్ని అలాగే భద్రపరుచుకుంది. ఈ ప్రశ్నలకు, కామెంట్లకు అన్నింటికీ ఒకటే సమాధానం 2001లో ఇదే రోజున విడుదలైన ‘నువ్వు నాకు నచ్చావ్’
విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని మాస్ లోనూ బలమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న వెంకటేష్ కెరీర్ లో ఎప్పుడూ కుటుంబ కథా చిత్రాలను చేయడానికి వెనుకాడలేదు. బొబ్బిలిరాజా లాంటి మసాలా సినిమాలు ఇమేజ్ ని తెచ్చినప్పటికీ శత్రువు దాన్ని బలపరిచినప్పటికీ ఎమోషన్స్ ని బలంగా చూపించే కథలు దర్శకులు దొరికితే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించవచ్చని తనే కలిసుందాం రాతో నిరూపించిన సత్యాన్ని నువ్వు నాకు నచ్చావ్ రూపంలో సిమెంట్ వేసి మరీ గట్టిపరిచారు.
నిజానికి ఇందులో గొప్ప కథేమీ ఉండదు. ఓ మధ్యతరగతి వ్యక్తి తన కొడుకుని ఉద్యోగం కోసం బాగా స్థిరపడిన చిన్ననాటి స్నేహితుడి ఇంటికి పంపిస్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక అప్పటికే నిశ్చితార్థం జరిగిన ఆ ఫ్రెండ్ కూతురిని తన ప్రమేయం లేకుండానే ఇష్టపడేలా చేసుకుంటాడు. ఇప్పుడు తండ్రికి ద్రోహం చేసి వాళ్ళ స్నేహాన్ని విడగొట్టడం ఇష్టం లేక హీరో ఏం చేస్తాడన్నదే ఇందులో స్టోరీ. ఇలా చూసుకుంటే ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. పైపెచ్చు సంప్రదాయానికి విరుద్ధంగా ఇంకొకరికి భార్యగా మారాల్సిన అమ్మాయిని ప్రేమించడం ఏమిటనే వ్యతిరేక కోణం కనిపిస్తుంది. కానీ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు విజయ్ భాస్కర్ లు స్క్రిప్ట్ ని నమ్ముకున్నారు. వీళ్లిద్దరికీ స్రవంతి రవి కిషోర్ తో కమిట్ మెంట్ ఉంది. వెంకటేష్ డేట్లు సురేష్ బాబు దగ్గరున్నాయి. ఇంకేముంది శ్రీకారం జరిగిపోయింది.
న్యూయార్క్ లో ఉన్న ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కోటి అద్భుతమైన సంగీతానికి సిరివెన్నెల అమృతం లాంటి సాహిత్యం తోడయ్యింది. షూటింగ్ చకచకా జరిగిపోయింది. బ్రహ్మానందం వచ్చాక జరిగే ఎగ్జిబిషన్ ఎపిసోడ్ తప్ప దాదాపు సినిమా మొత్తం ఇంటీరియర్ లో ఒకే ఇంట్లో జరుగుతుంది. కానీ ప్రేక్షకుడికి ఎక్కడా అనుమానం రాదు. పాత్రలతో జరిగే ప్రయాణాన్ని అంత గొప్పగా తెరకెక్కించారు. ముఖ్యంగా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి శుభం కార్డు దాకా ప్రతి సీన్లోనూ త్రివిక్రమ్ చమక్కులు ఓ రేంజ్ లో పేలాయి. పాటలు వచ్చినప్పుడు తప్ప నవ్వుతూనే ఉన్న ఆడియన్స్ పెదవులకు రెస్ట్ దొరకడం లేదు. ఇదేంటి ఫ్యామిలీ సినిమా 3 గంటలు ఉందని డిస్ట్రిబ్యూటర్లు మొదట ఖంగారు పడినప్పటికీ తర్వాత ఏదైనా కట్ చేద్దామన్నా ఆ అవకాశం ఇవ్వనంత గొప్పగా తీశారు విజయ్ భాస్కర్.
ఇందులో ఫలానా ఎపిసోడ్ చాలా బాగుందని చెప్పడానికి లేదు. ఆర్తి అగర్వాల్ ఎంగేజ్మెంట్ తో మొదలుకుని రైల్వే స్టేషన్ లో జరిగే క్లైమాక్స్ ముందు వరకు హిలేరియస్ గా సాగుతుంది. డైలాగులు ఇలా కూడా రాస్తారా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. త్రివిక్రమ్ పరిచయం చేసిన పంచులు బయట కాలేజీల్లో, టీ స్టాల్స్ లో ఊత పదాలుగా మారిపోయాయి. మనసు బాలేనప్పుడు ఇందులో సన్నివేశాలను గుర్తు చేసుకోవడం అప్పటి ఆడియన్స్ కి చాలా మాములు విషయం. ఆడియో క్యాసెట్లు హాట్ కేకులు అయ్యాయి. పెళ్లి జరిగిన ప్రతి చోట ఆకాశం దిగివచ్చి మబ్బులతో పాట మారుమ్రోగిపోయింది. అమ్మాయి ప్రేమ వేదనను ఆవిష్కరించిన సిరివెన్నెల పాట ఒక్కసారి చెప్పలేవాకి పరవశించని వారు లేరు.
అలా నువ్వు నాకు నచ్చావ్ ఎప్పటికీ నచ్చే సినిమాగా మిగిలిపోయింది. వినోదానికి సరైన నిర్వచనం ఇస్తూ ఒక చక్కని ఆహ్లాదకరమైన చిత్రంగా ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. టీవీ ఆన్ చేసి నువ్వు నాకు నచ్చావ్ ని వేసుకుని 3 గంటల సేపు స్వచ్ఛమైన గాలి లాంటి ఈ ఎంటర్ టైనర్ ని ఆస్వాదించడమే.
దేవుడా ఓ మంచి దేవుడా
త్రివిక్రమ్ లాంటి రైటర్ ని పంపించావ్….
విజయ్ భాస్కర్ ని దర్శకుడిగా సెట్ చేశావ్….
రవి కిషోర్ సురేష్ బాబులను నిర్మాతలుగా ఒప్పించావ్….
ఆర్తి లాంటి అందగత్తెను పరిచయం చేశావ్….
కోటితో అద్భుతమైన పాటలు అందించావ్….
నవ్వులతో థియేటర్లను ముంచెత్తావ్…..
అన్నీ కలిపి ఇలాంటి గొప్ప సినిమాను తీయించావ్….
అందుకే
నువ్వు నాకు నచ్చావ్ ………