iDreamPost
android-app
ios-app

ప్రేమకథలో కమర్షియల్ ఎలిమెంట్స్ – Nostalgia

  • Published Apr 05, 2021 | 9:29 AM Updated Updated Apr 05, 2021 | 9:29 AM
ప్రేమకథలో కమర్షియల్ ఎలిమెంట్స్ – Nostalgia

ప్రేమకథలు కేవలం యూత్ కి మాత్రమే కనెక్ట్ అవుతాయనుకుంటే పొరపాటు. సరైన రీతిలో కమర్షియల్ అంశాలు జొప్పించగలగాలే కానీ క్లాసు మాసు అందరూ చూస్తారని చాలా సార్లు ఋజువయ్యింది. దానికో చక్కని ఉదాహరణ దిల్. 2003 సంవత్సరం. ఆదితో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వివి వినాయక్ కు రెండో సినిమా చెన్నకేశవరెడ్డి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మూడో ప్రయత్నంలో పొరపాటు చేయకూడదని నిర్ణయించుకున్నారు. మాస్ టచ్ ఉన్న అర్బన్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా కార్యరూపం దాల్చిన మూవీనే దిల్. ఆ టైంలో ఈ ట్రెండ్ మంచి ఊపుమీదుంది.

డిస్ట్రిబ్యూటర్ గా అప్పటికే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న వెంకటరమణా రెడ్డి అలియాస్ రాజు నిర్మాతగా తన తొలి ప్రయత్నాన్ని వినాయక్ తో చేయాలని డిసైడ్ అయ్యారు. జయం దెబ్బకు హాట్ కేక్ గా మారిన నితిన్ కు కంప్లీట్ మేకోవర్ లా అనిపించిన దిల్ లో శీను క్యారెక్టర్ ఎనర్జీ విపరీతంగా నచ్చేసింది. అందులోనూ వినాయక్ ప్రాజెక్ట్. ఇంకేమి ఆలోచించలేదు. తేజ సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన ఆర్పి పట్నాయక్ ని సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేశారు. డైరెక్టర్ కు వ్యక్తిగతంగా మణిశర్మనే తీసుకోవాలని ఉన్నా బడ్జెట్ పరిమితులతో పాటు నితిన్ లాంటి యూత్ హీరోలకు పట్నాయకే రైట్ ఛాయస్ అని ఫిక్స్ అయ్యారు.

హీరోయిన్ గా నేహా అనే కొత్తమ్మాయి ఎంపికయ్యింది. మెయిన్ విలన్ గా ప్రకాష్ రాజ్, ఇతర పాత్రల్లో వేణుమాధవ్, రాజన్ పి దేవ్, చలపతిరావు, సుధ, ఎంఎస్ నారాయణ, ఎల్బి శ్రీరామ్, సుధ, రఘుబాబు తదితరులను తీసుకున్నారు. రీజనబుల్ బడ్జెట్ లో వినాయక్ అనుకున్న టైంలో సినిమాను పూర్తి చేశారు. 2003 ఏప్రిల్ 5 దిల్ మంచి అంచనాల మధ్య వచ్చింది. కేవలం వారం ముందు ప్రభాస్ రాఘవేంద్ర, అల్లు అర్జున్ డెబ్యూ గంగోత్రిలు రిలీజైనప్పటికీ వాటి ప్రభావం దిల్ మీద పడలేదు. వేణుమాధవ్ కామెడీ ఇప్పటికీ వన్ అఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సుమారు 90కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకోవడం ఒక రికార్డు. దీని వల్లే రాజు కాస్త దిల్ రాజుగా సినిమానే ఇంటి పేరుగా మార్చుకుని అలా అగ్రనిర్మాతగా ఎదిగిపోయారు.