iDreamPost
iDreamPost
బహుశా ఒక సినిమా శాటిలైట్ ఛానల్ లో పదే పదే వచ్చినా జనం మళ్ళీ మళ్ళీ చూడటం బహుశా ఒక్క అతడు విషయంలోనే జరిగి ఉంటుంది. దీని హక్కులు కొన్న స్టార్ మా ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసిందో లెక్కబెట్టడం అంటే కష్టమే. అయినా విసుగు రాకుండా వచ్చిన ప్రతిసారి ఎంటర్ టైన్ చేయడమే కాక ఇప్పటికే చూశాం కదా అనే ఫీలింగ్ రప్పించకుండా రిమోట్ కు పని కల్పించకుండా అలా చూస్తూ ఉండిపోయేలా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ కంప్లీట్ ప్యాకేజ్ అతడు సినిమా ఈరోజుతో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దర్శకుడిగా తనకు రెండో సినిమానే అయినప్పటికీ త్రివిక్రమ్ దాన్ని స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఎన్నిసార్లైనా కట్టిపడేసేలా ఇప్పటికీ చేస్తూనే ఉంది. అందుకే అతడు అభిమనులకే కాదు ఎందరికో ఒక స్వీట్ మెమరీ.
నిజానికి అతడు ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన మూవీ కాదు. కానీ అంతకు మించిన ఘనతలు సాధించింది. సాధారణంగా హీరో పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటే మన ఆడియన్స్ ఒప్పుకోరు. అవి విలన్ కు మాత్రమే ఉండాలనే సూత్రాన్ని బలంగా నమ్ముతారు. ఒకవేళ డ్యూయల్ రోల్ ఉండి ఒకటి గుడ్ ఒకటి బ్యాడ్ అయితే పర్లేదు కానీ అతడు టైపులో అంటే మాత్రం రిస్కే. గతంలో నాగార్జున ‘కిల్లర్’ సినిమాలో ఇదే తరహా పాత్ర పోషించారు. డబ్బు కోసం అభంశుభం తెలియని ఓ పెద్దావిడ, చిన్నపాపను చంపేందుకు సిద్ధపడతాడు. తర్వాత తప్పు తెలుసుకున్నా అతనికి మంచి తెలియని మాట వాస్తవం. అందుకే అది అంతగా కనెక్ట్ కాలేదు. ‘బాజిగర్’లో షారుఖ్ ఖాన్ ఇమేజ్ లేని టైంలో ఫక్తు నెగటివ్ రోల్ చేశాడు కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయ్యింది. అందుకే అతడు విషయంలో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
చనిపోయిన స్నేహితుడి స్థానంలో హీరో వెళ్లి అతని కుటుంబాన్ని చక్కదిద్దడం అనే పాయింట్ 1988 వారసుడొచ్చాడు సినిమాలో ఉంది. వెంకటేష్ హీరో. కాకపోతే అందులో క్రైమ్ ఎలిమెంట్ ఉండదు. కథ ఓ పల్లెటూరిలో సాగుతుంది. మదర్ సెంటిమెంట్ ను బాగా పండించారు దర్శకులు మోహనగాంధీ. లైన్ పరంగా అతడుకి దీంతో పోలిక ఉంటుంది. కాని హీరో క్యారెక్టరైజేషన్, మర్డర్ సెటప్ ఇదంతా పూర్తిగా వేరు. అందుకే అతడుని ప్రతిఒక్కరు కొత్తగా ఫీలయ్యారు. ఎక్కువ డైలాగులు లేకుండా చిన్న చిన్న పదాలే వాడుతూ సీరియస్ గా కనిపించే పార్థుతో ప్రేమలో పడిపోయారు.
తన కెరీర్లోనే వన్ అఫ్ ది బెస్ట్ అనిపించేలా మణిశర్మ ఇచ్చిన పాటలు, నేపధ్య సంగీతం అతడుని ఇంకో లెవెల్ కు తీసుకెళ్ళాయి. త్రిష అందం-నటన, జయభేరి నిర్మాణ విలువలు, బ్రహ్మానందం కామెడీ ట్రాక్ అన్నిటిని మించి త్రివిక్రమ్ మాటల మాయాజాలం మూడు గంటల నిడివి ఉన్న అతడుని విసుగు రాకుండా చూసేలా మెప్పించాయి. ఇప్పటికీ ఇందులో సన్నివేశాలు, సంభాషణలు సోషల్ మీడియా మేమ్స్ కోసం వాడుతున్నారంటేనే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. కమర్షియల్ సినిమాని కొత్త కోణంలో ఆవిష్కరించిన అతడు వచ్చి 15 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తోందంటే దానికి కారణం అతడుకి ఎక్స్ పైరి డేట్ లేకపోవడమే