ఒక్కరోజులో 45,601 పాజిటివ్ కేసులు – 1,130 మరణాలు
దేశంలో కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడటం లేదు. గత కొద్దిరోజుల నుండి 35 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 45,601 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12,39,684 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 29,890 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజులో 1130 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు దేశంలో నమోదయిన మరణాల్లో ఇదే అత్యధికం…కానీ తొలిసారిగా 45 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్దారణ కావడం ఆందోళన కలిగించే విషయం.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ బారినుండి 7,84,267 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 4,25,113 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో తొలిసారిగా 10 వేలకు పైగా పాటిజివ్ కేసులు
మహారాష్ట్రలో కరోనా కరళ నృత్యం చేస్తోంది.దేశంలో తొలిసారిగా మహారాష్ట్రలో ఒక్క రోజేలోనే 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 10,576 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,607 కి చేరుకుంది.అలాగే కరోనా మరణాలు కూడా గడిచిన 24 గంటలలో భారీగా నమోదయ్యాయి.ఇవాళ ఒక్కరోజే 280 కరోనా మరణాలు సంభవించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకి 12,556 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఈరోజు 5552 మంది కరోనా బాధితులు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో వైరస్ నుండి రికవరీ అయిన వారి సంఖ్య 1,87,769 కి చేరింది. ఇవాళ ముంబైలో కొత్తగా 1,310 మందికి వైరస్ సోకగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,678 చేరింది. గత 24 గంటల వ్యవధిలో ముంబైలో కరోనా కారణంగా 58 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 5,875 కి చేరింది.
తెలంగాణాలో 49 వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో నిన్న కొత్తగా 1,555 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో తెలంగాణలో 49,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,155 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 37,666 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 438 మంది మృత్యువాత పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో 60 వేలు దాటిన కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. నిన్న రికార్డు స్థాయిలో 6,045 కొత్త కేసులు నమోదయ్యాయి.. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 64,713 మందికి కరోనా సోకగా 823 మంది మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 65 మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగించే విషయం. 32,127 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,763 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 15,374,394 మందికి కోవిడ్ 19 సోకగా 630,211 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 9,349,374 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 4,100,875 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 146,183 మంది మరణించారు.