రేపు ఎల్లుండి కలిపి మొత్తం తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. అదేంటని ఆశ్చర్యపోతున్నారా. నిజంగానే అన్ని వస్తున్నాయి మరి. లాక్ డౌన్ కు ముందు ఆగిపోయి ఆ తర్వాత చకచకా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చిత్రాలన్నీ పోటీని లెక్క చేయకుండా మరీ ఒకేసారి బరిలో దిగుతున్నాయి. అయితే ఒక్క నితిన్ ‘చెక్’ మీద మాత్రమే చెప్పుకోదగ్గ బజ్ ఉండటం గమనించాల్సిన అంశం. విచిత్రంగా దీని అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా బుక్ మై షో, పేటిఎం యాప్స్ లో గమనిస్తే సిచువేషన్ అర్థమవుతుంది.
నితిన్ లాంటి మార్కెట్ ఉన్న హీరోకే ఇలా అయితే ఇక వేరే వాటి గురించి చెప్పాలా. అంతో ఇంతో ప్రమోషన్ గట్టిగానే చేసుకున్న ‘అక్షర’ కు క్యాస్టింగ్ బలం లేకపోవడంతో పూర్తిగా కంటెంట్ మీదే ఆధారపడుతోంది. ఓ రెండు షోలు అయ్యాక పబ్లిక్ టాక్ అండ్ రివ్యూలను బట్టి కలెక్షన్లు వస్తాయనే అంచనాలో ఉంది. ట్రైలర్ చూస్తే నాంది తరహాలో ఏదో సీరియస్ ఇష్యూ తీసుకున్నట్టు కనిపిస్తోంది కానీ నిన్న రిలీజ్ చేసిన ఇంకో కామెడీ ట్రైలర్ చూశాక కొంత అనుమానం కలిగిన మాటా వాస్తవం. పెద్ద నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లుగా చేయూతనిస్తున్న ‘క్షణక్షణం’ పరిస్థితి కూడా ఇంతే. టైటిల్ ని బట్టి క్రేజ్ వచ్చే రోజులు కావివి. థియేటర్ రెస్పాన్స్ ముఖ్యం.
ఇవి కాకుండా జెడి చక్రవర్తి ‘ఎంఎంఓఎఫ్’ తో పాటు అంగుళీక, లాయర్ విశ్వనాధ్, బాలమిత్ర, నువ్వు నేను ఒకటైతే అంటూ ఏవేవో చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఎల్లుండి రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘క్లైమాక్స్’తో పాటు ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ అనే మరో రెండు మూవీస్ కూడా వస్తున్నాయి. అసలు ఇన్నేసి సినిమాలకు ఎన్ని స్క్రీన్లు వస్తాయి ఎన్ని షోలు వేయబోతున్నారు అనేది భేతాళ ప్రశ్నే. చెక్ కు భారీగా నెంబర్ దొరుకుంది అందులో సందేహం లేదు. మరి మిగిలినవి ఉనికిని చాటుకోవాలంటే సినిమా బాగుందనే మాటను బయటికి రప్పించుకోవాలి. చూద్దాం చిన్న సినిమాల పెద్ద యుద్ధంలో గెలుపు ఎవరిదో.