iDreamPost

రామోజీ నిన్ను వదల.. నల్ల కోటులో ఉండవల్లి

రామోజీ నిన్ను వదల.. నల్ల కోటులో ఉండవల్లి

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కుంభకోణం కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్‌ చేయడాన్నిసవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ గతంలో సుప్రీం కోర్ట్ లో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. రిజర్వు బ్యాంకు ప్రత్యేక అధికారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సుప్రీంకోర్ట్ తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సవరించిన మెమోను దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణకు రెండు వారాల పాటు వాయిదా వేసింది.

Read Also: ప్రజలా?పార్టీనా?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం-1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి, డిపాజిట్ దారులనుండి అక్రమంగా దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్న అభియోగంపై మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చర్యలు తీసుకునేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబర్‌ 19న ఉత్తర్వులు వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమంగా ప్రజలనుండి భారీగా డిపాజిట్లు సేకరించిందనే ఆరోపణల నేపథ్యంలో డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్‌.రంగాచారిని నియమిస్తూ అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్‌ 800 జారీచేసింది. అలాగే ఈ సంస్థపై ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(టి), సెక్షన్‌ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థానంలో కేసు ఫైల్‌ చేసేందుకు అప్పటి సీఐడీ ఐజీ కృష్ణ రాజును జీవో నెంబర్‌ 801 ద్వారా అధీకృత అధికారిగా నియమించింది.

Read Also: చిరంజీవి షరీఫ్ క్లాస్మేట్సా? షరీఫ్ బాస్ ఎవరు ?

ఎన్‌.రంగాచారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణరాజు 23 జనవరి 2008న ఫస్ట్‌ అడిషనల్‌ చీఫ్‌ మెట్రొపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సీసీ నెంబర్‌ 540 దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2010లో ఈ పిటిషన్‌ను ఆ న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరుతూ తిరిగి 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే ఇచ్చింది.

అయితే ఇటీవల సుప్రీం కోర్ట్ ఇచ్చిన కీలక ఉత్తర్వుల ప్రకారం ఏ కేసులోనైనా స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని సుప్రీంకోర్టు 2018 మార్చి 28న కీలక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో కేసులో స్టే ని పొడిగించాలనుకుంటే, స్టే కొనసాగింపునకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది.

దీనితో తమపై ఉన్నస్టే పొడిగించాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ స్టే పొడిగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. 2011లో తాము దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ను విచారించాలని అభ్యర్థించింది. దీనిని విచారించిన ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉన్న కేసును కొట్టివేసింది. దీనిపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్‌ ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి