ప్రపంచంలో ఫుట్ బాల్ తర్వాత అత్యంత ప్రజాధారణ పొందిన ఆట ఏదైనా ఉందంటే.. అది క్రికెట్ అనే చెప్పాలి. దీంతో ఎంతో మంది యువకులు స్టార్ క్రికెటర్ కావాలని కలలు కంటూ క్రికెట్ ను తమ కెరీర్ గా ఎంచుకుంటారు. అయితే కొన్ని దేశాల్లో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకునే వారు తక్కువగా ఉండటంతో.. అక్కడ ఆటగాళ్ల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటోంది నెదర్లాండ్స్ క్రికెట్ టీమ్. ప్రపంచ కప్ సన్నాహక శిబిరంలో నెట్ బౌలింగ్ కోసం భారత ఆటగాళ్లు కావాలంటూ నెదర్లాండ్స్ వినూత్న రీతిలో ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రకటన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరల్డ్ కప్ సన్నాహక శిబిరంలో నెట్ బౌలింగ్ కోసం భారత బౌలర్లు కావాలంటూ వినూత్న రీతిలో ప్రకటన జారీ చేసింది నెదర్లాండ్స్ జట్టు. ఆసక్తి ఉన్న బౌలర్లు కనీసం ఒక ఓవర్ బౌలింగ్ చేసిన వీడియోను తమకు పంపాలని కోరింది. కాగా.. స్థానిక రాష్ట్ర క్రికెట్ సంఘాలు పర్యటక జట్లకు నెట్ బౌలర్లను ఏర్పాటు చేయడం ఆనవాయితీ(నియమం కాదు)గా వస్తోంది. అయితే తమకు ఒక ఎడమచేతి వాటం పేసర్, కుడిచేతి వాటం పేసర్ లతో పాటుగా.. మిస్టరీ స్పిన్నర్, ఎడమచేతి వాటం స్పిన్నర్ కావాలంటూ ఈ ప్రకటనలో తెలిపింది.
ఈ క్రమంలోనే ఈనెల 20 నుంచి 24 వరకు ఆలూరులో డచ్ టీమ్ 5 రోజుల శిక్షణ శిబిరం నిర్వహించనుంది. కాగా.. నెదర్లాండ్స్ లో దేశవాళీ క్రికెట్ ఆడే ప్లేయర్లు తక్కువ కావడంతో నెట్ బౌలర్లను వెంట తెచ్చుకోవట్లేదు. ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం(KSCA) అధికారి మాట్లాడుతూ..”నెదర్లాండ్స్ టీమ్ ఇప్పటికే ఇక్కడ ఒక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి కొన్ని మ్యాచ్ లు సైతం ఆడింది. వారికి అవసరమైన అన్ని వసతులు కల్పించాం. ఇక వారు ఎప్పుడు వచ్చినా ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రౌండ్ తో పాటుగా నెట్ బౌలర్లతో సహా అత్యుత్తం వసతులు వారికి అందజేస్తాం. అదనంగా ఇతర సహాయం తీసుకునే వెసులుబాటు వారికుంది” అంటూ ఆ అధికారి చెప్పుకొచ్చాడు.
ఇక నెదర్లాండ్స్ ఈ ప్రకటన చేయడంపై బీసీసీఐ అధికారు ఒకరు స్పందించారు. వారికి సరైన పరిచయాలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రకటన ఇచ్చారని ఆయన తెలిపారు. కాగా.. ఇతర జట్లు తమ పరిచయాలతో నెట్ బౌలర్లను రప్పించుకుంటాయని బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. మరి డచ్ టీమ్ చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
If you can bowl and want to be a part of the team’s ICC Men’s ODI World Cup 2023 preparations, then head over to the link below and upload your videohttps://t.co/cQYjcW7bQq pic.twitter.com/S4TX8ra7pN
— Cricket🏏Netherlands (@KNCBcricket) September 7, 2023