iDreamPost

సడలింపులు వచ్చాయ్..సరైన జాగ్రత్తలు చాలా అవసరం

సడలింపులు వచ్చాయ్..సరైన జాగ్రత్తలు చాలా అవసరం

నలభై రోజుల లాక్ డౌన్ నుంచి ఉపశమనం దక్కుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ సాదారణ పరిస్థితుల దిశగా అడుగులు పెడుతున్నాయి. అందుకు అనుగుణంగా తొలిదశలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కంటైన్మెంట్ ఏరియాల్లో మినహా మిగిలిన చోట్ల ఆంక్షలు సడలించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 7గంటల వరకూ సాధారణ జీవనానికి అవకాశం కల్పించింది. ప్రభుత్వ కార్యాయాలు అన్నీ తెరుచుకుంటాయని చెబుతోంది. సచివాలయం సహా అన్ని చోట్లా అందుకు అనుగుణంగా భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎటువంటి అనుమతులు లేకుండా పారిశ్రామక సంస్థల కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్యం దుకాణాలు కూడా తెరుచుకుంటున్నాయి. ఆర్టీసీ విషయంలో మాత్రం తుది నిర్ణయం తీసుకోవడంలో వేచిచూస్తోంది. క్యాబ్ లకు కూడా అనుమతి మంజూరు చేసింది.

ఈ పరిణామాలతో ఇప్పుడు రాకపోకలకు ఆటంకం లేకపోవడంతో జనం రోడ్డెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. మాస్కులు తప్పనిసరి చేసింది. మాస్కూలు లేకుండా రోడ్డెక్కితే చర్యలు తప్పవని చెబుతోంది. భౌతికదూరం పాటించాలని సూచిస్తోంది. మద్యం దుకాణాలు సహా అన్ని చోట్లా అందుకు అనుగుణంగా మార్కింగ్ వేసింది. జనం రద్దీ ఎక్కువగా ఉండే మాల్స్, రెస్టారెంట్లు, మత ప్రార్థనలు, విద్యాసంస్థలకు అనుమతి ఇవ్వకుండా జాగ్రత్తలు పాటిస్తోంది. అదే సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సిన జాగ్రత్తలు గురించి చెబుతోంది.

ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. వాస్తవానికి కరోనా లక్షణాలు వెంటనే బయటపడే అవకాశం లేకపోవడంతో వైరస్ ఎక్కడ ఉంది, వ్యాప్తి ఎలా అన్నది నేటికీ అంతుబట్టని విషయం. అందువల్ల ఈ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తలు పాటించడమే తప్ప మరో దారి కనిపించడం లేదు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. అదేసమయంలో ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు, ఇతరులు కూడా రాకపోకలు ప్రారంభమయ్యాయి. అలాంటి వారి విషయంలో క్వారంటైన్ సహాయ అనేక చర్యలు ఉండాలి. చిన్నపాటి ఏమరపాటు కూడా పెను నష్టానికి దారితీస్తుందని ఇప్పటికే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ విషయంలో క్షేత్రస్థాయి యంత్రానికి ప్రజలు సహకరించాల్సి ఉంటుంది.

మహా విపత్తు కారణంగా అన్నీ మూతపడిన తర్వాత మళ్లీ తెరుచుకుంటున్న వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు ఏమేరకు ముందుకు సాగుతాయన్నది ప్రస్తుతానికి అంతుబట్టని అంశం. అయినప్పటికీ ఎవరికి వారు తగిన అప్రమత్తతతో లాక్ డౌన తరహాలోనే అత్యవసరం అయితే తప్ప అడుగు బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇతర ఏర్పాట్లతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి