భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి జట్లలో ఆడే ఆటగాళ్లు పేరు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. బాగా ఆడితే ఈజీగా ప్రేక్షకుల దృష్టిలో పడతారు. కానీ జింబాబ్వే, అఫ్గానిస్థాన్, నేపాల్ లాంటి పసికూన జట్లలో ఆడి గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అయితే అఫ్గాన్ ప్లేయర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ మాత్రం ఇది సాధ్యమేనని నిరూపించారు. వీళ్లిద్దరూ అఫ్గాన్ తరఫున అద్భుతంగా ఆడుతూనే.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20, టీ10 లీగ్స్‌లో ఆడుతున్నారు. డబ్బుకు డబ్బు, పాపులారిటీ సంపాదిస్తూ స్టార్లుగా ఎదిగారు. ఇదే అఫ్గాన్ జట్టులో ఉన్న మరో ప్లేయర్ నవీన్ ఉల్ హక్కు కూడా మంచి గుర్తింపు ఉంది.
ఐపీఎల్లో ఆడటం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించాడు నవీన్ ఉల్ హక్. కానీ తన ఆట ద్వారా కాకుండా వివాదాల ద్వారా ఈ పేస్ బౌలర్ ఫేమస్ అయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ, లక్నోకు మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-నవీన్‌కు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవలో గౌతం గంభీర్ కలుగజేసుకోవడం.. కోహ్లీ-గంభీర్ ఒకరి మీదకు ఒకరు దూసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. మ్యాచ్ తర్వాత కూడా సోషల్ మీడియా పోస్టులతో కోహ్లీని గెలికాడు నవీన్. దీంతో అతడ్ని విరాట్ ఫ్యాన్స్ టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. నవీన్‌ను మ్యాంగో మ్యాన్ అంటూ ట్రోల్ చేయడం తెలిసిందే.
ఐపీఎల్లో విరాట్ కోహ్లీతో గొడవతో బాగా ఫేమస్ అయిన మ్యాంగో మ్యాన్ నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 24 ఏళ్ల వయసులోనే ఈ పేసర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లో ఆడబోనని వెల్లడించాడు. ఇది తన కెరీర్లో చాలా కీలకమైన నిర్ణయమని సోషల్ మీడియాలో చేసిన పోస్టులో నవీన్ రాసుకొచ్చాడు. ఇన్నాళ్లూ అఫ్గాన్‌కు ఆడటం తనకు గర్వకారణమన్నాడు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా తన దేశం కోసం టీ20ల్లో ఆటను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. తనకు సపోర్ట్‌గా ఉన్న అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుకు, అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పటిదాకా 7 వన్డేలు ఆడిన నవీన్.. 5.78 ఎకానమీ రేటుతో 14 వికెట్లు తీశాడు.
ఇదీ చదవండి: మూడో వన్డేలో భారత్ ఓటమికి 5 ప్రధాన కారణాలివే..!