iDreamPost

తొందరపాటేల.. నరేష్ గారూ

తొందరపాటేల.. నరేష్ గారూ

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే, రోడ్డు ప్రమాదం కంటే కూడా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మీద చర్చనీయాంశం అవుతున్నాయి. శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సాయి ధరమ్ తేజ్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలి వెళ్తున్న క్రమంలో కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత కోహినూర్ హోటల్ వద్ద బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురయ్యాడు.. సీసీటీవీ ఫుటేజ్ లో కనబడుతున్న దాని ప్రకారం ఎనిమిది గంటల సమయంలో ప్రమాదం జరగా 9:30 ప్రాంతంలో మీడియాకు సమాచారం అందింది. మీడియాలో వరుసగా స్క్రోలింగ్స్ తో మొదలై అర్ధరాత్రి దాకా లైవ్ ఇచ్చే వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం హాట్ టాపిక్ గా మారింది.

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే ముందుగా ఆయన కుటుంబ సభ్యులు మేనమామలు ఆసుపత్రికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.. అయితే ఆ తరువాతి రోజు సినిమా పెద్దలు ఎవరికివారు సోషల్ మీడియా వేదికగా తేజ్ త్వరగా కోలుకోవాలని కోలుకుని మళ్ళీ తిరిగి రావాలని ఆకాంక్షించారు. అయితే అందరి లాగా సోషల్ మీడియాలో చెబితే ఏముంటుంది అనుకున్నాడో ఏమో తెలియదు గానీ ప్రస్తుత అధ్యక్షుడు సినీ నటుడు నరేష్ మాత్రం ఒక వీడియో విడుదల చేసి నిన్న తేజ మా ఇంటి నుంచే తన కొడుకుతో కలిసి బయటకు వెళ్ళాడు అని, వీళ్ళిద్దరికీ స్పీడు గురించి చాలా సార్లు చెప్పినా వినలేదని మా అమ్మ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా మాట తీసుకుందో తన కొడుకు దగ్గర తేజ దగ్గర కూడా అలాగే మాట తీసుకోవాలి అని చెప్పుకొచ్చాడు. అంతేకాక ఇక ఇలా ఇలా రోడ్డుపై ప్రమాదాలకు గురై చనిపోయిన కోట శ్రీనివాస రావు బాబు మోహన్ కుమారుల విషయాన్ని కూడా ఎత్తడంతో అది కొంత మంది సినీ రంగానికి చెందిన వారికి నచ్చలేదు.

అయితే మామూలుగా అయితే ఇలా నచ్చకపోయిన సందర్భాల్లో ఫోన్లు చేసి చెప్పుకుంటారు, కానీ ఎందుకో ఏమో కానీ బండ్ల గణేష్, శ్రీకాంత్ తదితరులు నరేష్ వీడియో విడుదల చేసిన కాసేపటికి వాళ్లు కూడా సెల్ఫీ వీడియో రికార్డు చేసి విడుదల చేయగా నట్టి కుమార్ లాంటి వాళ్ళు ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ఇలా యాక్సిడెంట్ విషయాన్ని ఎందుకు ఇలా రచ్చకు ఎక్కిస్తున్నారో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళిద్దరూ నరేష్ వ్యాఖ్యలు తనకు నచ్చలేదని కామెంట్ చేశారు. ఇదే విషయాన్ని వాళ్లు నేరుగా నరేష్ కు ఫోన్ చేసి చెప్పి ఉండొచ్చు, కానీ వాళ్లు నరేష్ మాటలను తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా నరేష్ మా ఎన్నికల విషయంలో కూడా మీడియా ముందు ఇలాగే హాట్ టాపిక్ అవుతున్నారు. నిజంగా సాయి కోలుకోవాలని అందరూ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఆయన తొందరపాటుతో చేసిన కామెంట్స్ విషయంలో వెనక్కు తగ్గాల్సింది పోయి మళ్ళీ అదే విధంగా మాట్లాడడం చర్చనీయాంశం అవుతోంది.

ఈ రోజు కూడా కొద్ది సేపటి క్రితం నరేష్ మరో వీడియో విడుదల చేశారు. తాను శ్రీకాంత్ మాట్లాడిన బైట్ చూశాను అని చెబుతూ శ్రీకాంత్ అలా బైట్ విడుదల చేస్తారని తాను ఊహించలేదని, ఆ రోజు తాను అన్న మాటల్లో ఎలాంటి తప్పు లేకపోయినా అది జనానికి వేరే విధంగా చేరుతుందని అన్నారు కాబట్టి దాని మీద తన వివరణ కూడా ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు.. నువ్వు నా ముందు హీరోగా ఎదిగిన వాడివి నువ్వు ఏంటో నాకు తెలుసు అయినా సరే ఇంకోసారి ఇలా బైట్స్ లాంటివి ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ఘాటుగా కామెంట్స్ చేసి దానిని చర్చనీయాంశంగా మారుస్తున్నారు. ఆ మాటలు మాట్లాడడం పొరపాటని అని తప్పుకోవాల్సింది పోయి మళ్ళీ దాన్ని పట్టుకుని లాగుతూ మళ్ళీ మీడియాకు ఎక్కుతున్నారు.

Also Read : కొత్త చర్చకు తెరతీసిన సూపర్ స్టార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి