iDreamPost

సుందరానికి ఇంత అవమానమా?

సుందరానికి ఇంత అవమానమా?

న్యాచురల్ స్టార్ నానికి ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. అతని సినిమాలు కమర్షియల్ బాక్సాఫీస్ లెక్కల్లో ఫెయిలవ్వొచ్చేమో కానీ టీవీలో వచ్చినప్పుడు మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంటాయి. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా జరగడం అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. ఇటీవలే అంటే సుందరానికి జెమినీ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేశారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కుటుంబాలను టార్గెట్ చేసిన ఎంటర్ టైనర్ కావడంతో టిఆర్పి రేటింగ్ గురించి సదరు ఛానల్ తో పాటు ఫ్యాన్స్ సైతం మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానికేమాత్రం ఊహించని స్థాయిలో ట్విస్ట్ వచ్చింది.

కేవలం 1.88 రేటింగ్ తో అంటే సుందరానికి టీవీలోనూ డిజాస్టర్ అయ్యింది. మళ్ళీ వేసినప్పుడు ఏమైనా పెరగొచ్చేమో కానీ మొదటిసారి ప్రసారాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే సుందరానికి ఇది పెద్ద అవమానమే. బొమ్మ మరీ దారుణంగా ఉండటం దీనికి కారణం కాదు. నెట్ ఫ్లిక్ల్స్ ఓటిటిలో ఎప్పుడో వచ్చేసింది. యాప్ లో, ఆన్ లైన్ పైరసీలో ఇప్పటికే కోట్లలో చూసేసి ఉంటారు. ఇవి చాలవన్నట్టు లోకల్ కేబుల్ ఛానల్స్ అనఫీషియల్ గా వేసేసిన సందర్భాలున్నాయి. ఇలా జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు డిజిటల్ కు శాటిలైట్ కు తక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అలా చేయకపోవడంతో అసలుకే మోసం వచ్చింది.

ఇదంతా ఓటిటిలు పెడుతున్న నిబంధనల వల్లేనని టీవీ వర్గాల మాట. అగ్రిమెంట్ చేసుకునే టైంలోనే ఉపగ్రహంలో ఎప్పుడు రావాలనేది ముందుగానే కండీషన్ పెడుతున్నారని, భారీ మొత్తం వస్తుందనే ఉద్దేశంతో నిర్మాతలు ఒప్పుకోవడం వల్ల ఇప్పుడు వాటిని ఎవరూ టీవీలో అది కూడా యాడ్స్ ని భరిస్తూ చూసేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. ఎందుకంటే బుల్లితెర సినిమాలకు హిట్టు ఫ్లాపు తేడా ఉండదు. ఒకప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ కు 14 రేటింగ్ రావడం ఇప్పటికీ రికార్డే. కానీ ఆ టైంలో ఓటిటి విప్లవం లేదు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్లు సైతం 20 రేటింగ్ ని టచ్ చేయలేకపోయాయి. ఇదంతా శాటిలైట్ భవిష్యత్తుని సూచించే చిత్రమే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి