iDreamPost

చనిపోయేంత కష్టం ఏమొచ్చింది తల్లి నీకు.. ఎందుకు ఇలా చేశావ్

  • Published Apr 13, 2024 | 11:01 AMUpdated Apr 13, 2024 | 11:01 AM

కళ్లల్లో పెట్టి.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ.. అర్థాంతరంగా.. అది కూడా బలవంతంగా తనువు చాలించింది. కన్నబిడ్డ చేసిన పనికి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ వివరాలు..

కళ్లల్లో పెట్టి.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ.. అర్థాంతరంగా.. అది కూడా బలవంతంగా తనువు చాలించింది. కన్నబిడ్డ చేసిన పనికి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Apr 13, 2024 | 11:01 AMUpdated Apr 13, 2024 | 11:01 AM
చనిపోయేంత కష్టం ఏమొచ్చింది తల్లి నీకు.. ఎందుకు ఇలా చేశావ్

ఆత్మహత్య మహాపాపం అంటారు. మనిషి జీవితం చాలా గొప్పది.. ఎన్నో పుణ్యాలు చేస్తే తప్ప మానవ జన్మ లభించదని పెద్దలు చెబుతారు. అలాంటి జీవితాన్ని మన చేతులారా మనమే నాశనం చేసుకోవడం మంచిది కాదని అంటారు. అయితే నేటి సమాజంలో చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. నిన్న మంచిర్యాల జిల్లాలో డిగ్రీ చదువుతోన్న ఓ యువతి తను అడగ్గానే తల్లిదండ్రులు మొబైల్ రిపేర్ చేయించలేదనే కారణంతో ఆత్మహత్య చేసుకుంది. ఇక తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. పదహారేళ్ల యువతి ఒకరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. ఇంటర్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకుంది. కారణం పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం. నిన్న అనగా శుక్రవారం నాడు ఏపీ ఇంటర్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నంద్యాల పట్టణానికి చెందని వేమూరి రజిత(16) అనే విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నంద్యాల పట్టణంలోని కాళికాంబ దేవాలయం వీధిలో నివసిస్తున్న శ్రీనివాసులు, కుమారి దంపతులకు ఇద్దరు సంతానం.. కుమార్తె రజిత, కుమారుడు మేఘనాథ్‌ ఉన్నారు. శ్రీనివాసులు స్థానిక బైర్‌మల్‌ వీధిలో స్టీల్‌ సామన్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు రజిత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ సెకండియర్ ఎంపీసీ చదువుతోంది. ఇలా ఉండగా శుక్రవారం నాడు ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి.

దాంతో నెట్ సెంటర్ కి వెళ్లి రిజల్ట్ చూసుకుంటానని ఇంటి నుంచి బయటకు వచ్చింది రజిత. అయితే ఫలితాల్లో ఆమె ఫెయిల్ అయినట్లు తెలిసింది. దాంతో దిగాలుగా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో రజిత తల్లి కుమారి బయటకు వెళ్లింది. ఇంట్లో ఎవరు లేరు. తల్లిదండ్రలు వస్తే తాను ఫెయిల్ అయ్యాననే విషయం తెలుస్తుందని భావించిన రజిత.. ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

బయటకు వెళ్లిన రజిత తల్లి కొంత సేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. ఎదురుగా ఫ్యాన్ కు కుమార్తె శవం వేలాడుతూ కనిపించింది. దాంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని రజితను కిందకు దింపారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రజిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి