iDreamPost

రంగంలోకి ఎన్.జి.టి.. ప్రతిపక్షాలకు ఓపిక అవసరం..

రంగంలోకి ఎన్.జి.టి.. ప్రతిపక్షాలకు ఓపిక అవసరం..

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ లో విషవాయు లీకైన ఘటన పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్. జీ. టి) రంగంలోకి దిగింది. ఈ సంఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద 50 కోట్ల రూపాయలను విశాఖ జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని ఆదేశించింది. ప్రమాదంపై పూర్తి నివేదికను తెప్పించుకున్న తర్వాత తదుపరి విచారణ చేపట్టనుంది.

కాగా, ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని విచారణ కోసం నియమించింది. పలువురు ఐఏఎస్ అధికారుతో ఉన్న ఈ కమిటీ 30 రోజుల్లో నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు నిర్దేశించింది. మరోవైపు పోలీసులు పలు సెక్షన్ల కింద కంపెనీ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై సీరియస్ గా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గ్యాస్ లీక్ అయిన సమయంలో సైరన్ ఎందుకు మోగలేదు అన్న విషయం కూడా నిన్న సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారు. సాంకేతిక సమస్యతో పాటు మానవ తప్పిదం కూడా ఉన్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏదిఏమైనా 30 రోజుల్లోపు ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం ఇలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ప్రతిపక్షాలు ఈ ఘటనపై అనవసర రాద్ధాంతం చేస్తున్నట్లు కనపడుతోంది. బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ప్రతిపక్షాల ఊహలకు అందని విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో వారి నోళ్లకు తాళాలు పడ్డాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పక్షాలు తమ స్టాండ్ మార్చి కంపెనీపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే మాట్లాడడం విడ్డూరంగా ఉంది. కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని పరిస్థితుల్లో విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది. అప్పటి వరకూ ప్రతిపక్ష నేతలు కొంత ఓపిక పట్టడం రాజకీయాల్లో అవసరమన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేదంటే.. నిన్న పరిహారం డిమాండ్ చేసినట్లుగా వారి పరిస్థితి తయారవుతుందనడంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి