iDreamPost

వివాదాలు ఎందుకు తమన్?

వివాదాలు ఎందుకు తమన్?

దారినపోయే దుమ్ముని తలకు రాసుకుంటే మట్టి అంటేది మనకే. సామాన్యులకు పెద్ద ఇబ్బందేమీ లేదు కానీ సెలబ్రిటీలు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాంట్రావర్సీలకు బలి కావాల్సి ఉంటుంది. తమన్ అదే ట్రాప్ లో పడ్డాడు. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో జై బాలయ్య నినాదం తెలుగు రాష్ట్రాల్లో గోవిందా గోవిందా నామస్మరణ అంత పాపులర్ అని అందుకే రెండుసార్లు ఆ పదం మీద ట్యూన్ కట్టానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి పవర్ ఫుల్ క్యాప్షన్ కాబట్టి ఒసేయ్ రాములమ్మా ట్యూన్ లాగే అనిపించినా అంతకన్నా గొప్పగా చేయలేమని అన్నాడు. అంతేకాదు ఈ పోలిక గురించి తమకు ముందే తెలుసని సెలవిచ్చాడు

అంతాబాగానే ఉంది కానీ జైబాలయ్యని ఏకంగా గోవిందాతో పోల్చడం టూ మచ్. పవిత్రమైన దేవుడి పదాన్ని, కోట్లాది మంది నిత్యం ఆరాధించే మంత్రాన్ని ఇలా సినిమా హీరోల స్లోగన్ కు సమానంగా చెప్పడం ఏమిటని జనాలు మండిపడుతున్నారు. ఏ హీరోకు సంగీతం సమకూరిస్తే వాళ్లకు తాను వీరాభిమానినని చెప్పుకునే తమన్ ఇప్పుడు వీరసింహారెడ్డికి వచ్చేటప్పటికి ఇలా భజన ప్రోగ్రాం ఎత్తుకున్నాడు. ఉద్దేశం ఏదైనా ఇది ముమ్మాటికీ తప్పే. ఆ మాటకొస్తే జైబాలయ్య అనేది కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియా జనాలు ట్రోలింగ్ కోసం వాడుకున్నది. క్రమంగా ఫ్యాన్స్ వల్ల అది ఇలా రూపం మార్చుకుంది. అంతేతప్ప అదేమీ వరల్డ్ ఫేమౌస్ బిరుదు కాదు

చక్కని ఫామ్ లో ఉన్న టైంలో తమన్ లాంటి వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ప్రమోషన్లలో భాగమవ్వడం మంచిదే కానీ ఇలా హీరోనో ఫ్యాన్స్ నో ప్రసన్నం చేసుకోవడం కోసం ఏదో ఒకటి అనేస్తే ఇబ్బందులు తప్పవు. మనోభావాల బ్యాచ్ ఈ విషయాన్నీ లైట్ తీసుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. అసలే తమన్ చేతిలో చాలా క్రేజీ మూవీస్ ఉన్నాయి. రామ్ చరణ్ 15, మహేష్ బాబు 28, ఎన్బికె 108 ఇలా స్ట్రాంగ్ లైనప్ ఉంది. వాటి మీద దృష్టి పెడితే మంచిది కానీ ముందు వెనుక చూసుకోకుండా హీరో వర్షిప్ కోసం స్టేట్ మెంట్లు ఇస్తేనే చిక్కులు తప్పవు. దీని గురించి తమన్ స్పందించకుండా ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నాడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి