iDreamPost

ముంబై పోలీసులకు బెదిరింపులు.. సీమాని పంపకపోతే 26/11 తరహా దాడి చేస్తామంటూ..!

ముంబై పోలీసులకు బెదిరింపులు.. సీమాని పంపకపోతే 26/11 తరహా దాడి చేస్తామంటూ..!

ప్రేమకు కులం, మతం, గోత్రం, రంగు, ప్రాంతం అంటూ ఎలాంటి బేధాలు ఉండవు అంటారు. ఆ విషయాలను నిజం చేస్తూ ఇప్పటికే ఎన్నో ప్రేమ వివాహాలను చూశాం. దేశాలు, ఖండాలు అనే ఎల్లలు ఉండవని చాలా సందర్భాల్లో రుజువు కూడా అయింది. తాజాగా అలాంటి ఘటన ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. పబ్ జీ గేమ్ లో పరిచయం అయిన ప్రియుడి కోసం సీమా హదర్ పాకిస్తాన్ నుంచి నలుగురు పిల్లలతో అక్రమంగా ఇండియా వచ్చింది. తర్వాత ప్రియుడిని పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఈ పెళ్లి వల్ల రెండు దేశాల మధ్య లేనిపోని ఇబ్బందులు వచ్చేలా కనిపిస్తున్నాయి.

సీమా హైదర్- సచిన్ వివాహం ఇటు భారత్ లోనే కాకుండా.. అటు పాకిస్తాన్ లో కూడా ప్రకంపనలు సృష్టించింది. పబ్ జీ గేమ్ లో పరిచయం అయిన ప్రియుడి కోసం అక్రమంగా ఇండియాలో ప్రవేశించింది. వీరిని పోలీసులు అరెస్టు చేయగా.. బెయిల్ పై బయటకు వచ్చి నేపాల్ లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆమె తాను పాకిస్తానీ కాదని.. తన భర్త భారతీయుడు కాబట్టి తాను కూడా భారతీయురాలినని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గంగానదిలో స్నానం చేసి తాను హిందూ మతం స్వీకరించినట్లు తెలిపింది. తాను పాకిస్తాన్ వెళ్లనని అలా వెళ్తే తనని ప్రాణాలతో బతకనివ్వరని తెలిపింది. వీడియో సందేశం ద్వారా తన భార్యను వెనక్కి పంపాలని ఆమె భర్త భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేసుకున్నాడు. వీరి వివాహం నేపథ్యంలో ఇప్పటికే హిందువులకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. సీమాని పంపకపోతే సింధ్ లో ఉన్న హిందువులు, హిందూ ఆలయాలపై బాంబులు వేస్తామంటూ పాక్ బందిపోట్లు బెదిరించారు.

తాజాగా ముంబై పోలీసులకు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. సీమా హైదర్ ని తిరిగి పాకిస్తాన్ పంపకపోతే 26/11 తరహా ఉగ్రదాడి తప్పదని హెచ్చరిచారు. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు ఒక కాల్ వచ్చింది. కాలర్ ఉర్దూలో ఇలా మాట్లాడుతున్నాడు.. “సీమా హైదర్ తిరిగి రాకపోతే భారతదేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 26/11 ముంబయి ఉగ్రదాడి తరహా ఘటనలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ దాడికి బాధ్యత వహించాల్సి ఉంటుంది” అంటూ బెదిరించాడు.

సాధారణంగా ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్ కి అలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి. కానీ, పోలీసులు మాత్రం ఆ కాల్ ని తేలిగ్గా తీసుకోలేదు. ఇందుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగానే పాకిస్తాన్ నుంచి వచ్చిందా? అలాంటి ప్రమాదం ఏమైన జరగబోతుందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందని.. వాళ్లు వివాహం చేసుకుంటే ప్రజలకు ఈ బెదిరింపులు ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. వీళ్ల వివాహాన్ని అంత తేలిగ్గా తీసుకోకుండా ప్రభుత్వం, అధికారులు ఏదొక నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి