iDreamPost

గోవిందుడికి పన్నుపోటు తప్పించండి

గోవిందుడికి పన్నుపోటు తప్పించండి

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జీఎస్టీ పరిధిలోకి తప్పించాలి అన్న అంశం న్యాయమైనది. పూర్తి ధార్మిక సంస్థ గా పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటికే పలు పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చి పూర్తిగా హిందూ ధార్మిక సంస్థ గా గుర్తించిన ప్రభుత్వం జీఎస్టీ విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. దీనిపై గతంలోనే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా, గత పాలకమండళ్లు గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది.

బుధవారం లోక్ సభలో వైసీపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరడం తో మళ్లీ ఈ విషయం చర్చకు వచ్చింది. దీనివల్ల ఆలయానికి ఫండ్ మిగలడం తో పాటు ఆ సొమ్మును హిందూ ధార్మిక ప్రచారానికి ఉపయోగించడానికి వీలు ఉంటుందన్నది ప్రభుత్వ భావన. పలుమార్లు కేంద్ర ప్రభుత్వ అధికారులకు జీఎస్టీ కౌన్సిల్ కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తోపాటు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సైతం పలు వినతులు ఇచ్చి, సానుకూలంగా స్పందించాలని కోరారు. టీటీడీ అనేది ఒక ప్రత్యేకమైన విభాగం గా గుర్తించి మినహాయింపును ఇవ్వవచ్చు అన్నది అధికారుల వాదన. ఈ అంశాన్ని జిఎస్టి కౌన్సిల్కు ప్రత్యక్షంగా ఢిల్లీ వెళ్లి మరీ తెలిపారు. అయితే అక్కడ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పాటు సానుకూల సంకేతాలు కేంద్ర పెద్దల నుంచి రాలేదు. దీంతో ఈ అంశాన్ని విజయసాయిరెడ్డి పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తారు.

Also Read : అంబేద్కర్ ను భారత నోటు మీద ఎక్కిద్దాం.. లోక్ సభలో వైసీపీ ఎంపీ ప్రతిపాదన..

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల అన్నప్రసాదాలు, స్వామివారి ప్రసాదం, కైంకర్యాలు, ఇతర సేవలతో పాటు వసతి గృహాల్లో నూ భారీగా కొనుగోలు చేస్తున్న ముడి సరుకుల మీద జిఎస్టి భారీగా పడుతోంది. సుమారు 900 కోట్ల మేర ముడిసరుకులు ప్రత్యేక అవసరం అవుతున్నాయి. దీనికి సంబంధించి జిఎస్టి దాదాపు 180 కోట్ల వరకు పడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఈ మినహాయింపు ఇస్తే సుమారు 180 కోట్ల రూపాయల వరకు టిటిడి ఆదాయం మిగులుతుందని అంచనా. దీనిని హిందూ ధార్మిక ప్రచారానికి ఉపయోగించుకోవచ్చని, ఈp ప్రతిపాదన అయినా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని జిఎస్టి సొమ్మును పూర్తిగా ధర్మ ప్రచారానికి ఉపయోగించాలనే కోణంలో మినహాయింపు ఇవ్వాలని టిటిడి అధికారులు కోరుతున్నారు.

అయితే జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ మినహాయింపు ఇస్తే మిగిలిన ఆలయాలు కూడా ఇదే రీతిన కచ్చితంగా జీఎస్టీ మినహాయింపు కోరే అవకాశం ఉంటుందని, చిన్న చిన్న ఆలయాలకు కూడా కేంద్రం నుంచి జిఎస్టి మినహాయింపులు ఇవ్వడం ద్వారా అనేక అవకతవకలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక ఆలయానికి మినహాయింపు ఇచ్చి మరో ఆలయానికి ఇవ్వకపోతే కొత్త కొత్త సమస్యలు వస్తాయి అనేది కేంద్ర పెద్దల భావన.

అయితే తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంతో పాటు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే ఆలయం గా గుర్తింపు పొందడంతో దీనిని ప్రత్యేకంగా చూడాలి అన్నది టిటిడి అధికారుల వాదన. దీనినే పదేపదే తిరుమలకు వస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు నాయకులకు టీటీడీ పెద్దలు విన్నవిస్తూ వస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి చట్టసభల సాక్షిగా ఈ అంశాన్ని లేవనెత్తడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుంది అన్నది చూడాలి.

Also Read : ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ ఎప్పుడు ..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి