iDreamPost

మనసులు దోచిన మౌనరాగం – Nostalgia

మనసులు దోచిన మౌనరాగం – Nostalgia

అమ్మాయి అబ్బాయి అనే భేదం లేకుండా ఎవరి జీవితంలోనైనా గతమంటూ ఒకటుంటుంది. అది ప్రేమకు సంబంధించినది కావొచ్చు లేదా స్నేహంలోని ఏదైనా ఘట్టం కావొచ్చు. మంచిదైతే పర్వాలేదు. అలా కాకుండా అది చేదు జ్ఞాపకమైతే ఎలా ఉంటుంది. వేరొకరితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాక వాటి తాలూకు నీడలు మనతో పాటు నడిపించాలా వద్దా అనేదే మన మానసిక స్థితిని శాశిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధంలో ఇది గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. ప్రేమించిన వాళ్ళు మనకు దూరమైనప్పుడు మనల్ని ప్రేమించేవారు దొరక్కపోరు. అది గుర్తించాలనే గొప్ప సందేశంతో మణిరత్నం తీసిన దృశ్య కావ్యం మౌనరాగం.

1986 సంవత్సరం. దీనికి మూడేళ్ళ క్రితం తన మొదటి సినిమా పల్లవి అనుపల్లవి షూటింగ్ జరుగుతున్న సమయంలో మణిరత్నం దివ్య పేరుతో ఓ చిన్న కథ రాసుకున్నారు. ఈలోగా డెబ్యూ మూవీ ఏవో కారణాలతో ఆలస్యం అవుతుండటంతో దివ్య స్టోరీని సినిమాకు అనుగుణంగా మార్చుకుని దానికి మౌనరాగం అని పేరు మార్చారు. అయితే నాలుగు సినిమాలు రిలీజయ్యేదాకా ఇది ఏ నిర్మాతకు నచ్చలేదు. అందుకే ఇష్టపడి రాసుకున్నా తెరకెక్కించడానికి టైం పట్టింది. కార్తీక్, మోహన్ హీరోలుగా రేవతిని ప్రధాన పాత్రలో తీసుకుని ఇళయరాజా సంగీతంలో మౌనరాగంతో ఓ కొత్త అనుభూతినివ్వాలని నిర్ణయించుకున్నారు మణిరత్నం.

ఇష్టం లేని పెళ్లి చేసుకున్న దివ్య(రేవతి)కు మొదటి రోజు నుంచే తన గతం తాలూకు ఛాయలు వెంటాడుతూ ఉంటాయి. ఎంతో ప్రేమించి ఓ ప్రమాదంలో చనిపోయిన మనోహర్(కార్తీక్)జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. కానీ భర్త చంద్రం(మోహన్) దివ్యను మార్చేందుకు విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత దివ్యలో వచ్చిన అసలు మార్పే సినిమాలో చూడాలి. మద్రాసు, ఢిల్లీ, అగ్రలో షూటింగ్ జరిపారు. ఇంత సున్నితమైన కథతో మణిరత్నం సిల్వర్ జూబ్లీ సినిమా ఇవ్వడం చూసి అందరూ షాక్ తిన్నారు. 1986 ఆగస్ట్ 15న తమిళంలో రిలీజ్ కాగా తెలుగులో కొంత ఆలస్యంగా 1987 ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న విడుదలయ్యింది. ఇళయరాజా పాటలు మారుమ్రోగిపోయాయి. మణిరత్నం ఎన్ని సినిమాలు తీసినా మొదటి బ్రేక్ ఇచ్చిన మౌనరాగం అభిమానులకు ఎప్పటికీ ఫేవరెట్ అనే చెప్పాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి