iDreamPost

ఏ ప్ర‌ధాని..ఎన్ని ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రారంభించారు..? ఎన్ని మూసేశారు..?

ఏ ప్ర‌ధాని..ఎన్ని ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రారంభించారు..? ఎన్ని మూసేశారు..?

ఇటివ‌లి కేంద్ర ప్రభుత్వం రూ.20 ల‌క్షల కోట్ల ప్యాకేజీ ప్ర‌క‌టించింది. దాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఐదు రోజుల పాటు మీడియా స‌మావేశం పెట్టి వివ‌రించారు. అందులో ప్ర‌భుత్వ సంస్థ‌ల అమ్మ‌కాన్ని తెర‌పైకి తెచ్చారు. అయితే ప్ర‌భుత్వ సంస్థ‌ల అమ్మ‌కంపై చ‌ర్చ ఇది తొలిసారి కాదు.. మోడీ స‌ర్కార్ అధికారాన్ని చేప‌ట్టిన‌ప్ప‌టి నుండి ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ‌, అమ్మ‌కంపై చ‌ర్చ జ‌రిగింది. ఇప్ప‌టికే నీతి ఆయోగ్ సూచ‌న మేర‌కు మోడీ స‌ర్కార్ కొన్ని సంస్థ‌ల అమ్మ‌కంపై లిస్టు త‌యారు చేశారు.

మోడీ సర్కార్‌ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు పప్పు బెల్లాలా? అన్న అనుమానం కలుగుతున్నది. ఆ స్థాయిలో వాటిల్లో వాటాల అమ్మకం జరుగుతున్నది. దేశ సంపదలైన కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇష్టారీతిన ప్రయివేటీకరణ చేసేందుకు మోడీ సర్కార్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల(పిఎస్‌యు)ను హోల్‌సేల్‌గా అమ్మేందుకు చర్యలు మరింత వేగవంతం చేశారు. గత ప్రభుత్వాలు కొత్త సంస్థలను ప్రారంభిస్తే, ప్రస్తుత మోడీ మాత్రం ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలను అమ్మివేసేందుకు…లేదా మూసివేసేందుకు పూనుకుంటున్నది. పైగా అచ్చేదిన్‌ ఆయేగా అని చెబుతుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇలా పిఎస్‌యులను ప్రైవేట్‌ శక్తులకు అమ్మితే అచ్చేదిన్‌ పెట్టుబడిదారులకా? లేక దేశానికా? అనే అంశం వ్యక్తమవుతుందని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డారు.

దేశంలో 10 మహారత్నాలు, 14 నవరత్నాలు, 74 మినీరత్నా సంస్థలతో సహా 300 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. 1951లో కేవలం ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే, 1991 నాటికి వాటిని 246 సంస్థలకు పెరిగాయి. వీటిని ప్రైవేట్‌, కార్పొరేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు మోడీ సర్కార్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అందుకు అనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. 2016లో నీతి ఆయోగ్‌ 74 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను అమ్మేయాలని ప్రతిపాదించింది. నీతి ఆయోగ్‌ ప్రతిపాదనకు అనుగుణంగా ఆయా సంస్థల్లో 100 శాతం పెట్టుబడులు అమ్మేసేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రి వర్గం (సిసిఈఎ) ఆరు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. హెచ్‌పిఎల్‌, హెచ్ఎస్‌సిసిఎల్‌, ఎన్‌పిసిసి, ఈపిఐఎల్‌, బిఆర్ఐఎల్‌, పిహెచ్ఎల్‌, పిహెచ్ఎల్‌, హెచ్‌ఎన్‌ఎల్‌, హెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

పిఎస్‌యుల అమ్మకం బిజెపితోనే ప్రారంభం

దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ 33 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రారంభించారు. ఆయన హయాంలో ఒక్క పిఎస్‌యు కూడా మూసివేయలేదు. తరువాత లాల్‌బహదూర్‌ శాస్త్రి తన ఒక ఏడాది, 216 రోజుల పాలనలో 5 సంస్థలు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ హయాంలోనూ 66 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రారంభించారు. మొరార్జీ దేశ‌య్‌ కాలంలో 9 సంస్థలు ఏర్పడ్డాయి. రాజీవ్‌ గాంధీ హయాంలో 16 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రారంభించారు. విపి సింగ్‌ పాలనలో రెండు పివి నరసింహారావు పాలనలో 14 సంస్థలను ప్రారంభించారు. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనలో మూడు సంస్థలు ఏర్పడ్డాయి. అటల్‌ బీహారీ వాజ్‌పేయి కాలంలోనూ 17 సంస్థలను ప్రారంభించారు. అయితే, ఆయన పాలనలో ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు పరం అయ్యాయి. మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 23 సంస్థలను ప్రారంభించగా, మూడు సంస్థలను అమ్మేశారు. ప్రస్తుత ప్రధాని మోడీ గత ఆరేండ్లగా ఒక్క సంస్థను ప్రారంభించకపోగా, 23 సంస్థలను మూసివేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం వల్ల ఉద్యోగాలను సృష్టించలేని పరిస్థితి ఉంటుంది. వాటిని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందని మేధావులు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే దేశంలో ప్రయివేటీకరణ కూడా పెరిగిందని ఆర్థికవేత్తలు తెలిపారు. అలాగే ప్రధాని మోడీ పాలన కాలంలో అదానీ, వేదాంత, టాటా పవర్‌, అనీల్‌ అంబానీ వంటి కార్పొరేట్లు భారీ స్థాయిలో లాభం పొందుతున్న తీరు దేశమంతా గమనిస్తున్న విషయం తెలిసిందే.

పార్లమెంట్‌ అనుమతి లేకుండా చర్యలు

సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో వాటాల ఉపసంహరణ చేసేప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ చర్యల ద్వారా ముందుకు వెళుతుంది. పార్ల‌మెంట్ లో సుధీర్ఘంగా చ‌ర్చించి ఆమోదిస్తారు. గ‌త‌ ప్రభుత్వాలు సైతం ఇదే విధమైన వైఖరిని అవలంభించాయి. కానీ ప్రస్తుతం మోడీ సర్కారు మాత్రం కరోనా వైరస్‌తో విధించిన లాక్‌డౌన్‌ని సాకుగా చూపించి ప్రెస్‌మీట్‌ల ద్వారానే ప్రభుత్వ సంస్థలకి మంగళం పాడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం క‌నీసం పార్ల‌మెంట్ నిర్ణయాన్ని కూడా తెలుసుకోకుండా ముందుకు వెళ్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి