iDreamPost

ధర్మాన దూకుడు

ధర్మాన దూకుడు

ప్రజల చేతిలో ఓడిపోయిన వారు గ్యాలరీ నుండి సభలను నడిపించడం ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. ఈరోజు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానంపై జరుగుతున్న చర్చ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చిన ప్రభుత్వాలు తీసుకొన్న నిర్ణయాలను అప్రజాస్వామికంగా దొడ్డిదారిన అడ్డుకునే ప్రయత్నాలు చెయ్యడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు. 151 మంది శాసనసభ్యులను గెలిపించడం ద్వారా 52 శాతం ఓటింగ్ తో చాలా అరుదైన తీర్పుని ప్రజలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ఇచ్చి అధికారం కట్టబెడితే, తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం శాసన మండలిని అడ్డం పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమయిన నిర్ణయాలని అడ్డుకోవడాన్నిచూస్తూ ఉరుకోకూడదని ధర్మాన అభిప్రాయపడ్డారు.

Read Also: మండ‌లికి మంగ‌ళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం

గతంలో శాసన మండలి ఏర్పాటుని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారని, ఎన్నికల్లో గెలవలేని వారికి శాసన మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, ఈ శాసనమండలి వ్యవస్థ వల్ల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవ్వడం తప్ప ఉపయోగం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి ధర్మాన అసెంబ్లీలో గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక సమాజంలో వెనుకబడిన వర్గాలైన యస్సి యస్టి ల కోసం, ఈబీసీల కోసం ఉద్దేశించిన యస్సి ఎస్టీ కార్పొరేషన్ బిల్లు ని, ఇంగ్లిష్ మీడియం బిల్లుని శాసనమండలి ద్వారా అడ్డుకొనే ప్రయత్నం చేశారని, ఆఖరికి ఈ సీఆర్డీఏ, రాజధాని వికేంధ్రీకరణ బిల్లుల్ని కూడా అప్రజాస్వామికంగా రూల్స్ ని, మండలి ప్రొసిజర్స్ ని తుంగలోకి తొక్కి సెలెక్ట్ కమిటీకి అప్పగించారని ధర్మాన విమర్శించారు.

Read Also: మండలి రద్దు – నాడు ఎన్టీఆర్ సమర్థన

ఈ సందర్భంగా గతంలో ఎగువసభని రాజ్యాంగ నిర్మాత అంబెద్కర్, గోపాల కృష్ణ అయ్యంగార్, హెచ్.వి కామత్ వంటి జాతీయ నేతలు కూడా వ్యతిరేకించారని, మన రాష్ట్రానికే చెందిన దివంగత నేత ఆచార్య రంగా కూడా శాసనమండలిని వ్యతిరేకించారని ధర్మాన సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 28 రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని, ఈ శాసన మండలి అనవసరం అని మిగతా రాష్ట్రాలన్నీ బావిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పుతో ఓడిపోయిన వ్యక్తులు తిరిగి శాసనమండలిలో వచ్చి కూర్చొని ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని, ప్రజలిచ్చిన తీర్పునే అపహాస్యం పాలు చేస్తున్నాయని ధర్మాన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ మీడియాలో కొంతమంది వ్యక్తులను కూర్చోబెట్టి ప్రజలని అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తుందని, అయితే శాసన మండలి ని రద్దు చెయ్యడం పూర్తిగా రాజ్యాంగబద్దమేనని పేర్కొన్నారు.

Read Also: సజ్జల చెప్పిన 17 మంది ఎమ్మెల్యేలు.. టీడీపీలో మిగిలే ఆ నలుగురు ఎవరు..?

చంద్రబాబు ప్రభుత్వంలో 128 పేజీలు, 130 సెక్షన్లు, 12 షెడ్యూళ్ల తో ఉన్న సీఆర్డీఏ చట్టాన్ని శాసనమండలికి పంపించి, దానిపై సభలో కనీసం చర్చించకుండానే మండలిలో ఆమోదించి, ఒక్క రోజులోనే అసెంబ్లీకి పంపారని, అలాంటి సమయంలో కేవలం 12 పేజీలు 4 షెడ్యూళ్ల తో కూడిన బిల్లుని సెలక్ట్ కమిటీకి పంపించడం హాస్యాస్పదంగా ఉందని, అందుకే ఇలాంటి అప్రజాస్వామిక విధానాల్ని అడ్డుకోవాలంటే శాసనమందలి ని రద్దు చేయాల్సిందేనని, అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్నితానూ సమర్ధిస్తున్నానని ధర్మాన తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి