iDreamPost

కొత్త రేషన్‌ కార్డుల మంజూరుపై మంత్రి కొడాలి నాని ప్రకటన

కొత్త రేషన్‌ కార్డుల మంజూరుపై మంత్రి కొడాలి నాని ప్రకటన

ఏడాది కాలంగా కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరదించేలా రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి కొడాలి నాని కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్‌కార్డులు జారీ విధానానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోద ముద్రవేశారని మంత్రి కొడాలి తెలిపారు. అర్హులైన వారు తమ పరిధిలోని గ్రామ,వార్డు సచివాలయాల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా.. ఐదు రోజుల్లో కార్డు మంజూరవుతుందని తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో అర్హత ఉన్న వారు, కొత్తగా వివాహం అయిన వారు నూతన కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త కార్డు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో వైఎస్సార్‌ నవ శకం సర్వే ద్వారా వాలంటీర్లు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరిలో కొత్త కార్డులు మంజూరవుతాయని భావించారు.

ఇటీవల కరోనా వైరస్‌ నేపథ్యంలో వారం రోజుల్లో కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వేలిముద్రలు వేయడం వల్ల సమస్య వచ్చే అవకాశం ఉండడంతో ఆ పని మళ్లీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం మరో తేదీని నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్ ఇప్పటీకే తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి కొడాలి తాజాగా ధ్రువీకరించారు. దరఖాస్తులను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి