iDreamPost

మాయ చేసిన మాయలోడు – Nostalgia

మాయ చేసిన మాయలోడు – Nostalgia

కామెడీ సినిమాలతో దర్శకులుగా తమకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుల్లో జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పేరు ఎస్ వి కృష్ణారెడ్డి. స్నేహితుడు అచ్చిరెడ్డితో కలిసి పలు వ్యాపారాలు చేశాక ఇండస్ట్రీకి నిర్మాతగా వచ్చిన ఈయన డైరెక్టర్ గా మొదటి చిత్రం రాజేంద్రుడు గజేంద్రుడుతోనే తనదైన ముద్ర వేశారు. సంగీతం సైతం తానే సమకూర్చి అద్భుత విజయాన్ని సాధించిన వైనం ఎవరూ మర్చిపోలేరు. అది నిర్మాణంలో ఉండగానే ఎస్వి కృష్ణారెడ్డి మనసులో పుట్టిన ఆలోచన మాయలోడు. దీని స్క్రిప్ట్ ని రచయిత దివాకర్ బాబు కేవలం పది రోజుల్లో పూర్తి చేశారంటే ఆశ్చర్యం కలగక మానదు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ మొదలుపెట్టినప్పుడు విడుదల తేదీని ప్రకటించేయడం అప్పట్లో ఒక సంచలనం. కేవలం నెలన్నర రోజుల్లోనే మొత్తం పూర్తి చేయడం రికార్డు. హీరోయిన్ గా ముందు సౌందర్యను అనుకోలేదు. వేరే అమ్మాయిని సెలెక్ట్ చేశారు. కానీ రషెస్ సంతృప్తికరంగా రాకపోవడంతో ఆ ఛాన్స్ సహజనటికి దక్కింది. గారడీలు చేసి పొట్టపోసుకునే ఓ మాయలోడి జీవితంలోకి మాటలు రాని ఓ చిన్న పాప వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే మాయలోడికి శ్రీకారం చుట్టింది. పసివాడి ప్రాణంతో పోలిక రాకుండా దర్శక రచయితలు తీసుకున్న జాగ్రత్తలు గొప్పగా పండి నిజంగానే ఎవరికీ ఆ తలంపే రాలేదు.

చినుకు చినుకు అందెలతో పాటను బాబూమోహన్ సౌందర్యల మీద చిత్రీకరించడం విని తొలుత పరిశ్రమలో కొందరు నవ్వుకున్నా థియేటర్లలో దానికొచ్చిన రెస్పాన్స్ చూసి వాళ్ళ మొహంలో కత్తివేటుకు నెత్తుటి చుక్క లేదు. కోట, అలీ,బాబు మోహన్, గుండు కామెడీ ఓ రేంజ్ లో పేలింది. ఆడియో క్యాసెట్లు హాట్ కేక్స్ అయ్యాయి. 1993 ఆగస్ట్ 23న మాయలోడు రిలీజై ఏడు కేంద్రాల్లో వంద రోజులు ఆడటం చిన్న సినిమాలకు అంత సులభంగా సాధ్యమయ్యే ఫీట్ కాదు. ఇది 250 రోజులు పూర్తి కాగానే యమలీల రిలీజ్ కావడం ఇది అంతకు మించిన బ్లాక్ బస్టర్ అయ్యి రికార్డులు బద్దలు కొట్టడం మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకునే చరిత్ర. మళ్ళీ చెప్పుకుందాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి