iDreamPost
android-app
ios-app

ఎన్నో కలలు కంది.. కానీ, జీవితం ఇలా అర్థాంతరంగా..

ఎన్నో కలలు కంది.. కానీ, జీవితం ఇలా అర్థాంతరంగా..

ఆ యువతి ఎన్నో కలలు కంది. పెద్ద పెద్ద చదువులు చదివి తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకుంది. తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలుస్తాడు అన్నట్లు దేవుడు ఆమె జీవితాన్ని విషాదంగా ముగించాడు. లో బీపీ ఆమె నిండు ప్రాణాన్ని తీసింది. 19 ఏళ్లకే ఆమె జీవితం విషాదంగా ముగిసింది. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, బెళ్లంగడి తాలూకా, నరియ గ్రామానికి చెందిన 19 ఏళ్ల సుమ నర్సింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

మంగళూరులోని ఓ నర్సింగ్‌ కాలేజీలో చదువుతున్న ఆమెకు గత కొన్ని నెలలనుంచి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. అప్పుడప్పుడు లో బీపీ వస్తూ పోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో కాలేజీకి సెలవులు పెట్టి ఇంటికి వెళ్లిపోయింది. ఇంటి దగ్గర ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఆగస్టు 9న సుమ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమెను దగ్గరలోని ఆస్ప్రతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

అంతా బాగానే ఉంది అనుకుంటున్న సందర్భంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆగస్టు 13న అనారోగ్యం తిరగబెట్టింది. ఆస్పత్రికి తీసుకెళుతుండగానే సుమ మరణించింది. తమ కూతురు పెద్ద పెద్ద చదువులు చదివి తమకు పేరు తెస్తుందనుకున్న తల్లిదండ్రులకు తీరని లోటు మిగిలింది. విగతజీవిగా మారిన కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు సైతం సుమ మృతితో విషాదంలో మునిగిపోయారు. మరి, అనారోగ్యం కారణంగా నర్సింగ్‌ విద్యార్థిని మరణించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.