iDreamPost

పశ్చిమ బెంగాల్ లో ‘సీఎం పాట’ రాజకీయం

పశ్చిమ బెంగాల్ లో ‘సీఎం పాట’ రాజకీయం

పశ్చిమబెంగాల్లో ఢీ అంటే ఢీ అంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఓ పాట విషయంలో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. వివాదానికి కారణమైన ఆ పాట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసింది కావడం విశేషం. మహమ్మారి కరోనా పై అవగాహన కల్పించేలా సీఎం మమతాబెనర్జీ ఓ పాట రాశారు. ఆ పాటను విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా రేపు శనివారం రాష్ట్రమంతా ప్లే చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బిజెపి నేతలు అధికార పార్టీ పై ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయాన్ని బిజెపి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. విశ్వవిఖ్యాత గా ప్రఖ్యాతి గాంచిన రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితానికి, ఆయన వారసత్వానికి.. మమత రాసిన పాట కు సంబంధం ఏమిటి అంటూ బీజేపీ నేతలు అధికార పార్టీ ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కేవలం రాఘవేంద్రుడి ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా కరోనా కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని పలచన చేయడమే అని వారు ధ్వజమెత్తారు.

బిజెపి విమర్శలకు అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. విశ్వకవి రవీంద్రుడి జయంతిని పురస్కరించుకుని కరోనా పై ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికే సర్కార్ ప్రయత్నించిందని స్పష్టంచేస్తున్నారు. బిజెపి ప్రతిదానిని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. జయంతి రోజున ప్రభుత్వ, ఇతర ముఖ్యమైన భవనాల వద్ద ఠాగూర్ రాసిన పాటలతోపాటు సీఎం మమత రాసిన పాటను ప్లే చేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి