iDreamPost

యూట్యూబర్‌పై మద్రాసు హైకోర్టు సీరియస్.. అసలు ఏం జరిగిందంటే?

యూట్యూబర్‌పై మద్రాసు హైకోర్టు సీరియస్.. అసలు ఏం జరిగిందంటే?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒక్కొక్కరు ఒక్కొరకం టాలెంట్ తో ఫేమస్ అయిపోతున్నారు. వినూత్న ఆలోచనలతో వీడియోలు తీసి వాటిని యూట్యూబ్ లల్లో అప్ లోడ్ చేసి లక్షల్లో వ్యూస్ పొందుతూ యూట్యూబర్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇదే విధంగా ఓ యూట్యూబర్ యూట్యూబ్ లో బైక్ స్టంట్, రోడ్ ట్రిప్ వీడియోలు అప్ లోడ్ చేస్తూ లక్షలమంది ఫాలొవర్స్ ను సంపాదించుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల అతడు చేసిన ఓ బైక్ స్టంట్ వీడియో చిక్కుల్లో పడేసింది. అత్యంత ప్రమాదకర రీతిలో ర్యాష్ డ్రైవింగ్, బైక్ స్టంట్ చేయడంతో అతడిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆ యూట్యూబర్ పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడుకు చెందిన టీటీఎఫ్‌ వాసన్‌ యూట్యూబ్‌లో చాలా ఫేమస్ యూట్యూబర్. కాగా అతడు రోడ్లపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ వీడియోలు తీసి వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు. అయితే ఇటీవల సెప్టెంబరు 17న చెన్నై-వేలూరు హైవేపై బైక్ స్టంట్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గోడకు బలంగా తాకి పల్టీలు కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జు నుజ్జు కాగా ఆ సమయంలో అతడు హెల్మెంట్‌, రేస్‌ సూట్‌ వేసుకుని ఉండటంతో స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.

కాగా యూట్యూబర్ వాసన్ బైక్ స్టంట్ చేస్తూ ప్రమాదానికి గురైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. ప్రమాదకరంగా బైక్ స్టంట్ చేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించిన వాసన్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా వాసన్ బెయిల్ కోరుతూ సెషన్ కోర్టులో పిటీషన్ వేశాడు. ఆ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో వాసన్ బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో నేడు బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది.

ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ.. వాసన్‌కు రూ.20లక్షల ఖరీదు చేసే బైక్‌పై రూ.3లక్షల రేస్‌ సూట్‌ ధరించి ప్రమాదకర స్టంట్లు చేస్తున్నాడు. ఖరీదైన బైక్‌లు కొనుగోలు చేసి రేస్‌లకు రావాలని యువతను ప్రేరేపిస్తున్నాడని న్యాయస్థానానికి తెలిపారు. ఇక పీపీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు అతడి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాకుండా ఆ యూట్యూబ్ ఛానల్ ని మూసేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రమాదకర రీతిలో స్టంట్లు చేసే యూట్యూబర్లకు గుణపాఠంలా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి